ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత భారతీయజనతా పార్టీకి ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో అఖండ విజయం లభించింది. దీనితో ఆ పార్టీ ఉత్సాహానికి ఎదురు లేకుండా పోయింది. ఉత్తరాదిన ఇక బీజేపీకి తిరుగుండదని, దక్షిణాదిపై దృష్టి సారించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. దక్షిణాదిన అన్ని రాష్ట్రాలలో కంటే తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలున్నాయని పలు సర్వేలు ఇప్పటికే బీజేపీ అధిష్ఠానానికి చేరాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు భారతీయజనతా పార్టీ విజ్రుభించడానికి అన్ని అవకాశాలను ఏర్పరుస్తున్నారని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయినప్పుడల్లా తర్వాతి ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచేందుకు తగిన వాతావరణం కల్పించారు. ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీకి బంగారుపళ్లెంలో పెట్టి తెలంగాణలో అధికారాన్ని అప్పగించే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
మరోవైపు బీజేపీ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి అన్నిరకాల వ్యూహాలు ఆ పార్టీ పన్నుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ పూర్తికాలం పనిచేసే కార్యకర్తల్ని నియమించాలని వారు ఆరునెలల నుంచి ఏడాది పాటు పనిచేసి పార్టీని నిర్మించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మే 23, 24, 25 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారని, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఒక రాష్ట్రంలో మూడు రోజులు పర్యటిస్తున్నారంటే ఆ రాష్ట్రంపై ఆయన ఎంతదృష్టి సారిస్తున్నారో అర్థం అవుతుంది.
నిజానికి తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచే బీజేపీ పార్టీ విస్తరణపై దృష్టి సారించింది. కాని కేసీఆర్ పట్ల జనం ఆదరణ ఉండడం వల్ల బీజేపీకి పెద్ద అవకాశాలు లభించలేదు. అంతేకాక కేసీఆర్ హిందూ ఓట్లను చీల్చే క్రమంలో మత రాజకీయాలకు పూనుకున్నారు. జీయర్‌స్వామి లాంటి మఠాధిపతులను చేరదీశారు. యజ్ఞయాగాదులు జరిపించారు. యాదాద్రి నిర్మాణం, దేవస్థానాలకు నిధుల పెంపు వంటి చర్యలు తీసుకున్నారు. దీనితో హిందూ ఓట్లు కేసీఆర్‌కు అనుకూలంగా మారే అవకాశాలు కనపడడంతో బీజేపీ వెనుకబడింది. మా ఓట్లను కేసీఆర్ చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక మేమేమి చేయగలం అని బీజేపీ నాయకుడు అప్పట్లో అన్నారు.
కాని రాను రానూ కేసీఆర్ హవా తగ్గిపోవడం, మరోవైపు కాంగ్రెస్ పుంజుకోకపోవడం, కోదండరామ్‌లాంటి వారు చేసే విమర్శలకు ప్రాచుర్యం లభించడంతో బీజేపీకి ఆశలు చిగురించాయి. గత మూడు సంవత్సరాలుగా కేసీఆర్ మాటలేతప్ప చేతల్లో ఏమీ చేయలేకపోవడం, ఉబుసుపోక కబుర్లతో కాలక్షేపం చేయడం, సీఎం ఇంటివద్దే గడీ కట్టుకుని అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, కుటుంబపాలన పెరిగిపోవడంతో ప్రజల్లో నిరాశా నిస్పృహలు పెరిగాయి. దీనితో బీజేపీ అప్రమత్తం కాసాగింది. గత ఆదివారం నాడు ముఖ్యమంత్రి వెనుకబడిన వర్గాలకు చెందిన ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టడంతో బీజేపీకి సువర్ణాకాశం లభించింది. దీనితో రాష్ట్రంలో 62శాతం రిజర్వేషన్ కల్పించినట్లయింది. రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్ కోటా 50 శాతం దాటకూడదని నిర్దేశించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తే ఇది సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి భావించారు.
ఢిల్లీకి కూడా పోయి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వినతి పత్రం సమర్పించారు. మోడీ నవ్వి ఊరుకోవడం మినహా ఎటు వంటి హామీ ఇవ్వలేదు. కేసీఆర్ రాజకీయాలను అర్థంచేసుకోలేనంత అమాయకుడు కాదు మోడీ. కేంద్రం కూడా ఇలాంటి రిజర్వేషన్లకు అనుమతినిచ్చి రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో మార్పులు చేస్తుందని నమ్మేంత అమాయకుడు కాడు కేసీఆర్. కాని ఎవరి రాజకీయం వారిది. నరేంద్రమోడీకి ముస్లింల రిజర్వేషన్ పై వినతిపత్రం సమర్పించిన కేసీఆర్ అంతకుముందే అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయించాడు. ముస్లింల రిజర్వే షన్ బిల్లును అడ్డుకోవడానికి బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రతి ఘటించారు. కేసీఆర్ ప్రభుత్వం వారిని అరెస్టు చేసింది. తర్వాత బీజేపీ నేతలు అసెంబ్లీ వెలు పల ధర్నా చేయడమేకాక రాష్ట్రమంతటా తమ ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు సన్నాహాలు ప్రారంభిం చారు. మత పరమైన రిజర్వేషన్లను బీజేపీ అంగీకరించే ప్రసక్తిలేదని, మైనారిటీలను బుజ్జగించే రాజకీయాలు సరైనవి కాదని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మరో అడుగు ముందుకు వేసి ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తే మరో పాకిస్తాన్ ఏర్పడుతుందని హెచ్చరించారు.
కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాత యూపీ తరహా రాజకీయాలు తెలంగాణలో పునరావృత మయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీలో ముస్లిం ఓట్లు పెద్దసంఖ్యలో ఉన్నప్పటికీ మొత్తం హిందూ ఓట్లను తమవైపుకు తిప్పుకోవడం ద్వారా బీజేపీ విజయం సాధించింది. ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌ల ప్రభుత్వాలు ముస్లింలను బుజ్జగించే రాజకీయాలను పెద్దఎత్తున అవలంభించాయి. యాదవులు, ముస్లింలు, జాట్‌ల కాంబినేషన్‌తో సమాజ్‌వాది పార్టీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నది. కాని యూపీ ఎన్నికల్లో ఈ సమీకరణలన్నీ కొట్టుకుపోయి ఓటర్లు హిందువులు, ముస్లింలుగా విడిపోయారు. దీనితో బీజేపీకి గెలుపు సాధ్యమైంది. ఇప్పుడు ఆ పరిస్థతి తెలంగాణలో కనపడుతున్నది. తెలంగాణ ప్రజల మద్దతు తనకు ఎలాగూ ఉన్నందువల్ల మొత్తం ముస్లింలంతా తనకు ఓటువేస్తే గెలుపు ఖాయమని కేసీఆర్ నమ్ముతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయన అదే విధంగా గెలిచారు. కాని ఉన్నట్లుండి కేసీఆర్ మత రాజకీయాలకు పూనుకుంటే హిందువులు ఎందుకు ఊరుకుంటారు.. కేసీఆర్ గతంలోచేసిన యజ్ఞయాగాదులన్నీ జనం మరిచిపోయే పరిస్థితికి వచ్చారు. కేసీఆర్ నిర్మాణాత్మకంగా బంగారు తెలంగాణను నిర్మించేందుకు ఏ పనీ చేయలేదని జనం గ్రహించారు.
కనుక కేసీఆర్ ప్రభుత్వంపై అసమ్మతి, హిందువుల ఓట్ల సమీకరణ చేస్తే బీజేపీ ప్రభంజనం వీచే అవకాశాలు లేకపోలేదు. నిజానికి ముస్లింలు కూడా కేసీఆర్ పట్ల విముఖంగా ఉన్నారు. ఎలాంటి అధికారాలు లేని ఒక ముస్లింనేతను ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించినప్పటికీ ముస్లింలు సంతోషంగా లేరు. వారు వచ్చే ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా మారితే తాను విజయం సాధించడం కష్టమని కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఆయన ఎప్పుడో చేసిన వాగ్దానాన్ని తవ్వితీసి రిజర్వేషన్ అస్త్రాన్ని ప్రయోగించారు. కాని అది రాజకీయ నాటకమని ముస్లింలు గ్రహించరని ఆయన భావిస్తే అది అమాయకత్వమే అవుతుంది. ఈ బిల్లును కేంద్రం అంగీకరించే ప్రసక్తి ఉండదు. పైగా కోర్టులు ఈ బిల్లును కొట్టి పారేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే కేసీఆర్ ఓట్లు కాంగ్రెస్ చీలిస్తే బీజేపీ విజయం సాధించే అవకాశాలున్నాయి. కోదండరామ్ పుణ్యమాని పలువురు విద్యార్థులు, యువకులు మేధావులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా మారుతున్నారు. వారంతా కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ కీలక పాత్ర పోషించినందువల్ల ఆ విషయాన్ని కూడా ఆ పార్టీ తనకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు.
ఇకపోతే తెలంగాణలో బీజేపీకి సరైన నాయకత్వం లేదని బీజేపీ అధిష్ఠానానికి తెలుసు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులకు విశ్వసనీయత లేదని వారికి సమాచారం ఉన్నది. అందువల్ల బీజేపీ తెలంగాణలో ప్రాబల్యం ఉన్న రెడ్డివర్గాన్ని చేరదీసేందుకు ప్రయత్నిస్తున్నది సాంప్రదాయకంగా తెలంగాణ రెడ్లు మొదట జనసంఘ్, బీజేపీతో చేతులు కలిపిన వారే. కాంగ్రెస్ హవా ఉన్నంతవరకూ వారు కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఇప్పుడు వారు బీజేపీని ఆశ్రయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ నేత జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి మొదలైన నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపి ఆ పార్టీని బలోపేతం చేసే అవకాశాలున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ నేతలను కార్యకర్తలను పూర్తిగా కబళించడమే బీజేపీ ఉద్దేశం. టీఆర్‌ఎస్‌లో కూడా పలువురు నేతలపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రయోగించే అవకాశాలున్నాయి. కేసీఆర్ తస్మాత్ జాగ్రత్త.