Ooru Peru Bhairavakona Review: మూవీ రివ్యూ: ఊరు పేరు భైరవకోన

చిత్రం: ఊరు పేరు భైరవకోన
రేటింగ్: 2.25/5
నటీనటులు:
సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, వైవా హర్ష, రవిశంకర్ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
కెమెరా: రాజ్ తోట
ఎడిటింగ్: చోట కె ప్రసాద్
ఆర్ట్: రామాంజనేయులు
నిర్మాత: రాజేష్ దండ
రచన-దర్శకత్వం: వి.ఐ. ఆనంద్
విడుదల: 16 ఫిబ్రవరి 2024

హారర్ సినిమాలకి మిగిలిన జానర్స్ కంటే ఓపెనింగ్స్ బాగుంటున్నాయి. ఏమాత్రం బాగున్నా బాక్సాఫీసు వద్ద స్పందన ఉంటోంది. సందీప్ కిషన్ కి చాలా కాలంగా సరైన హిట్ పడలేదు. ఈ చిత్రం ఆ వెలితిని పూడుస్తుందన్న ఆశాభావం వ్యక్తమయింది ట్రైలర్ చూసాక. ఒక పాట కూడా హిట్ కావడం శుభసూచికమైంది. అసలు విషయమేంటో చూద్దాం. 

బసవ (సందీప్ కిషన్) ఒక పెళ్లి వేడుకలో పెళ్లికూతురి నగలు కాజేసి తన స్నేహితుడు (వైవా హర్ష) తో కలిసి పారిపోతాడు. ఆ క్రమంలో దారిలో గీత (కావ్య థాపర్) అనే అమ్మాయిని "యాక్సిడెంటల్" గా కలుస్తారు. అనుకోకుండా ఈ ముగ్గురూ భైరవకోన అనే మారుమూల ఊరిలోకి ప్రవేశిస్తారు. అక్కడ పరిస్థితులన్నీ విచిత్రంగా, భయంకరంగా ఉంటాయి. ఆ ఊరి ప్రజలంతా ఎప్పుడో చనిపోయినవాళ్లు.. జాంబీల్లా తిరుగుతుంటారు. ఆ ఊరి కథేంటి? ఆ ఊరి నుంచి ఈ ముగ్గురూ ఎలా బయటపడతారు? బసవ కి ఒక ప్రియురాలు ఉంటుంది. ఆమె పేరు భూమి (వర్ష బొల్లమ్మ). ఆమెకి ఈ భైరవకోనకి లింకేంటి? ఈ ప్రశ్నలే కథనాన్ని నడిపిస్తాయి. 

మారుమూల ఊరు, దెయ్యాల ఆధీనంలో ఉండే భవనం, జాంబీలు.. ఈ ఎలిమెంట్స్ తో చాలా సినిమాలు చూసేసాం. విచిత్రమైన ప్రాంతంలో చిక్కుకుని బయటపడలేకపోవడం కార్తి నటించిన "యుగానికొక్కడు"లో ఎప్పుడో చూసాం. అలాంటివన్నీ ఇందులోనూ ఉన్నాయి. అయినా అది కంప్లైంట్ కాదు. హారర్ సినిమా అని చెప్పి సరిగా బయపెట్టలేకపోవడమే పెద్ద కంప్లైంట్.  

గరుడపురాణం ప్రస్తావన తీసుకొచ్చినా అది పూర్తిగా పండలేదు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో గరుడపురాణంలో నాలుగు పేజీలు తొలగించారు.. అంటూ ఏదో అతికీ అతకని ఫిక్షన్ పెట్టి అయోమయానికి గురిచేసింది కథనం.

హీరోని దొంగగా చూపించాక, మళ్లీ స్టంట్-మన్ అని అతనికొక ఉద్యోగం...

ఒక పక్కన భైరవకోన కథ చెబుతూ పచ్చగూడెం అంటూ ఇంకొక ఉపకథ..

హారర్ జానర్ లో తీస్తూ మళ్లీ హీరోయిన్ ఇంట్రడక్షన్, అక్కడొక పాట...

దెయ్యాన్ని మోసం చేయడం లాంటి సో-కాల్డ్ కామెడీ ట్రాక్...

ఇవన్నీ ఎమోషన్ పండించే క్రమంలో అడ్డుతగులుతూ ఉన్నాయి. 

ప్రధమార్ధం అటు ఇటుగా సాగి ఇంటర్వల్ కి వచ్చే సరికి "ఏంటి ఇంకా ఇంటర్వెల్లేనా" అనిపిస్తుంది. ద్వితీయార్ధానికి వచ్చే సరికి మరీ డైల్యూట్ అయిపోయింది. ఈమధ్యన వ‌చ్చిన‌ విరూపాక్ష, మా ఊరి పొలిమేర, పిండం లాంటి సినిమాల్లోని హారర్ డోస్ కి కనీసం దరిదాపుల్లో కూడా లేదీ చిత్రం. 

