ఎమ్బీయస్‌: ఇదా తీపి కబురు?

50 రోజుల గడువు తీరగానే మోదీ గారు తీపికబురు వినిపిస్తారని వెంకయ్య నాయుడుగారు ఊదరగొట్టారు. అదేమిటో అని చాలా ఊహాగానకచ్చేరీలు జరిగాయి. నోట్ల రద్దు వలన మిగిలిన డబ్బును అందరి ఖాతాల్లో తలా కాస్తా వేస్తారన్న పుకారు ఒకటి గట్టిగా షికార్లు చేసింది. డబ్బు మిగలడమేమిటి? అంటే దానికో వివరణ వుంది.

సుమారు 15 లక్షల కోట్ల నోట్లకు సరిపడా బంగారం రిజర్వు బ్యాంకు తన దగ్గర పెట్టుకుని నోట్లు ముద్రించింది. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి అడిగితే ఆ మేరకు డబ్బు యివ్వవలసిన బాధ్యత దానిపై వుంది. నల్లధనికులు తమ వద్ద నోట్ల విలువపై పన్ను కట్టలేదు కాబట్టి, యిప్పుడు దాన్ని బయటపెట్టలేక ఆ నోట్లు బుగ్గి చేయడమో, నీటిపాలు చేయడమో చేస్తారని అంచనా. అది కనీసం ఓ 5 లక్షల కోట్ల వుంటుందనుకుంటే ఆ మేరకు రిజర్వు బాధ్యత తప్పిపోయినట్లే. అంత లాభం సంపాదించినట్లే. ఆ లాభాన్ని కేంద్రప్రభుత్వానికి అది బదిలీ చేస్తే కేంద్రం చేతిలో 5 లక్షల కోట్ల రూ.లు అదనంగా వస్తాయి. దాన్ని ఓ 50 కోట్ల మంది పేదలకు పంచితే తలా పదివేలు వస్తాయి. పూజల్లో చూడండి నవరత్న ఖచిత సింహాసనానికి ప్రత్యామ్నాయంగా అక్షతాన్‌ సమర్పయామి స్టయిల్లో స్విస్‌ బ్యాంకుల నుంచి తెచ్చి పంచిపెడతామన్న 15 లక్షల రూ.లకు బదులుగా యీ పదివేలు పుచ్చుకోండి అని యిస్తే అదే పదివేలని భావించి ఆ 50 కోట్ల మంది మోదీకి మొక్కుతారు - యిదీ ప్లాను.

ఇది మొదటిసారి ఎవరో చెపితే ఏదో జోక్‌ అనుకున్నాను. ఎందుకంటే ఆ 5 లక్షల కోట్లు మిగులు అనేది కేవలం నోషనల్‌, మాటమాత్రంగా అనుకునేది. ప్రస్తుతం చలామణీలో వున్న నోట్లు చేతబట్టి ప్రజలందరూ వెళ్లి దీని విలువకు సమానమైన వస్తువు యివ్వండి అని ఆర్‌బిఐని అడిగే పరిస్థితి రాదు కదా. అందువలన తప్పిపోయిన బాధ్యత అనే లాభం చేతికి వచ్చిందనుకోవడం కూడా అలాటిదే. దాన్ని  ఎలా పంచుతారు అనుకున్నాను. కానీ తర్వాత కొన్ని పత్రికలు కూడా యిలా చేయవచ్చు అని రాశాయి.

