10 కోట్లా.? 20 కోట్లా.? 30 కోట్లా.?

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల రేటు 10 కోట్ల నుంచి పాతిక కోట్ల రూపాయల దాకా పలికిందని గతంలో గుసగుసలు విన్పించాయి. ఫిరాయింపు రాజకీయాల్ని పెంచి పోషిస్తున్న అధికార పార్టీలు, ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయడానికి ఆ మాత్రం వెచ్చించక తప్పలేదేమో.! అదే సమయంలో, ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాలంటే ఆ మాత్రం ఖర్చులు అవసరమవుతాయి కదా.! గత ఎన్నికల్లో చేసిన ఖర్చులు రాబట్టుకోవడం, మళ్ళీ ఎన్నికలు జరిగితే ఖర్చు పెట్టడం.. ఇదంతా రాజకీయాల్లో ఓ ప్రసహనంగా తయారైంది. 

ఇప్పుడిక తమిళనాడు వంతు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల రేటు బీభత్సంగా పలుకుతోంది. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో విన్పిస్తున్న గుసగుసల ప్రకారం చూస్తే, ఒక్కో ఎమ్మెల్యే రేటు 10 నుంచి 30 కోట్లకు పైగానే పలుకుతోందట. హన్నన్నా.. ఆ స్థాయిలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేస్తున్నారా.? అని డౌట్‌ పడక్కర్లేదు.. చాలాకాలం క్రిందట కర్నాటకలోనూ, ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాల్లోనూ.. అంతెందుకు, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లోనూ ఇలాంటివి జరిగాయి.. భవిష్యత్తులోనూ జరుగుతూనే వుంటాయి. 

'మేం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. మాకు 130 మంది ఎమ్మెల్యేల బలం వుంది..' అని గట్టిగా చెప్పుకుంటున్న శశికళ వర్గం, ఆ 130 మంది ఎమ్మెల్యేలనూ ఇప్పుడు దాచేసింది. అవును నిజ్జంగా నిజమిది. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యేలను రప్పించి, వారికి క్లాస్‌ తీసుకున్న శశికళ, ఆ తర్వాత వారందరినీ బస్సుల్లోకి ఎక్కించి, రహస్య ప్రదేశాలకు తరలించారు. మొబైల్‌ ఫోన్లను కూడా వారి నుంచి స్వాధీనం చేసుకున్నారట. తప్పదు మరి, బలం చాటుకోవాలంటే 'వలలోంచి చేపల్ని' జారిపోకుండా చూసుకోవాలి కదా.! 

పెద్ద పాత నోట్ల రద్దుతో దేశంలో అవినీతి మటుమాయమైపోతుందట.. నల్లధనం నామరూపాల్లేకుండా పోతుందట.. ఇది నరేంద్రమోడీగారి ఉవాచ. మరిప్పుడు, ఎమ్మెల్యేలను ఎలా బుజ్జగిస్తారట.? చెక్కులతోనా.? ఆన్‌లైన్‌ లావాదేవీలతోనా.? ఏమో మరి, 'చిన్నమ్మ'కే తెలియాలి.! ఇంతకీ, ఈ ఎపిసోడ్‌లో ఐటీ దాడులుంటాయంటారా.? ఏమో మరి, ఇది నరేంద్రమోడీకే తెలియాలి.

Show comments