కూల్చివేత‌... టీడీపీ శ్రేణుల్ని భ‌య‌పెడుతున్న సెంటిమెంట్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నూత‌న ప్ర‌భుత్వం కొలువుదీరిన నేప‌థ్యంలో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా పాల‌న ప్రారంభం కాలేదు. ఈ మాట అంటున్న‌ది ప్ర‌తిప‌క్షాలు కాదు. కూల్చివేత‌ల‌పై టీడీపీ శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. దీనికి కార‌ణం సెంటిమెంట్‌. గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ ఏర్ప‌డిన త‌ర్వాత మొట్ట‌మొద‌ట చేసిన ప‌ని..... అక్ర‌మ నిర్మాణం అంటూ ప్ర‌జావేదిక కూల్చివేత‌.  నాడు జ‌గ‌న్ స‌ర్కార్ ఏర్ప‌డిన త‌ర్వాత శుభ‌మా అని నిర్మాణంతో మొద‌లు పెట్ట‌లేదు. కూల్చివేత‌తో మొద‌లు పెట్టి, చివ‌రికి 11 సీట్ల‌కు ప‌రిమిత‌మై వైసీపీ కూలిపోయిందనేది ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌.

అయితే కూట‌మి ప్ర‌భుత్వం... గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ కంటే భిన్నంగా పాల‌న మొద‌లు పెట్ట‌లేద‌నే చ‌ర్చ మొద‌లైంది. తాడేప‌ల్లిలో ప్ర‌భుత్వ స్థ‌లాన్ని ఆక్ర‌మించి అనుమ‌తుల్లేకుండా వైసీపీ కేంద్ర కార్యాల‌య నిర్మాణం చేప‌ట్టార‌ని, అందుకే దాన్ని కూల్చేసిన‌ట్టు ప్ర‌భుత్వ పెద్ద‌లు, టీడీపీ నేత‌లు చెబుతున్నారు. అక్ర‌మాల్ని కూల్చ‌డంలో ఎలాంటి త‌ప్పు లేదు. అయితే వైసీపీ కేంద్ర కార్యాల‌యం కూల్చివేత‌లో అక్ర‌మాల కంటే, ప్ర‌జ‌ల‌కు టీడీపీ అక్క‌సు క‌నిపిస్తోంది.

చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌రిపాల‌న‌ను కూల్చివేత‌తో మొద‌లు పెట్టింద‌ని, చివ‌రికి ఏమ‌వుతుందో అని టీడీపీ కార్య‌క‌ర్త‌లు, సానుభూతిప‌రుల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొలువుదీరి ప‌ది రోజులైంది. ఇంత వ‌ర‌కూ ఎక్క‌డా నూత‌న నిర్మాణాల‌కు భూమి పూజ లాంటి మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్ట‌లేదు. కూల్చివేత‌ల‌తోనే పాల‌న ప్రారంభం కావ‌డాన్ని టీడీపీ కార్య‌క‌ర్త‌లు గుర్తు చేస్తున్నారు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ అనుమ‌తులు లేకుండా వైసీపీ కార్యాల‌యాలు ఎక్క‌డున్నా కూలుస్తామ‌ని హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో తాడేప‌ల్లిలో వైసీపీ కేంద్ర కార్యాల‌యం కూల్చివేత‌తోనే టీడీపీ ప‌గ చ‌ల్లార‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. రానున్న రోజుల్లో వైసీపీ కార్యాల‌యాల‌పై య‌థేచ్ఛ‌గా బుల్డోజ‌ర్ల దాడి జ‌ర‌గ‌నుంది. ఇందుకు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మాన‌సికంగా సిద్ధ‌ప‌డాల్సిన త‌రుణం వ‌చ్చింది. ఈ ప‌రిణామాల్ని ధైర్యంగా ఎదుర్కోవ‌డం ఒక్క‌టే వైసీపీ ముందున్న అతిపెద్ద స‌వాల్‌. చంద్ర‌బాబు స‌ర్కార్ కూల్చివేత‌ల‌పై టీడీపీ పెద్ద‌ల అభిప్రాయాలు ఎలా ఉన్నా, కిందిస్థాయిలో గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ కూల్చివేత‌లు, తాజాగా దారుణ ఓట‌మే గుర్తు చేసుకుంటున్నారు. Readmore!

ఈ ప‌రిణామాలు జ‌గ‌న్‌పై సానుభూతి పెంచి, రానున్న రోజుల్లో టీడీపీ ప‌రిస్థితి ఏమ‌వుతుందో అనే భ‌యం ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో చూడొచ్చు. ఏదీ శాశ్వ‌తం కాద‌ని న‌మ్మే విజ్ఞులెప్పుడూ, భ‌విష్య‌త్ ప‌రిణామాల గురించి ఆలోచిస్తారు. తాత్కాలిక ఆనందాన్ని కోరుకునే వారు మాత్ర‌మే విధ్వంసానికి తెగ‌బ‌డుతారు. క‌ళ్లెదుటే జ‌గ‌న్ స‌ర్కార్ కూలిపోవ‌డాన్ని చూసి కూడా, తాము కూడా అదే ప‌ని చేసే వారిని ఏమ‌నాలి?  టీడీపీ కిందిస్థాయి ఆందోళ‌న ఆలోచింప‌ద‌గ్గ‌దే. అయితే అది పైస్థాయిలో లేక‌పోవ‌డ‌మే విచార‌క‌రం.

Show comments