వాళ్లకు అధికారం పట్టింది గురూ!

అధికారం ఉన్నప్పుడు అహంకారం పుడుతుంది. చాలా సహజం ఇది. దాన్ని అదుపులో ఉంచుకోకుంటే పొగరు పడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం వారికి కూడా అధికారం పట్టింది.. టన్నులు టన్నులుగా పట్టింది. అదే వారు తమ చేతల్లో నిరూపించుకుంటున్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి అయిదు సంవత్సరాల పాటు పరిపాలన సాగిస్తే ఇలాంటి సంఘటన ఎక్కడా ఎవరూ రుచి చూడలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల భార్యలలో రాజకీయ హోదాల అనుభవించిన వారు కూడా అనేక మంది ఉన్నారు కానీ, ఐదేళ్ల పదవీకాలంలో ఎక్కడ నాయకుల తరఫున భార్యలు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం మీద పెత్తనం చేసిన సందర్భాలు లేవు!

వైసీపీ నేతలు పోలీసుల్ని శాసించారనే ఆరోపణలు వచ్చాయి గానీ, వారి కుటుంబసభ్యులు కూడా వచ్చి పెత్తనం చేసినట్టు ఎవరూ అనలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీని సమర్థించడం మాత్రమే కాదు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఆయన భార్య కూడా ఎన్నడూ ప్రభుత్వ అధికార యంత్రాంగం మీద తాను స్వయంగా పెత్తనం చేయలేదు.

కానీ ఇప్పుడు చంద్ర సర్కారు ఎలా ఉన్నదో కడప జిల్లాలో స్పష్టంగా నిరూపణ అయింది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులను బెదిరించిన, దబాయించిన తీరు సర్వత్రా విమర్శల పాలవుతోంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరువు తీసే లాగా కూడా ఉంది. Readmore!

పోలీసు కాన్వాయ్ తనకు ఎస్కార్ట్‌గా రావాలంటే మంత్రి భార్య హరిత వారిని బెదిరించిన తీరు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా అధికారం పట్టింది గురూ అని ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. లేక లేక అధికారం వస్తే ఇలాగే కన్ను మిన్ను కాకుండా ప్రవర్తిస్తారని ఎద్దేవా చేస్తున్నారు.

‘‘నీకు జీతాలు ప్రభుత్వం ఇస్తుందా వైసిపి వారు ఇస్తున్నారా’’ అని నిలదీసిన హరిత వారికి ఆ జీతాలు తాను కూడా ఇవ్వడం లేదని తెలుసుకోవాలి. తన భర్త కూడా వారిలాగా ప్రభుత్వం వద్ద జీతం తీసుకుని పనిచేసే ఒక మంత్రి అనే సంగతిని కూడా ఆమె గ్రహించాలి. తన భర్త పెద్ద హోదాలో ఉన్న ఉద్యోగి అయినందుకు తనకు పెత్తనం చేసే అధికారం రాదని ఆమె అవగాహన చేసుకోవాలి.

అయితే హరిత వ్యాఖ్యల ద్వారా పోతున్న పార్టీ పరువును కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆయన స్వయంగా ఫోన్ చేసి మందలించినట్లుగా, ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని మంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ప్రజలు తమను అసహ్యించుకోకుండా చేయడానికి చంద్రబాబు ప్రయత్నం లాగా కనిపిస్తోంది.

Show comments