కొన్నాళ్లకు డిసెంబరు 30 తర్వాత ముఖ్యమైన ప్రకటన వస్తుంది, అది ప్రజలకు తీపి కబురు అనగానే మళ్లీ దీనిపై ఆలోచన పోయింది. ఎందుకంటే ఆ పాటికి బ్యాంకుల్లోకి ఎంత వెనక్కి వచ్చిందో తెలిసిపోతుంది కదా, యిక వెనక్కి రానిదంతా లాభంగానే లెక్క వేసి యీ పంపిణీ పథకాన్ని ప్రకటిస్తారు కాబోలు అనుకున్నారు. చివరకు డిసెంబరు 31న మోదీ గారి ప్రకటన వచ్చింది. దానిలో ఉన్నదేమిటి? కొన్ని వడ్డీ రేట్ల తగ్గింపు, కొన్ని పథకాలు. ఇలాటివి ఆర్థికమంత్రి కాదు కదా, రిజర్వ్‌ బ్యాంకు గవర్నరు కూడా ప్రకటించరు. ఆర్‌బిఐ నోటిఫికేషన్‌ యిస్తుందంతే. ఇదేనా తీపి కబురు? ఇంకా ఏదో వుంటుంది అనుకుంటూండగా జనవరి 1 న పెట్రోలు, డీజిలు రేట్లు పెంచారు. మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి అంతర్జాతీయంగా పెట్రోలు ధర తగ్గడం, మన దేశంలో పెరగడం షరా మామూలై పోయింది. దీనిలో కొత్త లేదు అనుకుంటూండగా బ్యాంకు ఋణాలపై వడ్డీ రేట్లు తగ్గాయని మరో వార్త. ఇది ముందే వూహించినదే. ఎందుకంటే నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో విపరీతంగా క్యాష్‌ వచ్చి పడింది. దానిలోంచి తీద్దామంటే పరిమితి పెట్టారు. దానికి లోబడి తీద్దామన్నా డబ్బు లేదని బోర్డులు పెట్టారు. దాంతో డబ్బంతా వాళ్ల దగ్గర మేట వేసుకుని పోయింది. అందుకని తక్కువ వడ్డీకి యిస్తానని ఆఫర్‌ చేయడంలో వింత లేదు. 

అయితే బ్యాంకులు యిటీవలి కాలంలో ఋణాలు ఎక్కువగా యివ్వలేకపోవడానికి కారణం - ఇచ్చేందుకు డబ్బు లేక కాదు, యిచ్చిన డబ్బు సవ్యంగా వెనక్కి వస్తుందన్న నమ్మకం లేక! వ్యాపారాలు సరిగ్గా నడవటం లేదు, నడిచినా అప్పులు ఎగ్గొట్టే స్వభావం బలిసింది. ఎగ్గొట్టిన వాళ్లకు రాజకీయ మద్దతు వుంటోంది. వాళ్ల పేర్లు కూడా గుంభనంగా వుంచుతున్నారు. వాళ్లకు శిక్షలు పడటం లేదు. అందువలన ఋణాలన్నీ నిరర్ధక ఆస్తులుగా మారిపోయి బ్యాంకు నష్టాలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి మారకుండా వడ్డీలు తగ్గించినా ప్రయోజనం లేదు.

నోట్ల రద్దు తర్వాత వ్యాపార లావాదేవీలన్నీ 40% వరకు తగ్గాయి. వీళ్లు ఎప్పటికి పుంజుకుంటారో, బ్యాంకుల వద్దకు ధైర్యంగా వచ్చి ఎలా అప్పడుగుతారో ఎవడికీ తెలియదు. బ్యాంకుల వద్ద నిధులు పెరిగితే ఋణాలపై వడ్డీలే కాదు, డిపాజిట్ల రేట్లు కూడా తగ్గుతాయి. డిపాజిట్ల రూపంలో ప్రజలు తమ వద్ద డబ్బు దాచుకుంటే, దాన్ని వడ్డీలకు తిప్పి బ్యాంకులు గడిస్తాయి. ఇప్పుడు ప్రజలు  ప్రత్యేకంగా దాచుకోనక్కరలేదు. మామూలుగా తమ ఖాతాల్లో వేసుకున్న డబ్బుల్ని కూడా బ్యాంకులు బిగబట్టేశాయి. జనవరి 1 తర్వాత కూడా విత్‌డ్రావల్‌ లిమిటు వారానికి 24 వేల పరిమితి పెంచలేదు, దాన్ని ఎంత లక్షణంగా అమలు చేస్తారో వేచి చూడాలి. జనవరి 1 వచ్చినా ఎటిఎమ్‌లలో లిమిట్‌ జస్ట్‌ 2 వేలు పెంచారు. వాటిల్లో ఎన్ని పనిచేస్తాయో మూడు, నాలుగు రోజులు పోయేటప్పటికి నికరంగా తెలుస్తుంది. అప్పిద్దామంటే సరైన బాంకులకు ఋణగ్రహీత కూడా కనబడటం లేదు. అందువలన 'మీ డిపాజిట్టు లేకపోయినా బతకగలం. మీకు యింత వడ్డీ యివ్వాలంటే మాకు కిట్టుబాటు కాదు' అంటూ వడ్డీ తగ్గించగలరు.

