Manjummel Boys Review: మూవీ రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్

చిత్రం: మంజుమ్మల్ బాయ్స్ 
రేటింగ్: 3/5
తారాగణం: సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్ఘీస్, గణపతి, లాల్, దీపక్ పరంబోల్, అభిరాం రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, చందు, విష్ణు, ఖాలిద్ రెహ్మాన్, షెబిన్ బెన్సన్, జార్జ్ మర్యన్, కదిరేశన్ తదితరులు 
కెమెరా: సైజు ఖాలిద్
ఎడిటింగ్: వివేక్ హర్షన్
సంగీతం: సుషీన్ శ్యామ్
నిర్మాత: సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంతోనీ
దర్శకత్వం: చిదంబరం
విడుదల: 6 ఏప్రిల్ 2024

ఒక సినిమా పక్క రాష్ట్రంలో అద్భుతంగా ఆడిందనగానే దాని మీద దృష్టి పడుతుంది. అది వెంటనే డబ్ అయ్యి తెలుగులోకొస్తే అందులో ఏముందో అనుభూతి చెందాలని కూడా అనిపించడం సహజం. 

"మంజుమ్మల్ బాయ్స్" అనే మలయాళ చిత్రం ఫిబ్రవరిలో విడుదలయ్యి 200 కోట్లు వసూలు చేసింది. ఇది మలయాళ చిత్ర చ‌రిత్ర‌లోనే నెంబర్ 1 రికార్డ్. పెట్టుబడి చూస్తే 10 కోట్లకి అటు ఇటు. అదే హాట్ టాపిక్. ఇది ఇప్పుడు తెలుగులోకొచ్చింది. 

కథేంటంటే.. మంజుమ్మల్ కి చెందిన ఓ 10 మంది స్నేహితులు కలిసి కొడైకెనాల్ టూరుకి వెళ్తారు. అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియాలోని గుణ కేవ్ అనే చోటుకి వెళ్లాక, అనుకోకుండా ఈ గుంపులో ఒక మిత్రుడు లోతైన గోతిలో పడతాడు. ఎంత లోతో కూడా తెలియనంత చీకటి గోయి అది. అతనున్నాడా, పోయాడా? అతనిని ఎవరు కనుగొని ఎలా వెలికి తీస్తారు అనేది కథ. సింగిల్ లైన్లో చెప్పాలంటే గొతిలో పడ్డ మిత్రుడి కథ. అంతే. 

ఈ కథలో ఎక్కడా హీరోయిన్ లేదు. కథనంలో తొలి అరగంట గందరగోళంగానూ, అనాసక్తికరంగానూ ఉంటుంది. ఈ గుంపంతా కలిసి గుణ కేవ్ దగ్గరకి వెళ్లడం దగ్గర్నుంచే ఆసక్తి మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి ఇంటర్వల్, ఆ తర్వాత మొత్తం సెకండ్ హాఫ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. 

ఈ సినిమాలో ఉన్న గొప్పతనమేంటంటే ప్రతి పాత్ర సహజంగా ప్రవర్తిస్తుంటుంది. ఇందులో అనే కాదు ప్రతి మలయాళం సినిమాలోనూ అది కామన్. పైగా పెద్దగా పేరున్న నటులు లేకపోవడం వల్ల నటులుకంటే పాత్రలే కనిపిస్తుంటాయి. 

తొలి అరగంట పక్కన పెడితే, ఒకే లొకేషన్లో దాదాపు రెండు గంటల సినిమా నడపడం కష్టమే. స్క్రీన్ ప్లే అత్యంత బలంగా ఉంటే తప్ప కూర్చోబెట్టడం కష్టం. అలాంటి అద్భుతమైన స్క్రీన్ ప్లేల్లో ఇదొకటి. 

ఇది కచ్చితంగా గ్రిప్పింగ్ సినిమా. కానీ 200 కోట్లు వసూలు చేసేటంత గొప్పతనం ఇందులో ఏముందో మాత్రం అర్ధం కాదు. ఆ మాటకొస్తే "ఘాజీ ఎటాక్" దీనికంటే గొప్ప చిత్రం అనుకోవాలి. కానీ వసూళ్లపరంగా ఈ స్థాయిలో చేయలేదు ఆ చిత్రం. కనుక టైమో, టైమింగో కలిసొచ్చి ఈ "మంజుమ్మల్ బాయ్స్" మరీ ఈ స్థాయిలో కలెక్ట్ చేసిందనుకోవాలి. 