సంభాషణల విషయానికొస్తే అన్ని పాత్రలకీ ఒకరు రాస్తే వెన్నెల కిషోర్ పాత్రకి మాత్రం వేరే రైటర్ రాసారా అన్నంత తేడా కనిపించింది. అతని ప్రాసలు, పంచులు నవ్వించాయి. సినిమా మొత్తంలో వెన్నెల కిషోర్ ఒక్కడే కాస్త రిలీఫ్. 

టెక్నికల్ గా చూస్తే ఒక్క పాట మినహా మ్యూజిక్ గొప్పగా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోరైతే మరీ వీక్. హారర్ సినిమాకి నేపథ్య సంగీతమే ఆయువుపట్టు. ఈ మధ్యన వచ్చిన "మంగళవారం" లాంటి సినిమాలతో పోల్చితే నేపథ్య సంగీతం చాలా బలహీనంగా ఉంది ఇందులో. 

పాటలు వచ్చే టైమింగ్ కూడా ఫ్లోకి ఇబ్బంది పెట్టేలా ఉందే తప్ప ఆర్గానిక్ గా లేదు. 

సంబాషణలు కూడా కొన్ని అయొమయంగా ఉన్నాయి- "అవేశం అబద్ధాన్ని నమ్ముతుంది.. ద్వేషం నిజన్ని నమ్ముతుంది" లాంటి డైలాగులో డెప్త్ ఏంటో అర్ధం చేసుకునే ప్రయత్నం చేసే లోపు సీన్ మారుతుంది. ఇలాంటివి అక్కడక్కడా దొర్లాయి. 

విజువల్ గా మాత్రం చాలా రిచ్ గా ఉన్న చిత్రమిది. కెమెరా వర్క్, లైటింగ్, గ్రాఫిక్స్, ఆర్ట్, కస్ట్యూం, మేకప్ దేనినీ వంకపెట్టలేం. 

ప్రధానమైన మైనస్సల్లా గ్రిప్పింగ్ గా కథని, కథనాన్ని నడపలేకపోవడమే. నిడివి మరీ ఎక్కువ కాకపోయినా చివరిదాకా చూసేటప్పటికి ప్రేక్షకులకి అలసట అనిపించిందంటే స్క్రీన్ ప్లేలో బిగువు లేదని అర్ధం. 

నటీనటుల విషయానికొస్తే సందీప్ కిషన్ సగటు నటుడిగా చేసుకుపోయాడు తప్ప ప్రత్యేకంగా తాను క్యారీ చేసిన ఎలిమెంట్ అంటూ ఏదీ లేదు. 

వర్ష బొల్లమ్మ పాత్ర నిడివి చాలా తక్కువ. కావ్య థాపర్ హీరో పక్కన సైడ్ కిక్ లాంటి పాత్రలో చేసింది.

వైవా హర్ష, వెన్నెల కిషోర్ ఇద్దరూ నవ్వించారు. బ్రహ్మాజి మొదట్లో కనిపించిన కాసేపు కొన్ని నవ్వులు తెప్పించాడు. 

సోషల్ మీడియా ద్వారా పాపులరైన డ్యాన్సర్ దుర్గారావు ఒక షాట్ లో కనిపించాడు. అలాగే సెవెన్ ఆర్ట్స్ సరయు కూడా వైవా హర్ష తో ఒక సన్నివేశంలో కనిపించింది. 

"ఊరు పేరు భైరవకోన" అని టైటిల్ పెట్టి, పోస్టర్, ట్రైలర్ లతో హారర్ సినిమా అని ప్రచారమయ్యాక ఆడియన్స్ కి అంచనాలు ఏర్పడతాయి. ఇలాంటి సినిమాలు ఇంట్లో కూర్చునికన్నా హాల్లో అయితే ఆ అనుభూతే వేరు అని భయపడడానికి రెడీ అయ్యి మరీ వస్తారు. హారర్ చిత్రాలకి ఈ మాత్రం ఆదరణ ఉండడానికి కారణమిదే. కానీ ఆ భయం ఇందులో లేకపోవడం వల్ల ఆశించిన అనుభూతి దక్కక ప్రేక్షకులు పెదవి విరుస్తారు. అందుకేనేమో "ఎ" సర్టిఫికేట్ ఇవ్వాల్సిన హారర్ చిత్రానికి "యు/ఎ" ఇచ్చి ఊరుకున్నారు సెన్సార్ వారు! 

బాటం లైన్: భయపెట్టనికోన

Show comments

Related Stories :