ఆమెకు ప‌ద‌వి ఇస్తే... మా గ‌తేం కావాలి?

తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (తుడా) చైర్మ‌న్ ప‌ద‌విపై కూట‌మి నేత‌ల క‌న్ను ప‌డింది. తుడా చైర్మ‌న్ ప‌ద‌వి త‌మ‌కు కావాలంటే త‌మ‌కంటూ తీవ్ర‌స్థాయిలో కూట‌మి నేత‌లు పోటీ ప‌డుతున్నారు. ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో పోటీ నెల‌కుంది. ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరిన డాల‌ర్స్ దివాక‌ర్‌రెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. తాజాగా మ‌రికొంద‌రి పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో టీటీడీ మాజీ చైర్మ‌న్‌, మాజీ ఎంపీ డీకే ఆదికేశ‌వులునాయుడి మ‌న‌వ‌రాలు చైత‌న్య‌కు తుడా చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. ఎన్నిక‌ల‌కు ముందు ఈమె ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేతుల మీదుగా జ‌న‌సేన కండువా క‌ప్పుకున్నారు. చిత్తూరు అసెంబ్లీ సీటును ఆశించారు. అయిన‌ప్ప‌టికీ ద‌క్క‌లేదు. 2014లో చైత‌న్య అవ్వ స‌త్య‌ప్ర‌భ చిత్తూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ సీటును ఆశించి చైత‌న్య భంగ‌ప‌డ్డారు.

అయితే కూట‌మి అధికారంలోకి రావ‌డంతో తుడా చైర్మ‌న్ ప‌ద‌వి ఆమెకు ఇస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో తిరుప‌తి రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా ఆందోళ‌న మొద‌లైంది. తిరుప‌తి అసెంబ్లీ టికెట్ చిత్తూరు వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసుల‌కు ఇచ్చార‌ని, ఇప్పుడు తుడా చైర్మ‌న్ ప‌ద‌విని కూడా ఆ పార్టీకే ఇస్తే, ఇక త‌మ గ‌తేం కావాలంటూ తిరుప‌తి టీడీపీ నాయ‌కులు విజ‌య‌వాడ‌కు వెళ్లి లోకేశ్‌, చంద్ర‌బాబు ఎదుట గ‌గ్గోలు పెట్టిన‌ట్టు తెలిసింది. ఇలాగైతే తిరుప‌తిలో తాము రాజ‌కీయాలు చేయ‌లేమ‌ని టీడీపీ నేత‌ల‌ ఎదుట తిరుప‌తి ద్వితీయ శ్రేణి నాయ‌కులు తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం.

తుడా చైర్మ‌న్ ఎవ‌ర‌నే విష‌య‌మై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని, ప్ర‌చారాల్ని న‌మ్మొద్ద‌ని చెప్పి బుజ్జ‌గించి పంపిన‌ట్టు తిరుప‌తి టీడీపీ నేత‌లు తెలిపారు. తిరుప‌తికి సంబంధించిన ప‌ద‌వుల్ని జ‌న‌సేన‌కు, అందులోనూ చిత్తురు వారికి క‌ట్ట‌బెడితే ఇక తామెందుక‌ని తిరుప‌తి నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. తుడా చైర్మ‌న్ ప‌ద‌వి చివ‌రికి ఎవ‌రి వ‌శ‌మ‌వుతుందో చూడాలి. Readmore!

Show comments