స్క్రీన్ ప్లే టైటిల్స్ నుంచే మొదలయింది. "గుణ" సినిమాలోని "కమ్మని నీ ప్రేమ.." పాటతో టైటిల్స్ నడవడం, కొడైకెనాల్ టూరుకి వెళ్తున్నాం అనగానే సీడీలమ్మే అతను "గుణ" పాటల సీడీ ఇచ్చి వింటూ ప్రయాణించమని చెప్పడం, కొడైకెనాల్ లో కమల్ హాసన్ షూట్ చేసిన "గుణ కేవ్" ఉందని చెప్పడం.. కథంతా దాని చుట్టూ తిరగడం.. ఒక అనుభూతినిస్తుంది. 

కేవలం రెస్క్యూ ఆపరేషన్ లా కాకుండా గుణ కేవ్ చుట్టూ ఒక మిస్టరీ, దానికి తోడు స్క్రీన్ ప్లేలో రెండు మూడు సర్రియలిస్టిక్ డ్రీం షాట్స్ తో మిస్టరీని ఇంకా పెంచి మిస్లీడ్ చేసే ప్రయత్నం చేయడం వంటివి దర్శకుడి ప్రతిభకు నిదర్శనాలు. 

టెక్నికల్ గా చూసుకుంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా ఈ కథకి పర్ఫెక్ట్ గా ఉంది. 

కానీ మొదటి అరగంటలో వచ్చే పాటలు గానీ, డైలాగ్స్ గానీ గోల గోలగా ఉన్నాయి. ఒక పాటలో "మది గవాక్షమే చూపుతోందా.." లాంటి వాక్యాలు వినపడ్డాయి. తెలుగు సరిగా రాని యూత్ ఆడియన్స్ అది మలయాళమేనేమో అని అనుకునే అవకాశం లేకపోలేదు. డబ్బింగ్ క్వాలిటీ యావరేజ్ అనే చెప్పాలి. 

తొలి అరగంటలో చూపించే కొన్ని షాట్స్ కి అసలు కథకి తరవాత లింక్ చేయడం బాగుంది. ఉదాహరణకి టగ్ ఆఫ్ వార్ సన్నివేశం..!

నటుల్లో అందరూ సహజంగా ఉన్నారు. ప్రత్యేకించి ఫలానా నటుడు బ్రహ్మాండంగా చేసాడు అని చెప్పడానికి లేదు. ప్రధాన పాత్ర మాత్రం సౌబిన్ షాహిర్ కనుక సినిమా పూర్తయ్యాక అతనే ఎక్కువగా గుర్తుంటాడు. ఇతను నిర్మాతల్లో ఒకడు కూడా. మొత్తం సినిమాలో జార్జ్ మర్యన్ ఒక్కడే కాస్తంత సుపరిచితుడు. 

మలయాళ చిత్రజగత్తులోనే గొప్ప సినిమా అనగానే మనవాళ్లు బాహుబలి రేంజ్ అంచనాలు పెట్టుకుని వెళ్తే కష్టమే. అలా కాకుండా ఒక సగటు మలయాళ సినిమా అనుకుని వెళ్తే మాత్రం ఆసక్తిగా కూర్చోబెట్టేస్తుంది. రెండుంపావు గంటల సినిమాయే అయినా అందులో అసలు గ్రిప్పింగ్ గా సాగే భాగం గంటన్నర! మధ్యాహ్నం మొదలై, రాత్రికి ముగిసే కథ ఇది! 

సినీరంగం వారికి టేక్ హోం ఏంటంటే.. స్క్రీన్ ప్లే విషయంలో ఈ చిత్రం ఒక పాఠ్యపుస్తకం లాంటింది. చాలా విషయాలు నేర్చుకోవచ్చు. 

ఈ సినిమా చూసాక.. కమర్షియల్ హంగులకి, ఫార్ములాలకి పోకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త తరహా సినిమా అందించాలనే కేరళీయుల ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా గౌరవించాలనిపిస్తుంది.

ఈ సినిమా దాంతో పాటూ కమర్షియల్ గా పెద్ద విజయాన్ని అందుకోవడం మరింత ప్రశంశనీయం. కానీ మరీ ఈ రేంజులో హిట్టవడం ఆశ్చర్యం. 

తెలుగువాళ్లు మలయాళం స్థాయి హిట్ ఇస్తారా అంటే.. అనుమానం! 

బాటం లైన్: "లోతైన" కథ

Show comments

Related Stories :