ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీలో శాసనసభ సమావేశాలు ఎంత చక్కగా, ఎంత ప్రజోపయోగకరంగా జరిగాయో, ఎంత ప్రజారంజకంగా నిర్వహించారో చాలామంది టీవీ ఛానెళ్లలో చూశారు. ఈ సమావేశాలు చూశాక ఆంధ్రప్రదేశ్‌కు అసెంబ్లీ అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా అభిప్రాయపడటం తప్పు కాదు. అసెంబ్లీలో ఇన్నాళ్లూ జరిగిందేమిటి? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్ చొక్కాలు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. అంతలా విమర్శించుకున్నారు. ఆరోపణలు చేసుకున్నారు. చివరకు వ్యక్తిగతంగా తిట్టుకున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల సారాంశం ఒక్కటే. చంద్రబాబు, జగన్ హోదాలు మర్చిపోయి పూర్తిగా దిగజారిపోయారు. విద్యార్హతలు, పరీక్షలు, ఇంగ్లిషు మాట్లాడటం..మొదలైన పనికిమాలిన విషయాలపై ఇద్దరూ తిట్టుకున్న తరువాత పూర్తిగా దిగజారిపోయారని, ఇంకా దిగజారేందుకు అవకాశం లేదని అర్థమైంది. ఇంకా దిగజారి పాతాళానికి పొయ్యే అవకాశం ఉందని వారనుకుంటే అదేదో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతుంది. చంద్రబాబు, జగన్‌లో ఒకరిని తియ్యలేము, ఒకరిని పెట్టలేము. వీళ్లకు అసెంబ్లీ కంటే పల్లెటూళ్లో రచ్చబండ బెస్ట్ అనిపిస్తోంది.
ఇంత పనికిమాలిన సమావేశాలు హైదరాబాదులోనే నిర్వహించుకోవచ్చు కదా. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని ఏం సాధించారు? ఇక చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి ఈయన జీవితంలో ఎప్పుడైనా పరీక్షలు రాశాడా? రాస్తే ఎప్పుడు, ఎక్కడో రాశాడో చెప్పాలని వ్యంగ్య బాణాలు విసరడం, దానికి జగన్ తాను చంద్రబాబు మాదిరి వచ్చీరాని ఇంగ్లిషు నేర్పే స్కూళ్లలో చదవలేదని, బేగంపేటలోని పబ్లిక్ స్కూల్లో చదివానని, టెన్త్, ఇంటర్, డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యానని రెచ్చిపోవడం జుగుప్స కలిగించింది. ఆయన ఎంఫిల్ చదవకుండానే చదివానని చెప్పుకుంటున్నారని కూడా అన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే, చంద్రబాబుకు ఇంగ్లిషు మాట్లాడటం రాదని, అర్థం కాదని అనడం మరో ఎత్తు. చంద్రబాబుకు ఇంగ్లిష్ రాదని జగన్ విమర్శలు చేయడం ఇది మొదటిసారి కాదు. ఆయన సీఎం, ఈయన ప్రతిపక్ష నేత అయినప్పటినుంచి ఈ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ ఈ విమర్శలు పనిగట్టుకొని చేస్తున్నట్లు అర్థమవుతూనే ఉంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా బాబుకు ఇంగ్లిష్ రాదన్నాడని జగన్ అసెంబ్లీలో చెప్పారు.
'ముఖ్యమంత్రికి ఇంగ్లిషు రాదు. ఇయనేం పరిపాలన చేస్తాడు?'..అని జనం అనుకోవాలని జగన్ భావిస్తున్నారు. బాబును ప్రజల్లో చులకన చేయడానికి జగన్ ఎంచుకున్న మార్గాల్లో ఇంగ్లిషు ఒకటి. జగన్ పరీక్షలు రాయలేదనడం, చదువుకోలేదనడం ఎంత తప్పో, చంద్రబాబుకు ఇంగ్లిషు రాదని అదే పనిగా ప్రచారం చేయడమూ అంతే తప్పు. విమర్శలు పరిపాలన, విధానాల మీద ఉండాలేగాని వ్యక్తిగత బలహీనతల మీద, లోపాల మీద ఉండకూడదు. గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబుకు ఇంగ్లిష్ రాకపోవడంవల్లనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. ఈ విమర్శకు అర్థముందా? చంద్రబాబు ఇంగ్లిష్‌లో చాలా పూర్ అని, ఆ భాషను అర్థం చేసుకోలేరని అన్నారు. ఇంగ్లిష్‌కు, హోదాకు సంబంధం ఏమిటి? చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులతో హోదా గురించి ఇంగ్లిష్‌లో సరిగా చెప్పలేకపోతున్నారట....! బాబుకు ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకవపోవడం వల్లనే హోదా విషయాన్ని కేంద్రం పట్టించుకోవడంలేదట...! బాబు హోదాపై ఇంగ్లిషులో చెప్పేదాన్ని ఇతర పార్టీలవారు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారట...! ఇంగ్లిష్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయనకుంటున్న జగన్ అధికారంలోకి వచ్చాడనుకుందాం. దాంతో అన్ని పనులు సాధించగలరా?
బాబు ఇంగ్లిష్ పూర్ అనే విషయం కొత్తది కాదు. ఆ భాషలో అనర్గళంగా మాట్లాడలేరు. కాని తన రాజకీయ చాతుర్యంతో, పరిపాలనా దక్షతతో ఆ లోపాన్ని మరుగున పడేశారు. పరిపాలనా పరంగా బాబు తప్పులు చేసుండొచ్చు. కాని 'బెస్ట్ అడ్మినిస్ట్రేటర్' అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇంగ్లిష్‌లో పూర్ కావచ్చు. కాని ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారా? లేదా? గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తాడని ఎక్కువమంది అనుకున్నారు. కాని చంద్రబాబుకు పట్టం కట్టారు. ఎందుకు? ప్రజలు చెప్పిన కారణం...కొత్త రాష్ట్రానికి చంద్రబాబువంటి అనుభవజ్ఞుడు అవసరమని ఆయన్ని ఎన్నుకున్నామన్నారు. కాని బాబుకు ఇంగ్లిష్ సరిగా రాదు కదా అని అనుకోలేదు. బాబు ఇంగ్లిష్ నాలెడ్జ్ మీద విమర్శలు చేసిన జగన్ తన తెలుగు భాషా పరిజ్ఞానం ఎంతో ఒకసారి పరిశీలించుకోవాలి. ఆయన ప్రసంగాలు ఆకట్టుకునేవిధంగా ఉంటున్నాయా? లేదా ? చూసుకోవాలి. బాబు కూడా హుందాగా ప్రవర్తించాలి.