రుషికొండ నిర్మాణాలను కూల్చేస్తారా?

విశాఖ రుషికొండ మీద అయిదు వందల కోట్లతో గత వైసీపీ ప్రభుత్వం బ్రహ్మాండమైన కట్టడాన్ని నిర్మించింది. అయితే ఇది ప్రారంభం నుంచి వివాదాస్పదం అవుతూనే ఉంది. నిబంధలనకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని పర్యావరణ హితానికి భిన్నంగా ఈ నిర్మాణాలు ఉన్నాయని హరిత ట్రిబ్యునల్ దాకా వెళ్ళి వాజ్యాలు వేశారు.

అది ఒక కోణం అయితే మరో కోణంలో రాజకీయంగా కూడా రుషికొండ నిర్మాణాలు కాక రేపాయి. విపక్షాలు అన్నీ కలసి రుషికొండను బోడి గుండు చేశారని విమర్శించాయి. రుషికొండ మీద అక్రమ నిర్మాణాలు రహస్య నిర్మాణాలు అని రాజకీయ రచ్చకు తెర లేపాయి.

అయితే దానికి వైసీపీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకుండా పోయింది. అవి అక్రమం కాదు సక్రమం అని చెప్పడానికి మీడియాను అనుమతించినా పోయేది. అలా కాకుండా వైసీపీ మౌనంగా ఉండడం భారీ ఆంక్షలు పెట్టడంతో దాని మీద సామాన్య జనంలోనూ అనుమానాలు విపరీతంగా పెరిగిపోయాయి.

ఈ క్రమంలో వైసీపీ సర్కార్ దిగిపోయి టీడీపీ వచ్చాక రుషికొండనే ముందు పెట్టి వైసీపీ సర్కార్ దుబారా అని విమర్శలు చేస్తూ వచ్చారు. రుషికొండ మీద జగన్ సొంత భవనాలు నిర్మించుకున్నారని అన్నారు. అయితే ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం నిర్మించిన భవనాలు ఎలా జగన్ కి చెందుతాయన్న లాజిక్ ని మిస్ అయ్యారు. దీని మీద వైసీపీ నేతలు అయితే అది ప్రభుత్వ కట్టడమని, అతిధి గృహమని దానిని ఏ విధంగా వాడుకుంటారో ప్రభుత్వం ఇష్టమని అన్నారు. కోర్టు అనుమతులు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు తీసుకునే నిర్మించామని కూడా చెప్పారు. Readmore!

దీని మీద ప్రభుత్వం ఏమి చేయాలన్నది ఇంకా ఏమీ స్పష్టం చేయలేదు. ఈలోగానే రకరకాలైన సలహా సూచనలు వస్తున్నాయి. విశాఖకు చెందిన కేంద్ర పర్యావరణం అటవీ మంత్రిత్వ శాఖ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తాజాగా ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విశాఖ రుషికొండ నిర్మాణాల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఈ నిర్మాణాలను కూల్చేయాలని కూడా ఆయన సూచించడం విశేషం. ఈ నష్ట పరిహరాన్ని అధికారుల ఖాతాలో వేసి వారి నుంచి రాబట్టాలని శర్మ సలహా ఇచ్చారు.

గతంలో కేరళలో ఇలాంటి నిర్మాణాల మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఇదే ఉందని అన్నారు. పర్యావరణ హితానికి విరుద్ధమైతే కూల్చేయాలని పేర్కొన్న నేపధ్యంలో రుషికొండ భవనాలను అలాగే చేయాలని సూచించారు. సీఆర్ జెడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇప్పటికే విచారణ కమిటీ తేల్చిందని శర్మ అంటున్నారు. ఈ రకమైన డిమాండుతో ఆయన కేంద్రానికి లేఖ రాయడం పట్ల కొత్త చర్చకు తెర లేస్తోంది. రుషికొండ భవనాలను కూల్చేస్తే అయిదు వందల కోట్లు బుగ్గి పాలే అని అంటున్నారు. అధికారుల నుంచి అన్ని వందల కోట్లు రాబట్టడం సాధ్యమా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

Show comments