చంద్రబాబుకే వెన్నుపోటు పొడిచేశారట

ఇది నిజమేనా.? నిజమే అయి వుంటుంది.. ఎందుకంటే, టీడీపీ నేతలే ఇప్పుడు గింజుకుంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఝలక్‌ తగిలేలా వుంది. ఈ విషయమై టీడీపీ వర్గాల్లోనే ఆందోళన వ్యక్తమవుతోంది మరి. కర్నూలు, నెల్లూరు, కడప జిల్లాల్లో సొంతంగా బలం లేకపోయినా, 'అరువు తెచ్చుకున్న, దోచుకున్న' ఓట్లతో గెలిచేస్తామనే ధీమాతోనే, అభ్యర్థుల్ని బరిలోకి దించింది తెలుగుదేశం పార్టీ. 

'ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందే.. లేదంటే పరువు పోతుంది, మొత్తం ఫోకస్‌ అంతా అక్కడే పెట్టాలి..' అంటూ పార్టీ ముఖ్య నేతల్ని, ముఖ్యంగా మంత్రుల్ని ఆ మూడు జిల్లాల్లోనే చంద్రబాబు మోహరించారు కూడా. కనీవినీ ఎరుగని స్థాయిలో 'ఓటర్లను' (స్థానిక ప్రజా ప్రతినిథులు) క్యాంపులకు తరలించి, సకల బోగాలూ కల్పించింది పసుపు దళం. వలలోంచి ఒక్క చేప కూడా జారిపోకుండా, వారందర్నీ జాగ్రత్తగా పోలింగ్‌ కేంద్రాలకి తీసుకొచ్చారు. ఇందుకోసం పెద్ద కథే నడిచింది. 

ఇంతా చేస్తే, ఆ మూడు చోట్లా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందట. ఈ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతున్నారు. 'క్రాస్‌ ఓటింగ్‌కి సహకరించారు' అనే ఆరోపణలతో కొంతమందిపై అప్పుడే టీడీపీ అధిష్టానం వేటు వేయడం గమనార్హం. అంటే, టీడీపీ శ్రేణుల్లో భయం షురూ అయినట్లే. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇప్పుడు టీడీపీ ఆశలన్నీ, వైఎస్సార్సీపీ నుంచి జరిగిందని భావిస్తున్న క్రాస్‌ ఓటింగ్‌ మీదనే. 

'క్రాస్‌ బ్రీడింగ్‌' తరహాలో, ఈ క్రాస్‌ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకోవడమేంటట.? ఇదేమరి, భావదారిద్య్రమంటే.! మొత్తమ్మీద, టీడీపీకి టీడీపీ నేతలే వెన్నుపోటు పొడిచారన్నమాట. ఈ వెన్నుపోటు టీడీపీకి మాత్రమే కాదు, చంద్రబాబుకి కూడా. ఏంటీ, వెన్నుపోటుకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన చంద్రబాబుకే వెన్నుపోటా.? ఇది మరీ టూ మచ్. వెన్నుపోటు పక్కా.. అది గట్టిగా తగిలితే మాత్రం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు పరువు గంగలో కలిసిపోయినట్టే.!

Show comments