కొత్త వాల్ ఓకే.. కట్టేది ఎవరు?

పోలవరం డ్యాం నిర్మాణ పనులను పునరుద్ధరించే విషయంలో కీలకమైన ముందడుగు పడింది. తెలుగుదేశం హయాంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ చాలా వరకు దెబ్బతిన్న నేపథ్యంలో.. అదే వాళ్లకు మరమ్మతులు చేయాలా, లేదా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా అనే విషయంలో తర్జనభజనలు సాగుతూ వచ్చాయి.

తాజాగా పోలవరం డ్యామ్ ను పరిశీలించిన విదేశీ నిపుణులు కొత్త డయాగ్రమ్ వాల్ నిర్మించడానికి సిఫారసు చేసినట్లుగా, అందుకు కేంద్ర జలసంఘం ఛైర్మన్ కుష్వీందర్ ఓహ్రా కూడా అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలనే నిర్ణయం వరకు అంతా బాగానే ఉంది. మరమ్మతులు అంటే.. ఆ వ్యవహారం ప్రజల్లో గుబులుగానే ఉండిపోతుంది. దెబ్బతిన్నదానికి రిపేర్లు అంటే.. అది ఎంత బలంగా నిలబడుతుందో లేదో అనే భయం అలాగే మిగిలిపోతుంది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం అనేది అందరికీ ఆమోదయోగ్యమే.

అయితే ఇప్పుడు ప్రజల మదిలో కీలకంగా మెదలుతున్న సందేహం ఏంటంటే.. ఆ కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని చేపట్టబోయేది ఎవరు? కేంద్రం నుంచి నిధులు తీసుకుని రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తాం అంటూ.. మళ్లీ చంద్రబాబునాయుడు పనులు భుజానికెత్తుకుంటారా? లేదా, కేంద్రప్రభుత్వాన్నే నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకోమని అప్పగించేస్తారా? అనేది ఇప్పుడు ప్రజల్లోనే కాదు, తెలుగుదేశం పార్టీ వారిలో కూడా చర్చనీయాంశంగానే ఉంది. Readmore!

చంద్రబాబుకు... ప్రతి పనికి సంబంధించిన క్రెడిట్ కూడా తన ఖాతాలోకే రావాలనే కోరిక ఎక్కువని.. అందుకే కేంద్రం బాధ్యత అయిన పోలవరాన్ని కూడా నెత్తినేసుకుని ఎటూ కాకుండా చేశారని పార్టీ వారే అంటున్నారు. చంద్రబాబునాయుడు కాస్త ఆచరణాత్మకంగా ఆలోచించి.. అమరావతి నగర నిర్మాణం మీద తన దృష్టి పూర్తిగా కేంద్రీకరించి, దానికోసం మాత్రమే కేంద్రాన్ని నిధులకోసం అడుగుతూ, ఇప్పించుకుంటూ ఆ పనులు పూర్తి చేస్తే చాలునని అంటున్నారు.

పోలవరం బాధ్యత వారి మీదనే పెట్టేస్తే, నిధులు అడిగే పని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని సూచిస్తున్నారు. బిజెపి ఎటూ పాలక కూటమిలోని పార్టీనే గనుక.. వారు పూర్తి చేసినా సరే.. ఉమ్మడిగా క్రెడిట్ తీసుకోవచ్చునని కూడా అంటున్నారు. మరి ఇలాంటి మాటలు చంద్రబాబు నాయుడు చెవికెక్కుతాయో లేదో, ఆయన పోలవరం భారం దించుకుని.. పూర్తి ఫోకస్ ను ఇతర పరిపాలన వ్యవహారాలు, అమరావతి మీద పెడతారో లేదో చూడాలి.

Show comments