ఏడాది చివర్లో మోదీ గారి 'వరాల జల్లు'లో ఓ చినుకు - వయోవృద్ధులు పదేళ్లకు చేసిన డిపాజిట్టుపై 8% వడ్డీ. వయోవృద్ధుడు పదేళ్ల దీర్ఘకాలానికి డిపాజిట్టు చేయాలంటే అతనికి తన ఆయుర్దాయంపై గట్టి నమ్మకం వుండాలి. అందువలన ఎంతమంది దీనివలన లాభపడతారో తెలియదు. పైగా యీ రేటు గతంలో 9% వుంటే దాన్ని 7% కి తగ్గించి యిప్పుడు 8% చేశారు. 

ఇంతకీ, వెనక్కి రాని బ్లాక్‌ మనీని తలా కాస్తా పంచడం అనే పథకాన్ని ప్రకటించలేదు. ఎందుకంటారు? పది రోజుల గడువు వుందనగా 12.5 లక్షల కోట్ల వరకు అంకె వినబడింది. దానిలో కూడా డబుల్‌ కౌంటింగ్‌ వుండవచ్చనే హెచ్చరిక కూడా వినబడింది. తర్వాత ఏదీ వినబడడం మానేసింది. కంప్యూటరైజ్‌ అయిన బ్యాంకింగ్‌ వ్యవస్థ వుండగా, దేశం మొత్తం  స్మార్ట్‌ ఫోన్లు చేత ధరించి డిజిటలైజేషన్‌కు సిద్ధంగా వుందని పాలకులు విశ్వసిస్తూ వుండగా డిసెంబరు 30 వరకు వెనక్కి వచ్చిన నిధులెన్నో రిజర్వు బ్యాంకు యిప్పటివరకు చెప్పకపోవడం వింతగా వుంది. మోదీ గారు తన ఉపన్యాసంలో అత్యంత నాటకీయంగా 'మూడేళ్ల క్రితం ఏ రోజు కా రోజు ఎంత పోయింది? అని అడుగుతూండేవారు, యిప్పుడు ఏ రోజు ఎంత వచ్చింది?' అని అడుగుతున్నారు అని సాభినయపూర్వకంగా వివరించారు. కరక్టు. కిత్‌నా ఆయా? అని జనాలు అడుగుతున్నారు. గతంలో కిత్‌నా గయాకు ఎలా అయితే సరైన సమాధానాలు రాలేదో, యిప్పుడు దీనికీ సమాధానాలు రాలేదు. నిజానికి యీ 50 రోజులూ ఆర్‌బిఐ నిత్యం గణాంకాలు యిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచవలసింది. వాళ్ల మౌనం చూస్తూంటే భయం వేస్తోంది - ఒకవేళ మొత్తం వెనక్కి వచ్చేసిందేమో! మరీ కర్మకాలితే, దొంగ నోట్లు కూడా కలిపి, అసలు అంకె కంటె ఎక్కువే వచ్చిందేమో! ఆర్‌బిఐ నోరు విప్పేదాకా మనం ఎన్నయినా వూహించుకోవచ్చు. దాదాపుగా 15 లక్షల కోట్లూ వెనక్కి వచ్చేసి వుంటుంది అని అంటున్నారు చాలామంది. ఏది ఏమైనా ఒకటి మాత్రం అనుకోవచ్చు - ఏ 2, 3 లక్షల కోట్ల రూ.ల నోట్లో వెనక్కి రాకుండా వుండి వుంటే ప్రభుత్వం గర్వంగా ఆ మేరకు బ్లాక్‌మనీని (నోట్ల రూపంలో వున్న) కట్టడి చేశాం అని చాటుకునేది. అంకెలేమీ లేకుండా అవినీతి దునుమాడాం, నల్ల కుబేరులు భరతం పట్టాం వంటి కబుర్లు చెపితే యివన్నీ ప్రచారంలో భాగంగానే చూడాలంతే. 

