విజ‌య‌వాడ వెస్ట్ లో సుజ‌నా ఎదురీత‌!

బ‌హుశా త‌న రాజ‌కీయ జీవితంలో తొలి సారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో దిగిన సుజ‌నా చౌద‌రికి రాజ‌కీయ ఘాటు ఎలా ఉంటుందో అర్థం అవుతున్న‌ట్టుగా ఉంది. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుకు అతి స‌న్నిహితుడిగా రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయిన నేప‌థ్యం ఉన్న సుజ‌నా చౌద‌రి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్తు కాగానే బీజేపీ నేత అయిపోయిన సంగ‌తి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు! సుజ‌నా చౌద‌రి అలా పార్టీ ఫిరాయించినా ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని తెలుగుదేశం కోర‌నే లేదు! అయినా బీజేపీలో చేరిందే చంద్ర‌బాబు కోసం అయిన‌ప్పుడు అలా ఎందుకు కోర‌ర‌నేది చిన్న‌పిల్లాడికి కూడా అర్థ‌మ‌య్యే విష‌య‌మే! 

మ‌రి ఎందుకోగానీ సుజ‌నా చౌద‌రి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల జోలికి వ‌చ్చారు! అలా అయినా ఎంపీగా పోటీ చేయాల్సిందేమో, అనుకూల నియోజ‌క‌వ‌ర్గం ఏదీ దొర‌క్క విజ‌య‌వాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగారు! మ‌రి ఇంత‌కీ సుజ‌నా చౌద‌రి పరిస్థితి ఏమిటంటే.. ఆయ‌న ఎదురీదుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది! సుజ‌నా చౌద‌రి ఘాటైన ఓట‌మి ఎదురుకావ‌చ్చ‌నే అంటున్నారు వెస్ట్ స్థానికులు!

ఇది స్థాన‌బ‌లిమి రీత్యా ముస్లిం మైనారిటీల నియోజ‌క‌వ‌ర్గంగా పేరు! ఏరికోరి ఈ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన సుజ‌నా అది కూడా బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాడు! ఇక్క‌డ నుంచి గ‌తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నుంచి గెలిచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన జ‌లీల్ ఖాన్ తో చౌద‌రి ఎలాగో రాజీ ప‌డ్డాడు కానీ, అయితే ముస్లింలు మాత్రం ఈ బీజేపీ అభ్య‌ర్థికి ఓటేసే ప‌రిస్థితి లేదు! గ‌త రెండు ప‌ర్యాయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌న విజ‌యాల‌నే న‌మోదు చేసింది.

ఇలాంటి నేప‌థ్యంలో, ప్ర‌స్తుత పరిస్థితుల రీత్యా.. వెస్ట్ లో చౌద‌రి చిత్త‌వ్వ‌డం ఖాయ‌మ‌నే టాక్ వ‌స్తోంది. ఎంతో ఆర్థిక బ‌లం ఉన్న‌ప్ప‌టికీ చౌద‌రి ఇక్క‌డ నుంచి గెలిచే ప‌రిస్థితి లేద‌ని, ఒక కార్పొరేట‌ర్ ను ఇక్క‌డ బ‌రిలో నిలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌నే అంచ‌నాలు వెస్ట్ విష‌యంలో వినిపిస్తూ  ఉన్నాయి. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన నేప‌థ్యం లేని చౌద‌రి తొలి సారి  ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి భంగ‌పాటుకు గుర‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని విజ‌య‌వాడ వెస్ట్ రిపోర్ట్ చెబుతూ ఉంది!

Readmore!

Show comments