అనకాపల్లి నుంచి ఇద్దరు అదృష్టవంతుల పోటీ!

అనకాపల్లి పొలిటికల్ గా ఎంత హీటెక్కించే సీటు అందరికీ తెలిసిందే. అనకాపల్లి ఉద్ధండులు అయిన రాజకీయ నేతలను చూసింది. కొత్త వారికీ చోటిచ్చింది. అటువంటి అనకాపల్లిలో అసెంబ్లీ సీటులో ఒక వింత పోటీ సాగుతోంది.

నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ పోరులో ఒకరు నవ యువకుడు. రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఆయనే వైసీపీ అభ్యర్ధి మలసాల భరత్ కుమార్. మరొకరు తలపండిన వారు విశేషమైన అభిమానం ఉన్నవారు. ఆయనే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.

రెండు సార్లు ఎంపీగా ఒక సారి ఎమ్మెల్యేగా అయిదేళ్ల మంత్రిగా జిల్లా రాజకీయాలను ఔపాసన పట్టిన నేతగా కొణతాల కనిపిస్తారు. అయితే ఈ ఇద్దరి పేర్లు కొద్ది నెలల క్రితం వరకూ వారి పార్టీలో ఉన్న వారికే తెలియదు. వారే ఎమ్మెల్యే అభ్యర్ధులుగా పోటీలో ఉంటారని బహుశా వారు కూడా అనుకోని ఉండరు.

ముందుగా కొణతాల రామకృష్ణ ప్రస్తావన తీసుకుంటే ఆయన దాదాపుగా పదేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పదిహేనేళ్ళుగా ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఫ్రంట్ డోర్ లో లక్ దేవత తలుపు కొట్టి మరీ జనసేన టికెట్ ఆయనకు ఇచ్చేసింది. దాంతో ఆయన పోటీ చేస్తున్నారు.

ఎక్కడో అమెరికాలో ఉంటూ ఉద్యోగ వ్యాపారాలలో ఉండే మలసాల భరత్ కుమార్ కి టికెట్ కూడా అలాగే అదృష్ట దేవత షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ చేతిలో పెట్టేసింది. ఇపుడు ఈ ఇద్దరూ పోటీకి దిగారు. రెండు అదృష్టాల మధ్య పోటీ ఇలా కుదిరింది అన్న మాట.

కొణతాల లక్ ఇంకా చాలా ఉంది. ఆయన తొలిసారి 1989 లోక్ సభ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేస్తే ఓడిపోతారు అనుకున్న సందర్భంలో కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో ఎంపీ అయి గిన్నీస్ బుక్ రికార్డుని క్రియేట్ చేశారు. తృటిలో అలా లక్ వచ్చి పార్లమెంట్ కి దారి చూపించింది అన్న మాట. ఇప్పుడు కూడా ఎందుకు అలా జరగదు అని ఆయన అనుచరులు అభిమానులు అనుకుంటున్నారు.

రాజకీయ జీవిత ఆరంభంలో అలా లక్ కిక్ ఇస్తే జీవిత చరమాంకంలో మరోసారి గుడ్ లక్ అని చెప్పదా అని వారు లాజిక్ పాయిట్ తో కొడుతున్నారు. అలా కొణతాల ఎమ్మెల్యే అని ఆ మీదట ఇంకా లక్ కలసి వస్తే మంత్రి కూడా అని మురిసిపోతున్నారు.

మలసాల ఫ్యామిలీది రాజకీయ కుటుంబం. వారు ప్రధాన పార్టీల అభ్యర్ధుల విజయానికి గతంలో కృషి చేశారు. అయినా భరత్ తండ్రికి ఏనాడూ టికెట్ దక్కలేదు. ఇప్పుడు కొడుకుకు చాన్స్ వచ్చింది. దాంతో ఈ అదృష్టాన్ని తమతోనే ఉంచేసుకోవాలని ఆరాటపడుతున్నారు. గెలుపు కోసం కష్టపడుతున్నారు. మూడు పదులు నిండని ఈ నవ యువకుడు ఈసారి అసెంబ్లీ మెట్లు ఎక్కడం ఖాయమని అంటున్నారు.

ఇద్దరికీ అంగబలం అర్ధబలం ఉంది. రెండు బలమైన సామాజిక వర్గాల దన్ను ఉంది. అనుభవానికి ఓటేస్తే కొణతాలది విక్టరీ. యూత్ కి జై కొడితే భరత్ కి సక్సెస్ అని అంటున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి అదృష్టం జై కొడుతుందో అన్నదే అసలైన పాయింట్ అంటున్నారు.

Show comments