హ‌త్య కేసులో బొండా ఉమా కోడ‌లి పేరు!

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ మ‌హిళా కార్య‌క‌ర్త, ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియ అత్యంత స‌న్నిహితురాలు అట్ల శ్రీ‌దేవి హ‌త్య కేసులో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు కోడ‌లు ఏవీ జ‌శ్విత‌రెడ్డి ప్ర‌మేయం ఉన్న‌ట్టు బాధితులు ఫిర్యాదు చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డి దాయాదులైన ఏవీ భాస్క‌ర్‌రెడ్డి, ఏవీ గోపాల్‌రెడ్డి అనే అన్న‌ద‌మ్ముల మ‌ధ్య 20 ఏళ్లుగా గొడ‌వ‌లున్నాయి.

ఈ నేప‌థ్యంలో రెండు రోజుల క్రితం భాస్క‌ర్‌రెడ్డి భార్య శ్రీ‌దేవిని హ‌త్య చేశారు. త‌న‌కు అత్యంత స‌న్నిహితురాలైన శ్రీ‌దేవి హ‌త్య‌పై ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియ ఫైర్ అయ్యారు. ఈ కేసులో మొద‌టి నిందితులుగా ఏవీ గోపాల్‌రెడ్డి, ఆయ‌న భార్య శిరీష‌, వారి కుమారుడు కేదార్‌నాథ్‌రెడ్డితో పాటు ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడైన ఏవీ సుబ్బారెడ్డి కుటుంబ స‌భ్యుల‌పై కేసు న‌మోదైంది.

హ‌త్య కేసులో ఏవీ సుబ్బారెడ్డితో పాటు ఆయ‌న ముగ్గురు కుమార్తెలు ఏవీ జశ్విత‌రెడ్డి, చ‌రిష్మారెడ్డి, జాహ్న‌విరెడ్డిల‌పై కూడా బాధితుడైన ఏవీ భాస్క‌ర్‌రెడ్డి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. వీరిలో జ‌శ్విత‌రెడ్డికి టీడీపీ సీనియ‌ర్ నేత బొండా ఉమా కుమారుడు సిద్ధార్థ్‌తో రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం జ‌రిగింది. ప్ర‌స్తుతం సిద్ధార్థ్‌, జ‌శ్విత‌రెడ్డి దంపతులు అమెరికాలో ఉంటున్న‌ట్లు తెలుస్తోంది.

ఏవీ సుబ్బారెడ్డితో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులంద‌రిపై ఫిర్యాదు చేయ‌డం వెనుక ఎవ‌రున్నార‌నే విష‌య‌మై ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. బొండా ఉమా త‌న కోడ‌లిపై హత్య కేసు న‌మోద‌వ్వ‌డంపై ఎలా స్పందిస్తారో చూడాలి. Readmore!

Show comments