వెంకీమామకు బంపర్ ఆఫర్

సురేష్ బాబు-పీపుల్స్ మీడియా కలిసి నిర్మించిన మల్టీస్టారర్ వెంకీమామకు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. నిజానికి సుడి తిరగడం అంటే ఇదే నేమో? అక్టోబర్ నుంచి వాయిదాలు పడుతూ డిసెంబర్ మూడోవారానికి వచ్చిన వెంకీ మామ వున్నట్లుండి తుపాను దిశ మార్చుకుని వేరే వైపు వచ్చినట్లుగా సంక్రాంతి సినిమాల మీదకు వచ్చింది. ఈ మేరకు హడావుడి ప్రారంభమయింది. 

దాంతో ఇప్పుడు సంక్రాంతికి వద్దామని ముందే డిసైడ్ అయిన సినిమాలు అన్నీ కిందా మీదా అవుతున్నాయి. నిజానికి వెంకీ మామ కచ్చితంగా సంక్రాంతికే రావాలని డిసైడ్ అయిపోలేదు. ఆలోచిస్తోంది. ఎన్ని థియేటర్లు దొరుకుతాయి అని లెక్కలు కడుతోంది. కానీ అప్పుడే సంక్రాంతి సినిమాలు మాత్రం అలజడి చెందుతూ, సురేష్ బాబు దగ్గరకు ఓ రాయబారం పంపేసాయి. అద్భుతమైన ఆఫర్ ఇచ్చాయి.

ఇటీవల టాలీవుడ్ లో ఏర్పడిన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి సురేష్ బాబుకు వెళ్లిన  ఆ ఆఫర్ ఏమిటంటే, వెంకీమామ సినిమాను డిసెంబర్ 20కి కాస్త అటు ఇటుగా వేసుకోవాలి. ఆ టైమ్ కు మరే సినిమా రాకుండా సోలో విడుదల దక్కేలా చేసే బాధ్యత గిల్డ్ తీసుకుంటుంది. ప్రతి రోజు పండగే, 96, డిస్కోరాజా, భీష్మ సినిమాలు వాయిదా వేస్తారు. మొత్తం దారి ఖాళీగా వుంచుతారు. అయితే ఇక్కడ చిన్న తకరారు వుంది. బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమా విషయం మాత్రం గిల్డ్ బాధ్యత తీసుకోదు.

ఆ సినిమా వస్తుందా? రాదా?అన్నది గిల్డ్ కు సంబంధం లేదు. ఈ సినిమాలు మాత్రం రాకుండా చూస్తాయి. అదీ ఆఫర్. నిజానికి ఇది మాంచి ఆఫర్. సరైన డేట్ దొరక్కుండా కిందా మీదా అవుతున్న వెంకీ మామకు ఇలాంటి ఆఫర్ రావడం అంటే నిజంగా లక్కీనే కదా? మరి ఇంతకీ సురేష్ బాబు స్పందన ఏమిటన్నది ఇంకా తెలియలేదు. ఆయన నేడో రేపో ఏ విషయమూ చెబుతారు అని తెలుస్తోంది.