ఈ చావులేంటి ఛండాలంగా.?

ఆ మధ్య త్రిష, జంతు హింస దారుణమంటూ 'జల్లికట్టు' విషయమై స్పందిస్తే, 'త్రిష అనారోగ్యంతో చనిపోయింది.. ఆమె మరణానికి ప్రగాఢ సానుభూతి..' అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ హోరెత్తాయి. సోషల్‌ మీడియా వున్నదెందుకు.? అంటే, ఇదిగో ఇలాంటి వెర్రి వేషాలు వెయ్యడానికే.. అన్నట్టు, బతికున్నోళ్ళని చంపేస్తున్నారు కొందరు 'ఔత్సాహికులు'. 

ఇక, తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకీ అలాంటి పరిస్థితే ఎదురయ్యింది. అప్పట్లో త్రిష బెదిరిపోయిందిగానీ, ఇక్కడున్నది రామ్‌గోపాల్‌ వర్మ కదా, తనకు నివాళులర్పించినవారికి సింపుల్‌గా సోషల్‌ మీడియా వేదికగా ఓ 'హగ్‌' ఇచ్చేశాడాయన. విషయం అందరికీ తెల్సిందే, వర్మ గత కొన్నాళ్ళుగా మెగా ఫ్యామిలీ మీద 'పడి ఏడుస్తున్నాడు'.! ఇది అభిమానుల ఆవేదన. వర్మ, ఎందుకు మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తున్నాడనేది వేరే విషయం. 

వర్మకి నాగబాబు కౌంటర్‌ ఇచ్చాడు, చిరంజీవి కౌంటర్‌ ఇవ్వడం చూశాం, పవన్‌కళ్యాణ్‌ స్పందించడమూ చూశాం. కానీ, వర్మ రూటే సెపరేటు. 'కాటమరాయుడు' వచ్చాక వర్మ సోషల్‌ మీడియా వేదికగా చెలరేగిపోతున్నాడు. దాంతో ఒళ్ళు మండిపోయింది అభిమానులకి. అలా, వర్మకి నివాళులర్పించేశారు. వర్మ ఆగుతాడా.? తనకు చావే లేదని తేల్చేశాడు. తాను దెయ్యాన్నని ఒప్పేసుకున్నాడు.! అదే మరి వర్మ అంటే. 

అన్నట్టు, వర్మ ఎవర్ని ఉద్దేశించి అన్నాడోగానీ, 'మొరిగే కుక్కలు.. నాకే కుక్కలు..' అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడిపోయాడు. వర్మకి ఓ విషయం అర్థం కావడంలేదు. ఆయన ఒకప్పుడు సంచలన దర్శకుడు. ఇలాంటి చీప్‌ ట్వీట్స్‌తో తన స్థాయిని ఆయన తగ్గించేసుకుంటున్నాడంతే. వర్మ అభిమానులు ఆయన్ని సమర్థిస్తారు, మెగా అభిమానులు వారి వారి హీరోలని సమర్థిస్తారు. అభిమానుల మీద విరుచుకుపడ్డం వల్ల వర్మకి ఒరిగేదేంటట.? మెగా ఫ్యామిలీ మీద వివాదాస్పద ట్వీట్లు వేయడం వల్ల ఆయన బావుకునేదేంటట.? 

ఏదిఏమైనా, సోషల్‌ మీడియాలో ఈ చావుల ట్రెండ్‌ అత్యంత దారుణంగా తయారైంది. బతికున్నోళ్ళను చంపేయడమేంటో మరి.. ఇదేమి శునకానందమో.!

Show comments