బ్లాక్‌ డే వర్సెస్‌ స్టేట్‌ ఫార్మేషన్‌ డే.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది నేడే. ఇదే రోజున, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించింది కూడా. ఆ లెక్కన, ఒకరికి మోదం.. ఇంకొకరికి ఖేదం అన్నమాట. ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమం విజయ తీరాలకు చేరిన రోజుగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. అదే సమయంలో, ఆరు దశాబ్దాల 'ఉమ్మడి' రాష్ట్రం మెడ మీద కత్తి పడిన రోజున 'బ్లాక్‌ డే'గా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివర్ణిస్తున్నారు. 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఓ వైపున, నవనిర్మాణ దీక్ష ఇంకో వైపున.. ఇలా తెలుగు ప్రజలు భిన్నమైన అనుభూతుల్ని చవిచూడాల్సి వస్తోంది. జరిగిందేదో జరిగిపోయింది. మర్చిపోయే రోజు కాదిది ఆంధ్రప్రదేశ్‌కి అయినా, తెలంగాణకి అయినా. తెలంగాణలో ఎప్పటికీ ఈ రోజున సంబరాలు జరుగుతూనే వుంటాయి. ముందు ముందు 'విభజన గాయాన్ని' ఆంధ్రప్రదేశ్‌ కూడా మర్చిపోవచ్చుగాక. అప్పుడు తప్పనిసరిగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అక్కడా జరగాల్సి వుంటుంది. ఆ మాత్రందానికి 'బ్లాక్‌ డే' అని అభివర్ణించడం ఎంతవరకు సబబు.? 

మామూలుగా అయితే ఏమోగానీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా, విభజన వ్యవహారంలో భాగమైన రాజకీయ ప్రముఖుడిగా చంద్రబాబు.. రెండు రాష్ట్రాల్లోనూ తన పార్టీ వుండాలనుకుంటున్నప్పుడు 'బ్లాక్‌ డే' అనేంతటి కఠిన పదాల్ని వాడకుండా వుంటేనే మంచిది. కానీ, సెంటిమెంట్‌ రగల్చాలి. అందుకేనేమో, నవ నిర్మాణ దీక్ష పేరుతో మరోమారు 'చీకటి రోజు - బ్లాక్‌ డే' అంటూ ఆనాటి గాయాన్ని గుర్తుచేసుకున్నారు.

కొసమెరుపు: ’ఇక్కడే ఈ చోటనే విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరిగాయి.. ఇక్కడే నవ నిర్మాణ దీక్షలు చేపడుతున్నాం.. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి..‘ అని ముఖ్యమంత్రి చంద్రబాబు, విజయవాడలో నవ నిర్మాణ దీక్ష సందర్భంగా చెప్పారుగానీ, విభజన వ్యతిరేక ఆందోళనలు, ఉద్యమాలు విఫలమయిన దరిమిలా, నవ నిర్మాణ దీక్షపై చంద్రబాబు ఏం సంకేతాలు ఇవ్వదలచుకున్నట్లు.?

Show comments