రామారావును గాలికొదిలి రామోజీ పాట ఎత్తుకున్నారా?

చంద్రబాబునాయుడు కుల రాజకీయాలు చేస్తుంటారని, తన సొంత కులానికి పెద్దపీట వేస్తుంటారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో చాలా చాలా వినిపిస్తుంటాయి. విమర్శలు ఎన్ని వినిపిస్తున్నా సరే.. ఆయన తనలోని కుల ప్రేమను మళ్లీ మళ్లీ చాటుకుంటూనే ఉంటారు.

తాజాగా ఇప్పుడు ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావుకు మరణానంతరం భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ను భుజానికెత్తుకున్నారు. రామోజీరావు తెలుగు మీడియాకు మాత్రమే కాదు, దేశంలోనే పత్రికారంగానికి సంబంధించి ఒక గొప్ప వ్యక్తి అనడంలో సందేహం లేదు. కానీ.. ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చంద్రబాబునాయుడు నుంచి రావడం వల్ల దానికి విలువపడిపోతోంది.

చంద్రబాబునాయుడు కేవలం ఒక రాజకీయ గిమ్మిక్కులాగా.. స్వకులం వారినందరినీ సంతుష్టపరచడానికి మాత్రమే రామోజీకి భారతరత్న అనే పాట ఎత్తుకున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు నాయుడు తనకు ఎన్టీఆర్ పేరును స్మరించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడెల్లా ఒక పాట పాడుతూ ఉంటారు. చంద్రబాబునాయుడు ‘ఎన్టీఆర్ కు భారతరత్న’ అనే పాట ఎత్తుకున్న తర్వాత.. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామిగా ఉండడం ఇది రెండోసారి. Readmore!

ప్రతి ఏడాదీ.. ఎన్టీఆర్ జయంతి నాడో, వర్ధంతి నాడో.. ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చేయడం.. ఆ తర్వాత తనకు అలవాటైన అవకాశవాదంతో మరచిపోవడం చంద్రబాబుకు అలవాటే. ఇప్పుడు అదే అవకాశవాద ధోరణిలో రామోజీరావు సంస్మరణకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ వినిపించారు.

రామోజీకి అత్యున్నత గౌరవం దక్కితే చాలా మంది సంతోషిస్తారు. కానీ, చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో ఆ మాటలు అన్నాడంటే మాత్రం నమ్మలేకపోతున్నారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ముందు ఎన్టీరామారావుకు భారతరత్న ఇప్పిస్తారని, ఆ తర్వాత రామోజీరావు పేరు తెరపైకి వస్తుందని అంటున్నారు. ఏ రోటికాడ ఆ పాట పాడే అలవాటున్న రాజకీయాల్లో.. చంద్రబాబునాయుడు మాటలను నమ్మడం కష్టమని పలువురు అంటున్నారు.

Show comments