సూపర్‌ స్టార్‌కి మళ్ళీ ఏమయ్యింది.?

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మళ్ళీ అమెరికా చెక్కేశారు. ఎందుకు.? అన్నదే ఇక్కడ కీలకమైన అంశం. మామూలుగా సినీ నటులు విదేశాలకు వెళుతూనే వుంటారు.. అదేమీ పెద్ద విషయమే కాదు. కానీ, రజనీకాంత్‌ పరిస్థితి వేరు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే అప్పుడప్పుడూ ఆయన వైద్య చికిత్సల నిమిత్తం విదేశాలకు వెళుతున్నారు. 

ప్రస్తుతం రజనీకాంత్‌ 'కాలా' సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. రజనీకాంత్‌ నటించిన 'రోబో 2.0' సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే 'కాలా' కోసం కొన్ని రిస్కీ సీన్స్‌ని చేసేసిన రజనీకాంత్‌, 'రెస్ట్‌'లో భాగంగా అమెరికాకి వెళ్ళినట్లు తెలుస్తోంది. అక్కడే ఆయనకు మొన్నామధ్య వైద్య చికిత్స జరిగింది. 

గతంలో ఓ సారి రజనీకాంత్‌ తీవ్ర అనారోగ్యానికి గురైతే, చెన్నయ్‌లోని ఆసుపత్రిలో కొన్నాళ్ళు, సింగపూర్‌లోని ఆసుపత్రిలో చాలాకాలం వైద్య చికిత్స చేయించుకున్నారు. సుదీర్ఘకాలం వైద్య చికిత్స అనంతరం రజనీకాంత్‌ కోలుకున్నారు సింగపూర్‌లో. ఫాలో అప్‌ ప్రొసీజర్స్‌ కోసం సింగపూర్‌ వెళ్ళి, ఆ తర్వాత అమెరికాలో మరికొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు రజనీకాంత్‌. 

వీటన్నిటినీ లెక్కల్లోకి తీసుకుంటే, 'కాలా' షూటింగ్‌లో బిజీగా వుండడంతో ఆరోగ్యాన్ని రజనీకాంత్‌ లైట్‌ తీసుకున్నారనీ, చిన్నపాటి ఆరోగ్య సమస్య తలెత్తడంతో షూటింగ్‌కి కొంత బ్రేక్‌ ఇచ్చి వైద్య చికిత్స నిమిత్తం అమెరికాకి వెళ్ళారనీ అర్థమవుతోంది. లేదంటే షెడ్యూల్‌ ప్రకారం ముంబైలో 'కాలా' షూటింగ్‌ కొనసాగాల్సి వుంది.

Show comments