రెడ్ బుక్ ఎందుకంటే.. హోం మంత్రి చెప్పిందిదే!

టీడీపీ కూటమి ప్రభుత్వం మంత్రులు కక్ష సాధింపులు ఉండవని ఒక వైపు చెబుతూనే కొంతమంది మీద  చర్యలు ఉంటాయని మరో వైపు అంటున్నారు. హోం మంత్రి అనిత కూడా ఇదే విషయం చెప్పారు. ఆమె విశాఖలోని పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రెడ్ బుక్ అని టీడీపీ యువ నేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ప్రకటిస్తూ వచ్చారు. దాని మీద హోం మంత్రి ప్రస్తావించారు. రెడ్ బుక్ అన్నది దేని కోసం అంటే వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు పాటించని అధికారుల మీద చర్యలు తీసుకోవడానికే అని ఆమె స్పష్టం చేశారు.

రెడ్ బుక్ అంటే కక్ష సాధింపు చర్యలకు కాదని ఆమె అంటూనే అధికారుల మీద తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తాను సోషల్ మీడియా బాధితురాలిని అని అనిత అన్నారు. అసభ్య పోస్టులతో వేధిస్తూ కొంతమంది దూకుడు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అలాంటి వారి మీద కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేశారని కొత్త హోం మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా పోలీస్ అకాడమీల నిర్మానాలను ఎక్కడా చేయలేదని ఆమె విమర్శించారు. కొత్తగా పోలీస్ ఉద్యోగం కూడా తీయలేదని అన్నారు. Readmore!

తమ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని ఆమె చెప్పారు. తన మంత్రిత్వ శాఖ అజెండా ఆమె వివరించారు ఏపీలో ఎక్కడా గంజాయి అన్న మాట లేకుండా నిర్మూలిస్తామని అన్నారు. అలాగే మహిళలకు రక్షణ కల్పిస్తామని, పోలీసుల సంక్షేమం చూస్తామని కొత్తగా నియామకాలు చేపడతామని అన్నారు.

అదే విధంగా రెడ్ బుక్ విషయంలో మాత్రం అనిత క్లారిటీ ఇచ్చారు. అధికారుల మీద చర్యలు తప్పవని చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆమె అన్నారు. హోం మంత్రి చెప్పిన దాని ప్రకారం అధికారుల మీద చర్యలకే రెడ్ బుక్ పరిమితం అవుతుందా లేక రాజకీయ నేతలు ప్రత్యర్ధి పార్టీకి చెందిన కీలక నేతల మీద సైతం చర్యలు ఉంటాయా అన్న చర్చకు తెర లేస్తోంది. పోలీసులు ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పనిచేస్తారు. వారి మీద రెడ్ బుక్ పేరుతో చర్యలు తీసుకోవడం పైనా చర్చ సాగుతోంది.

Show comments