అవునా..నిజమేనా? నమ్మశక్యమేనా?

అపర భగీరథుడు, అటు వెళ్లే నదులను ఇటు తిప్పి మరీ పంటపొలాలను సాగుభూమిగా మార్చగల సత్తా కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు వుండగా, ఇలా జరగడమా? రాయల సీమలో ఎడారి వాతావరణం తాండవించడమా? కేవలం రాయలసీను ఉద్దరించడానికి, రాయలసీమ జనాలు జగన్ ను తరిమి కొట్టడానికి కదా పట్టిసీమ ప్రాజెక్టును ఎందరు వద్దని చెప్పినా, అందులో ఎంత అవినీతి దాగి వుందని మొత్తుకున్నా యుద్దప్రాతిపదికన పూర్తి చేసింది. అది పూర్తయితే ఇక రాయలసీమ సస్య శ్యామలమని చెప్పింది. నిజానికి కృష్ణా డెల్టాకు రావాల్సినంత నీరు రావడం లేదు. దానికి గోదావరి నీళ్లు తీసుకెళ్లాలి. అయితే అలా చెప్పకుండా పట్టిసీమ రాయలసీమ కోసమే అని చెప్పి పూర్తి చేసారు. సరే, పట్టిసీమ నీళ్లు కృష్ణా డెల్టాకు ఇచ్చి, అక్కడికి రావాల్సిన నీళ్లు సీమకు పంపిస్తారులే అనుకున్నారు. కానీ మరి ఇప్పుడు ఈనాడు పత్రికేమిటి ఇలా రాస్తోంది?

ఊళ్లు ఊడ్చుకుపోతున్నాయ్

ఊళ్లకు ఊళ్లు ఊడ్చుకుపోతున్నాయ్ అంటూ ఈరోజు ఈనాడు దినపత్రిక పెద్ద కథనం అందించింది. దాని ప్రకారమే అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కరువు విలయతాండవం చేస్తోందట. చేద్దామంటే పనులు లేవట. ఉపాథి పథకం కూడా ఆదుకోలేకపోతోందట. దీంతో జనాలు ఊళ్లు వదిలిపెట్టి, పనులు వెదక్కుంటూ వలసల దారి పడుతున్నారట. ఒక ఊరిలో అయితే 15 వీధులకు 13 కుటుంబాలే మిగిలాయట. కాస్త సత్తువ వున్నవారంతా బంగళూరు, చెన్నయ్ పట్టణాలకు కార్మికులుగా వలసపోతున్నారట. అయిదు ఎకరాలు దాటి వుంటే పింఛను కూడా ఇవ్వడం లేదట. కానీ అయిదు ఎకరాలు వున్నా ఏమీ పండడం లేదట. ఇదీ పరిస్థితి.

పెట్టని కోటలు కదా?

అనంతపురం, చిత్తూరు అంటే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు బాగా సాన్నిహిత్యం వున్న జిల్లాలు. అలాంటి జిల్లాల్లోనే ఇలాంటి పరిస్థితి వుండడం ఏమిటి? మరి పట్టిసీమ లక్ష్యాలు ఏమయినట్లు? బాబుకు, ఆయన పార్టీకి పెట్టని కోటలుగా వుండే జిల్లాల పరిస్థితే ఇలా వుంటే మిగిలిన వాటి సంగతేమిటి? ప్రజల పరిస్థితి ఇలా వుంటే అనంతపురం తేదేపా నాయకులు బాలయ్య బాబు పిఎ వ్యవహారమే కీలకం అన్నట్లు కొట్టుకుంటున్నారు. 
ఇదంతా నమ్మశక్యంగా లేదు. కిట్టని వారి ప్రచారం అనుకుందాం అని అనుకుంటే, ఈనాడు రాసిందాయె. ఇన్నాళ్లకు గ్రౌండ్ రియాల్టీ బయటకు రావడం ప్రారంభమైందన్నమాట.

 

Show comments