ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నారు. ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి వెన్నులో వణుకు మొదలైంది. అదేంటో, రాహుల్‌గాంధీ పేరు వింటేనే చంద్రబాబుకి టెన్షన్ పుట్టుకొచ్చేస్తోంది.! కాస్త సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయమే. రాహుల్ పాల్గొనే బహిరంగ సభకు ఎవరూ వెళ్ళొద్దని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హుకూం జారీ చేశారు. అలా ఎవరు వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకున్నవాళ్ళే అవుతారని చంద్రబాబు సెలవిచ్చారు.
నవ్విపోదురుగాక మనకేటి.? అన్న చందాన తయారయ్యింది పరిస్థితి. ఓ ముఖ్యమంత్రి, ఓ రాజకీయ పార్టీకి చెందిన ముఖ్య నేత ఏర్పాటు చేసే ఓ రాజకీయ కార్యక్రమానికి జనం వెళ్ళొద్దని ఆదేశించడమేంటి.? చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా ఇలా.? ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ చంద్రబాబు జమానా. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకో ఐదేళ్ళు కాదు, పదేళ్ళు అయినా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కోలుకునే పరిస్థితైతే లేదన్నది నిర్వివాదాంశం.
అయినా, చంద్రబాబుకి కాంగ్రెస్ పార్టీ అన్నా, రాహుల్ గాంధీ అన్నా భయం. ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే, రాహుల్ వస్తున్నాడంటే ఆయన ప్రత్యర్థులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే రాహుల్ ఎక్కడ అడుగు పెడితే, అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఇంకా ఇంకా అధ్వాన్నంగా తయారైపోతోంది గనుక. మరెందుకు, చంద్రబాబు భయపడాలి.? ఇదే ఇప్పుడెవరికీ అర్థం కావట్లేదు.
రాహుల్‌గాంధీ వస్తారు.. ప్రత్యేక హోదా కోసం నినదిస్తారు. చంద్రబాబుకి పోయేదేంటి.? ఏమో గుర్రం ఎగరావచ్చు.. అన్న చందాన, బీజేపీకి కాస్తంత ఆందోళన పెరగొచ్చు ఆంధ్రప్రదేశ్‌లో. అంతే తప్ప, చంద్రబాబుకిగానీ, ఆంధ్రప్రదేశ్‌కిగానీ రాహుల్ రాకతో కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదు. అద్గదీ అసలు విషయం. బీజేపీ అధిష్టానం నుంచి చంద్రబాబుకి అల్టిమేటం జారీ అయి వుండాలి. ఆ అసహనమే రాహుల్‌గాంధీ మీద చూపిస్తున్నట్టున్నారు చంద్రబాబు.
ఒక్కటి మాత్రం నిజం.. చంద్రబాబు తీరుతో, రాహుల్‌గాంధీని చూసి కూడా భయపడతారా.? అంటూ జనం ఆశ్చర్యపోతున్నారు.