బాబు ఆదేశం సూపర్: ఆచరణ ఎలా ఉంటుందో?

పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని.. రాజకీయంగా తమ ప్రత్యర్థులను హెచ్చరించే సందర్భాలు, ఇబ్బంది పెట్టే సందర్భాలు ఇవాళ్టి రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. ఆ క్రమంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. వారి ప్రత్యర్థి పార్టీకి సంబంధించి ఏ కొంచెం దూకుడుగా వ్యవహరించే వారున్నా.. వారి మీద రౌడీషీట్లు తెరవడం, తద్వారా వారిని కట్టడి చేయడం జరుగుతుంటుంది.

ఇప్పుడు చంద్రబాబునాయుడు పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్న మాటలు.. ఈ విషయంలో గొప్పగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయం కక్షసాధింపులు లేని ఆశావహ వాతావరణంలో సాగుతుందేమో అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజులుగా తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్కడి అధికారులతో ఒక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులను సమీక్షించారు. ఒక నెలలోగా అభివృద్ధి కనిపించాలని పురమాయించారు.

ఇవన్నీ ఒక ఎత్తు కాగా, శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయన పోలీసు అధికార్లకు అనేక ఆదేశాలు చేశారు. ఆయన కుప్పం అధికార్లతో సమావేశంలో చెప్పిన మాటలే అయినప్పటికీ.. ముఖ్యమంత్రి కావడం వల్ల.. ఆ మాటలు యావత్ రాష్ట్రానికి కూడా అన్వయిస్తాయనే అనుకోవచ్చు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాజకీయ ప్రేరేపితంగా తెరవబడిన రౌడీషీట్లు, అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన పోలీసులను పురమాయించారు. సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ముందు ఈ పనిచేస్తుంటుంది. అందులో వింతేమీ లేదు. అయితే చంద్రబాబు మాత్రం ‘కూటమి పాలనలో ఎవరిపైనా అనవసరంగా కేసులు పెట్టొద్దు. రౌడీషీట్లు తెరవొద్దు’ అని ఆదేశించారు. ఇలాంటి ఆదేశాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రిని అభినందించాలి. Readmore!

అయితే, చంద్రబాబునాయుడు మాటల్లోని స్ఫూర్తి బాగానే ఉంది. కానీ, ఆచరణలో అలాగే అమలవుతుందా? అనేది పెద్ద సందేహం. ఎందుకంటే.. కూటమి ఘన విజయం సాధించిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ వారి మీద దాడులు, విధ్వంసాలు పెరిగాయి. పోలీసుల మద్దతుతో అధికార పార్టీ వారు వీటిని రివర్సులో తెదేపాపై జరిగిన దాడులుగా, లేదా, ఘర్షణలుగా ప్రచారం చేస్తున్నారు.

కొత్తగా రౌడీషీట్లు తెరవొద్దు- అంటూ చంద్రబాబు చెప్పిన మాట శాంతి భద్రతల పరంగా మంచి వాతావరణానికి చిహ్నం. కానీ.. తెదేపా ప్రేరేపితంగా.. వైసీపీ వారి మీద కక్షసాధింపు రౌడీషీట్లు పెట్టకుండా ఉంటారా? అనేది పలువురిలోని భయం. ఆచరణలో చంద్రబాబు మాటలు అమలైతేనే రాష్ట్రంలో మంచి సుహృద్భావ వాతావరణం ఉంటుందని.. అలా కాకుండా మాటలు ఒక రకంగా, చేతలు మరో రకంగా ఉంటే.. కక్షలు కార్పణ్యాలు ఎప్పటికీ పెచ్చరిల్లుతూనే ఉంటాయని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Show comments