గత 50 రోజుల్లో బ్లాక్‌మనీపై సాగిన పోరాటం గురించి చెప్పాలంటే - నవంబరు 8 నుంచి డిసెంబరు 19 వరకు మొత్తం 677 ఐటీ దాడులు జరిగాయి. 3100 నోటీసులు యిచ్చారు. పట్టుకున్న నగదు, నగల విలువ రూ.428 కోట్లు. దానిలో పట్టుబడిన కొత్త నోట్ల విలువ రూ.86 కోట్లు. (అన్నీ 2 వేల నోట్లే). లెక్క చూపని ధనం విలువ రూ.3185 కోట్లు. 220 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేటుకి అప్పగించింది. నిజం చెప్పాలంటే ఈ ఆదాయపు పన్ను దాడులకు, నోట్ల రద్దుకు సంబంధం లేదు. ఇలాటి దాడులు రొటీన్‌గా ఎప్పుడూ సాగవలసినవే. కానీ రెండున్నరేళ్లగా 40 రోజుల వ్యవధిలో యీ స్థాయిలో దాడులు జరగలేదు. అక్రమంగా పోగేసుకున్న యీ ధనం ఎన్నో దశాబ్దాలుగా చేరవేసుకున్నది. మరి అన్నాళ్లూ పట్టుకోలేదేం? ఇప్పుడే ఎందుకు ఉధృతి? అంటే పేద, మధ్యతరగతి ప్రజలను ఊరడించడానికి. 'ఎటిఎమ్‌ల ముందు, బ్యాంకుల ముందు అవస్థలు పడుతున్నామని మీరు మమ్మల్ని తిట్టుకుంటున్నారేమో, మీకే కాదు, డబ్బున్నవాళ్లనూ యిబ్బంది పెడుతున్నాం, అది గమనించండి' అని వాళ్లకు చెప్పడానికి. ఈ ఆదాయపు పన్ను దాడులు జరిగినప్పుడు మాత్రమే వార్తల్లోకి వస్తుంది. ఫలానా సినిమా యాక్టరు వియ్యంకుడి యింట్లో పట్టుబడింది, ఫలానా రాజకీయవేత్త సహచరుడి యింట్లో పట్టుబడింది అని వార్తలు బ్రేకింగ్‌ న్యూసులుగా రెండు రోజులు సందడి చేస్తాయి. తర్వాత వాళ్లెవరూ జైలుకి వెళ్లిన దాఖలాలు కనబడవు. పట్టుబడినదానికి ఏవేవో లెక్కలు చెప్పి కాస్తోకూస్తో జరిమానాలు చెల్లించి బయటపడతారు కాబోలు. బంగారం, రియల్‌ ఎస్టేటు రూపంలో వున్న బ్లాక్‌మనీని అరికట్టే ప్రయత్నాలు ఏమీ జరగలేదు. అదంత సులభమూ కాదు. పైగా యీ దాడులు కొన్ని రాష్ట్రాల్లోనే జరిగాయి. ఆర్థిక రాజధాని ఐన ముంబయిలో పెద్దగా జరగలేదు. 

ఇంతకీ మొత్తం 15 లక్షల కోట్లూ బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి వెనక్కి వచ్చేసింది అనుకుని ఆలోచిస్తే అదీ గొప్పే! ఇప్పటిదాకా వ్యవస్థలోకి రాని డబ్బును దానిలోకి రప్పించి, పన్ను వేయడానికి అనువుగా చేశామని సంతోషించవచ్చు. అయితే బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తెచ్చిన పెద్దమనుషులు దానిపై పన్ను కట్టడానికే తెచ్చారా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ పీరియడ్‌లో తెచ్చిన డబ్బుపై ఆదాయపు పన్ను వసూళ్లు ఏ మేరకు పెరిగాయన్నది 2017 జూన్‌ దాకా తెలియదు. జన్‌ధన్‌ ఖాతాల్లో డబ్బులు వెల్లువెత్తాయన్న సంగతి అందరికీ తెలుసు. రద్దు తర్వాత 45 రోజుల్లో 48 లక్షల ఖాతాల్లో 42 వేల కోట్లు వచ్చాయట. నోట్ల రద్దు ఉప్పు అందిన వారు ముందు నుంచి వేసుకుని వచ్చారేమో తెలియదు కానీ ఆ ఖాతాల్లో అప్పటికే 45 వేల కోట్లున్నాయి. అది ఖాతాదారు సొంత డబ్బు కాదని, ఎవరో ధనికుడి డబ్బనీ అందరికీ తెలుసు. మోదీ ఆ విషయం అంగీకరిస్తూ పేదవాణ్ని ఉద్దేశించి 'డబ్బున్నవాణ్ని మీ గుడిసె చుట్టూ తిప్పుకోండి, డబ్బు వెనక్కి యివ్వకండి' అని హితోపదేశం చేశారు. డబ్బున్నవాడికి వున్న రూకబలం, మూకబలం పేదవాడికి ఎక్కడుంటుంది? అతని తాలూకు రౌడీలు వచ్చి 'నీ ఖాతాలో వేసినందుకు 20% కమిషన్‌ నీకిచ్చాక కూడా అయ్యగారి డబ్బు ఆయనకు యివ్వవా? పరాయివాడి సొమ్ము తింటే నరకానికి పోతావ్‌' అని పరలోకం చూపించి భయపెట్టడమో, అలాటి ప్రవచనాల జోలికి వెళ్లకుండా పదునైన చాకు చూపించి దారికి తెచ్చుకోవడమో జరుగుతుందని మోదీకి మాత్రం తెలియదా? నోట్ల రద్దు ధర్మమాని నగదు రూపంలో వున్న బ్లాక్‌మనీ అంతా లాండరింగ్‌ అయిపోయి వైట్‌ మనీ రూపంలో మన ముందుకు వచ్చింది. ద్రవ్యోల్బణంపై దీని ప్రభావం ఎలా వుంటుందో చూడాలి.

