శతృచర్ల ఎంపికతో...?

చంద్రబాబు ఏం చేసినా ఓ అర్థం పరమార్థం వుంటాయి. శ్రీకాకుళం స్థానిక సంఘాల నుంచి ఎన్నిక కావాల్సిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా శతృచర్ల విజయరామరాజును బరిలో నిలిపి తెలుగుదేశం వర్గాలకు కాస్త అలక, రాజకీయ వర్గాలకు కాస్త ఆశ్చర్యం కలిగించారు. పార్టీలు మారినా, రాజకీయాలు మారవు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ చేసినా లోకల్ గా వుండే వర్గ విబేధాలు సమసిపోవు. శతృచర్ల వ్యవహారం కూడా అలాంటిదే. 

శతృచర్ల చిరకాలంగా అటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు కళా వెంకటరావుకు, ఇటు విజయనగరం జిల్లాకు సంబంధించినంత వరకు అశోక్ కు దూరంగానే వుంటూ వచ్చారు. ఒకప్పుడు తెలుగుదేశంలోకి వచ్చినా, బాబు హైజాక్ వ్యవహారం అనంతరం లక్ష్మీపార్వతి వెంటవున్నారు. తరువాత మళ్లీ వైఎస్ హయంలో ఓ వెలుగు వెలిగారు. ఆఖరికి తెలుగుదేశంలోకి చేరినా, వెనుకబడే వుంటూ వచ్చారు.

ఇన్నాళ్లకు టైమ్ వచ్చి ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. దీంతో ఇప్పుడు కళా వెంకటరావు వర్గానికి మింగుడు పడడంలేదని వినికిడి. నిన్నటికి నిన్న శతృచర్ల వ్యవహారంలో శ్రీకాకుళం జిల్లాలోని వెలమవర్గం హల్ చల్ చేసింది... కాపువర్గం భగ్గుమంది. అసలే ఉత్తరాంధ్రలోని కాపువర్గం ఇటు గంటా, అటు కళా వర్గాలుగా వుంది. దీనికి తోడు ఎప్పటిలాగే చంద్రబాబు ఉత్తరాంధ్రలో వెలమ వర్గానికి పెద్దపీట వేస్తున్నారన్న అసంతృప్తి కూడా వుండనే వుంది. దీనికి తోడు ఇప్పుడీ వ్యవహారం తోడయింది. 

అయితే త్వరలో కళా వెంకటరావును మంత్రివర్గంలోకి తీసుకుంటారని, అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అదే వర్గానికి ఇస్తే బాగుండదని బాబు ఆలోచించారని కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. 

అయితే వైకాపా బరిలో లేదు కాబట్టి, ఇప్పటికిప్పుడు అద్భుతాలేం జరిగిపోవు. కానీ ఇలాంటివి అన్నీ కలిసి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉత్తరాంధ్రలో కుల సమీకరణల మధ్య సమస్యలు తప్పకపోవచ్చని రాజకీయ వర్గాల అంచనా. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెలమలు, కాపులు పదవుల కోసం పోటీపడుతున్నారు. మరోపక్క గవర్లు వుండనే వున్నారు. ఇంకోపక్క గంటా ఈసారి మళ్లీ పార్టీ మారతారు అన్న తెరచాటు ప్రచారం వుండనే వుంది.

ఇలాంటినేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ టికెట్ ద్వారా ఒక వర్గాన్నైనా సంతృప్తి పర్చగల అవకాశం వుండి కూడా, బాబు ఇలా నిర్ణయం తీసుకుని శతృచర్లకు టికెట్ ఇచ్చారంటే, ఆయన ఆలోచన ఏమై వుంటుంది అన్నది రాజకీయ వర్గాల్లో డిస్కషన్ గా వుంది.

Show comments