గాలి దుమారం చల్లారినట్టు కాదు!

తెలంగాణ కాంగ్రెస్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడం పర్యవసానంగా చెలరేగిన గాలి దుమారం ప్రస్తుతానికి చల్లారినట్టే కనిపిస్తోంది. తనకు కనీస సమాచారం లేకుండా సంజయ్ కుమార్ ను పార్టీలోకి తీసుకోవడం అనేది చాలా అవమానకరంగా అక్కడి పార్టీ అభ్య‌ర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భావించారు.

అలిగి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వంటి నాయకులు ఆయనను పదేపదే కలిసి బుజ్జగించడం, ఢిల్లీ తీసుకువెళ్లి కేసీ వేణుగోపాల్ తో భేటీ వేయించడం.. ఆయన సీనియారిటీకి తగిన ప్రాధాన్యం తప్పకుండా దక్కుతుందని ఆయన హామీ ఇవ్వడం వలన.. ప్రస్తుతానికి జీవన్ రెడ్డి శాంతించారు.

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నంత మాత్రాన తెలంగాణ కాంగ్రెసులోని గాలిదుమారం చల్లారినట్టు కాదు. తాను పార్టీని వీడకుండా కొనసాగినంత మాత్రాన.. జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ చేరికను ఆమోదించినట్టు కాదు. ఆ సంకేతాలు ఆయన ఢిల్లీలోనే ఇచ్చారు. అందుకే చేరికల పర్యవసానంగా తలెత్తుతున్న గాలిదుమారం ఇంకా సద్దుమణగలేదనే భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇక్కడ గమనించాల్సిన మరో సంగతి ఏంటంటే.. భారాస ఎమ్మెల్యేలను కాంగ్రెసులో చేర్చుకోవడం అనేది ఇక్కడితో ఆగిపోవడం లేదు. తమ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని, భారాస ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా చేర్చుకుంటాం అని.. దీపాదాస్ మున్షీ చాలా స్పష్టంగా చెబుతున్నారు. అంటే ముందు ముందు బోలెడు మంది వచ్చే అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెసు తరఫున పోటీచేసి ఓడిపోయిన వారందరికీ ఆ  పరిణామాలు కంటగింపుగా మారుతాయి. అంటే ముందు ముందు ఎన్ని చేరికలు ఉండబోతున్నాయో.. అన్ని తుపానులకు, గాలి దుమారాలకు పార్టీ సిద్ధంగా ఉండాలన్నమాట. Readmore!

అలాంటి వివాదాల్లో కొన్నింటిని నాయకులు సులువుగానే బుజ్జగించగలరు. కొన్నింటిని ఏమీచేయలేరు. అలిగిన నాయకులు.. కౌంటర్ గా భారాసలోకి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం అవుతోంది. ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికలను ప్రస్తావించి భారాసను సున్నా చేయడం తన లక్ష్యమని, దానిని సాధించానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఫిరాయింపుల మీద ఆశతో.. ఎమ్మెల్యేల సంఖ్యపరంగా కూడా భారాసను సున్న చేయడం లక్ష్యంగా రేవంత్ అడుగులు వేస్తారా? అనేది చూడాలి.

Show comments