వెంకయ్య నాయుడు గారు డబ్బంతా వెనక్కి వచ్చేసింది అని సంతోషంగా ప్రకటించారు. బహుశా యీ మనీ లాండరింగే ఆయన దృష్టిలో అదే తీపికబురేమో! అసలైన లాండరింగ్‌ రాజకీయ పార్టీల ద్వారా జరిగిందని వినికిడి. మీరూ నేనూ అయితే మన ఖాతాల్లో వెయ్యి రూపాయలు కనబడినా అజ,పజా చెప్పాలి కానీ 20 వేల లోపున వచ్చిన విరాళాల దాతల పేర్లు వాళ్లు చెప్పక్కరలేదు. అందువలన లాండరింగ్‌లో వాళ్లు ప్రధాన భూమిక వహించారట. ఈ సమయంలో ఏ యే పార్టీలకు ఎంతెంత విరాళాలు వచ్చాయో వచ్చే ఏడాదికి కానీ తెలియదు. అదైనా ఎవరైనా స.హ. కార్యకర్త అడిగితే! వాళ్లు సమాధానం చెపితే!! ఇలాటి దొంగదారులు మూసివేయకుండా నోట్ల రద్దు పథకాన్ని ప్రవేశపెట్టడంలో విజ్ఞత ఏముంది? ఈ దొంగదారి ప్రతిపక్షాలకు కూడా అనువుగా వుంది కాబట్టే కాబోలు వాళ్లూ నోట్ల రద్దుపై చేయాల్సినంత ఆందోళన చేయలేదు. 

బినామీ చట్టం గురించి యీ మధ్య తెగ మాట్లాడుతున్నారు. ఆ కేసుల్లో ఆదాయపు పన్ను శాఖ ఒక్క కేసులో కూడా విజయం సాధించ లేదట. నా పేర వున్న ఆస్తి నాది కాదు, ఫలానావారిది అని ప్రకటించి, ఆధారాలు అందించినపుడే ఐటీ కేసు నెగ్గగలదు. భూపరిమితి చట్టం, పట్టణ భూమి పరిమితి చట్టం ఏ మేరకు విఫలమయ్యాయో కళ్లారా చూశాం. భార్యల పేర ఆస్తులు కొనే అనేకమంది ఆవిడ ట్యూషన్లు చెప్పి సంపాదించిందనో, కుట్టుమిషన్‌ కుట్టి సంపాదించిందనో, పుట్టింటి వారు యిచ్చిన స్త్రీ ధనమనో ఎన్నో మార్గాలు చూపించి టాక్స్‌ ఫైల్‌ క్రమంగా బిల్డప్‌ చేస్తారు. ఫామ్‌ హౌస్‌ ఒకటి కొని, దాన్లో నీటివసతి లేకున్నా సరే, తమకు అదనంగా వచ్చిన ఆదాయమంతా అక్కడ పండించిన పంటల మీద వచ్చినదే అని చూపుకుంటారు. ఎకరం భూమిపై యింత ఆదాయం ఎలా వస్తుంది? ఇలా వచ్చేట్టయితే అంతమంది రైతులు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? అని ఎవరైనా అడిగితే ఆదర్శ రైతు కెసియార్‌ కోట్లు సంపాదించలేదా? అని ఎదురు ప్రశ్నిస్తారు.

