చంద్రబాబుకి 'సినిమా' మొదలైపోయింది

2019 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి.? ఇప్పుడీ ప్రశ్న చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోందంటే దానిక్కారణం, తెలుగుదేశం పార్టీలో ఇటీవల చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలే.

చినబాబు నారా లోకేష్‌కి మంత్రి పదవి ఇవ్వడం కోసం చంద్రబాబు పడ్డ పాట్లు (ఎమ్మెల్సీగా నారా లోకేష్‌కి అవకాశమిప్పించడం సహా, విమర్శలు రాకుండా వుండేందుకు సానుభూతి కోటా కూడా కలిసొచ్చేలా అఖిల ప్రియనీ మంత్రిని చేయడం).. ఆ తర్వాతి పరిస్థితులు టీడీపీ భవిష్యత్తేంటో చెప్పకనే చెప్పేస్తున్నాయి. 

సొంత జిల్లాకి చెందిన ఎంపీ శివప్రసాద్‌, పార్టీపై గుస్సా అయితే.. బెదిరించో బతిమాలో మొత్తానికి లైన్‌లోకి తెచ్చుకున్నారు చంద్రబాబు. అయినాసరే, ఇంకా ఆ వివాదం పూర్తిగా సద్దుమణిగిపోలేదు. అలా చాలా సంఘటనలు జరిగాయి.

తాజాగా విశాఖ జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు తెరపైకొచ్చింది. ఈసారి ఇద్దరు మంత్రులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. విశాఖలో తెరపైకొచ్చిన భూ కుంభకోణానికి సంబంధించి మంత్రి అయ్యన్న పాత్రుడు, మరో మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్తున్నారు. వ్యవహారం ముఖ్యమంత్రికి లేఖలు రాసేదాకా వచ్చిందిప్పుడు. 

పైకి కన్పిస్తున్న రచ్చ ఈ స్థాయిలో వుంటే, కన్పించని రచ్చ ఏ స్థాయిలో వుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. దాదాపు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి.

పదవులు రానోళ్ళు నిన్న మొన్నటిదాకా సైలెంట్‌గా వున్నా, ఇకపై వారు ఆ స్థాయి సైలెన్స్‌ని మెయిన్‌టెయిన్‌ చేస్తారని అనుకోలేం. ఈ తలనొప్పులు చాలక, ఎంపీ కేశినేని నాని 'ట్రావెల్స్‌ రచ్చ' పేరుతో అధికారులకీ, ప్రభుత్వానికీ మధ్య చిచ్చు పెట్టేయడం గమనార్హం. 

మొత్తమ్మీద, చంద్రబాబుకి 'సినిమా' షురూ అయ్యిందనే చెప్పొచ్చు. 2019 ఎన్నికల నాటికి ఈ 'సినిమా' ఏ స్థాయిలో చంద్రబాబుని రాజకీయంగా ఇరకాటంలో పెట్టేస్తుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

అధికారంతో ఎక్కువకాలం పార్టీలోని అసంతృప్తిని, గ్రూపు తగాగాల్ని చల్లార్చేయలేరు. ఆ విషయం అందరికన్నా చంద్రబాబుకే బాగా తెలుసు. కానీ, ఇప్పుడు చంద్రబాబు ఏమీ చేయలేని అచేతనావస్థలోకి నెట్టివేయబడ్డారు మరి.!

కొసమెరుపు: నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వుండాలని చంద్రబాబు పార్టీకి చెందిన ముఖ్య నేతలకు, ప్రజా ప్రతినిథులకు, అమాత్యులకూ ఆదేశాలు జారీ చేస్తున్నారు సరే.. సొంత బావమరిది బాలయ్యే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వుండడంలేదాయె. బావమరిది బాలయ్యే, బావ చంద్రబాబు మాట లెక్కచేయనప్పుడు, మిగతా నేతల గురించి మాట్లాడుకోవడం అనవసరం.

Show comments