'హీరో'యిజం అంటే ఇలా వుండాలి

'మా హీరోని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు.. మా హీరో కోసం మేం ఏం చేయడానికైనా సిద్ధం..' అంటూ అభిమానులు ఆవేశంతో ఊగిపోవడం కొత్తేమీ కాదు. అయితే, అలాంటి అభిమానుల్ని 'కంట్రోల్‌' చేయగలిగేవాడే నిజమైన హీరో. సినిమాల్లో హీరో, విలన్లను ఉతికి ఆరెయ్యడం ఆన్‌ స్క్రీన్‌ హీరోయిజం. కానీ, అసలు సిసలు హీరోయిజం ఏంటంటే, తమ అభిమానులు హద్దులు దాటుతున్నప్పుడు, సున్నితంగానో కఠినంగానో వారిని మందలించి, అదుపు చేయగలగడం. తద్వారా ఏ హీరో అయినా, తన ఇమేజ్‌ని మరింత పెంచుకున్నవాడవుతాడు. 

ఇప్పుడిదంతా ఎందుకంటే, తమిళ హీరో విజయ్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఓ మహిళా జర్నలిస్ట్‌పై విరుచుకుపడిపోతున్నారు. ఈ తరహా పైత్యం సోషల్‌ మీడియాలో ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైపోయింది. సదరు మహిళా జర్నలిస్టు, విజయ్‌ అభిమానుల నుంచి వస్తోన్న అసభ్యకరమైన పోస్టింగ్‌లతో ఆవేదన చెంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. 

ఈ విషయం ఆనోటా ఈనోటా విజయ్‌ వరకూ వెళ్ళింది. దాంతో, విజయ్‌ స్పందించాడు. 'నన్ను అభిమానించడమంటే ఇంకొర్ని ద్వేషించడం కాదు. విమర్శలు సహజం. ఆ విమర్శల్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. అభిమానులు దురభిమానులుగా మారడం సబబు కాదు..' అంటూ అభిమానులకు క్లాస్‌ తీసుకున్నాడు.

'నన్ను అభిమానించేవారెవరైనాసరే, మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి.. మంచి పనులు చెయ్యకపోయినా ఫర్లేదు, చెడు పనులు చేయకండి.. చెడు పనులకు నా పేరు ఉపయోగించకండి..' అంటూ విజయ్‌ తీసుకున్న క్లాస్‌తో ఆయన అభిమానులూ షాక్‌కి గురయ్యారు. 

ఏ హీరో అభిమాని అయినా, ఏ హీరోయిన్‌ అభిమాని అయినా తెలుసుకోవాల్సిందిదే. అభిమానం హద్దులు దాటితే, అది దురభిమానమే అవుతుంది. ఆ దురభిమానానికి పగ్గాలు వేయగలగడం కూడా 'హీరోయిజమే'.!

Show comments