బినామీ ట్రాన్సాక్షన్లకు తోడు బ్యాంకులు చాలా తమాషాలు చేస్తున్నాయి. యుపికి చెందిన ఒక జన్‌ధన్‌ ఖాతాదారు ఖాతాలో 100 కోట్లు జమ కనబడింది. ఎలా వచ్చిందో బ్యాంకువాళ్లు చెప్పలేక పోయారట. అలా ఎలా చెప్పలేరో నాకు అర్థం కాదు. ఇలా కోట్లాది ఖాతాల్లో జమ చూపించి మరో రెండు రోజులకు రాంగ్‌ క్రెడిట్‌ అంటూ రివర్స్‌ చేసేస్తున్నారేమో! ఎవర్నీ నమ్మడానికి లేకుండా పోయింది. బ్యాంకులకు బ్యాంకు ఐన రిజర్వ్‌ బ్యాంకును కూడా నమ్మే పరిస్థితి లేదు. సామాన్యులకై బ్యాంకులు 'నో క్యాష్‌' బోర్డులు వేళ్లాడదీస్తున్న సమయంలోనే యిన్‌కమ్‌ టాక్సు దాడుల్లో కోట్లాది విలువున్న కొత్త నోట్ల కట్టలు దొరికాయి. అవి ఏ సీరీస్‌కి చెందినవో ఒక్కసారి చూస్తే చాలు - ఆర్‌బిఐ వాటిని ఏ బ్యాంకుకి కేటాయించిందో తెలిసిపోతుంది. ఆ బ్యాంకును నిలదీస్తే అది పక్కదారి ఎలా పట్టిందో తెలిసిపోతుంది. కానీ ఆర్‌బిఐ ఆ సమాచారం చెప్పటం లేదు. గతంలో ఐతే నోట్లు ఆర్‌బిఐ ద్వారా పంపిణీ అయ్యేవని, యీ సారి మూడు ప్రింటింగు ప్రెస్‌ల నుంచి ప్రయివేటు బ్యాంకులకు నేరుగా సరఫరా చేశారని బ్యాంకు అధికారుల ఫెడరేషన్‌ వారు ఆరోపించారు. దానికి ఆర్‌బిఐ ఔననలేదు, కాదనలేదు. ఆర్‌బిఐ మౌనంతో విసిగిన ఒక స.హ. కార్యకర్త నవంబరు 9-19 మధ్య బ్యాంకులకు ఎంతెంత నగదు పంపిణీ చేశారో తెలపాల్సిందని ఆర్‌బిఐని కోరితే ఆ దరఖాస్తును తిరస్కరించింది. వ్యక్తులకు ప్రాణహాని కలిగే ప్రమాదం వున్నపుడు, దర్యాప్తు సంస్థలకు గోప్యంగా సమాచారం యిచ్చినపుడు దాన్ని వెల్లడించవలసిన అవసరం లేదనే సెక్షన్‌ 8(1)(జి) కింద యిస్తున్న మినహాయింపును ఆర్‌బిఐ యీ కేసులో వుపయోగించుకుంది. అది విడ్డూరంగా వుంది. 

ఇలా దాగుడుమూతలు ఆడే అధికారాన్ని, నోట్ల పంపిణీ విధానంలో మార్పు చేసే అధికారాన్ని ఆర్‌బిఐకు ఎవరిచ్చారో తెలియాలి. కేంద్రానికి దీనిలో బాధ్యత లేదా? వాళ్లకు అన్నీ తెలిసే యిలా చేశారనుకోవాలి. వీళ్లందరినీ పట్టుకోవడం ఎవడి తరం? ఈ అక్రమాలన్నీ తనిఖీ చేసేందుకు ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్టుమెంటు వద్ద అంత సిబ్బంది వున్నారా? ఇప్పటి కిప్పుడు ఎవరినైనా వేసుకున్నా వాళ్లు ఆడిటర్ల, బ్యాంకర్ల తెలివితేటల ముందు తూగగలరా? నోట్ల రద్దు తర్వాత ఒక విషయం స్పష్టమైంది - మన వ్యవస్థ పూర్తిగా కుళ్లిపోయింది. ఎక్కడి కక్కడ పందికొక్కులున్నాయి. అవి ప్రభుత్వంలో నిజాయితీ గల అధికారుల కంటె మేధావులు. నోట్ల రద్దు అనేది పెద్ద యుద్ధం. సరైన సైన్యం లేదు, ఉన్న సైన్యంలో సైనికుల కంటె వెన్నుపోటుదారులు ఎక్కువగా వన్నారు. ఇలాటి సైన్యంతో మోదీ కాదు, మరో దోమీ వున్నా యింతకంటె ఏమీ చేయలేరు. ఈ సైన్యాన్ని నమ్ముకుని సమరానికి దిగడం డాన్‌ క్విక్సోట్‌ గాలిమరలపై దాడికి వెళ్లినట్లయింది. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2017)

Show comments