పోరాటాల్లో చిన్నమ్మ గెలుస్తుందా?

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్‌ అలియాస్‌ చిన్నమ్మకు జైల్లో మనశ్శాంతి లేదు. రాజకీయాల్లో ఉన్నవారికి ఇంట్లో ఉంటేనే మనశ్శాంతి ఉండదు. ఇక జైల్లో ఎలా ఉంటుంది? ఆమెకు తాను జైలు శిక్ష అనుభవిస్తున్నాననే బాధ కంటే రాజకీయంగా తనకు ఎదురుదెబ్బలు తగులుతాయేమోననే భయం ఎక్కువగా ఉంది. చిన్నమ్మ పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయింది. ఆమెకు ఇది చాలా పెద్ద ఎదురుదెబ్బ. ఆ ఎదురుదెబ్బను తట్టుకోవాలంటే అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వం తన చెప్పుచేతల్లో ఉండాలి. ప్రస్తుతం ఉంది. కాని భవిష్యత్తులో ఉంటుందనే భరోసా లేదు. ప్రస్తుతం ఆమె మూడు అంశాల్లో పోరాటాలు చేస్తోంది. ఆమె తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉండటం చెల్లదని, ఆ ఎంపిక నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ప్రత్యర్థులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో కమిషన్‌ ఈ విషయం తీవ్రంగా పరిశీలిస్తోంది. దీనిపై శశికళ వివరణ కూడా తీసుకుంది. ప్రస్తుతం అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నం 'రెండాకులు' కోసం మాజీ ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం-శశికళ మధ్య పోరాటం సాగుతోంది.

ఇదీ ఎన్నికల కమిషన్‌ కోర్టులో ఉంది. ఏ రాజకీయ పార్టీలోనైనా చీలిక వచ్చినప్పుడు రెండు వర్గాలూ అసలైన పార్టీ తమదేనని వాదిస్తుంటాయి. రెండు వర్గాలూ ఎన్నికల చిహ్నం కోసం కొట్టుకుంటాయి. సామాన్య జనం పార్టీ జెండానో, మరొకటో గుర్తుంచుకోరు. వారికి బాగా గుర్తుండేది ఎన్నికల చిహ్నం. దశాబ్దాల తరబడి అది వారి బుర్రల్లో రికార్డయి ఉంటుంది. ఏ కారణంగానైనా ఎన్నికల చిహ్నం మారితే ఎన్నికల్లో పార్టీ దెబ్బ తింటుంది. అందుకే పార్టీలు చీలినప్పుడు అన్నింటికంటే ఎన్నికల చిహ్నం పైనే ఎక్కువ పోరాటం జరుగుతుంది. ఇప్పుడు అన్నాడీఎంకేదీ అదే పరిస్థితి. శశికళ వర్గం అధికారంలో ఉన్నప్పటికీ తమదే అసలైన అన్నాడీఎంకే అని పన్నీరుశెల్వం వర్గం వాదిస్తోంది. ఈ నెల 22వ తేదీన ఎన్నికల కమిషన్‌ దగ్గర దీనికి సంబంధించిన పంచాయతీ ఉంది.

ఇక చిన్నమ్మ చేస్తున్న మూడో పోరాటం ఏప్రిల్‌లో జరగబోయే ఆర్‌కే నగర్‌ ఉపఎన్నిక. జయలలిత మరణించేవరకు అది ఆమె నియోజకవర్గం. పూర్వకాలంలో రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు కోటను స్వాధీనం చేసుకుంటే రాజ్యాన్ని జయించినట్లేనని అనేవారు. అదేవిధంగా ఆర్‌కే నగర్‌ నియోజకవర్గంలో విజయం సాధిస్తే శశికళ వర్గాన్ని చావుదెబ్బ తీసినట్లేనని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. శశికళ జైల్లో ఉంటూనే రాజకీయ మనుగడ సాగించాలంటే ఆమె ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన తీరు సరైందేనని ఎన్నికల కమిషన్‌ తీర్పు ఇవ్వాలి. రెండాకుల గుర్తు ఆమె వర్గానికి దక్కాలి. ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికలో గెలవాలి. అక్కడ ఆమె అభ్యర్థి అక్క  కుమారుడు కమ్‌ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి అయిన దినకరన్‌. భవిష్యత్తులో ఇతన్ని ముఖ్యమంత్రిని చేయాలనేది శశికళ ప్లాన్‌ అని ఊహాగానాలు ప్రబలుతున్నాయి. పార్టీని, ప్రభుత్వాన్ని తన కుటుంబమే నడిపించాలని చిన్నమ్మ కోరిక. ఆర్‌కే నగర్‌ ప్రజలు శశికళను వ్యతిరేకిస్తున్నట్లు మీడియాలో కథనాలొస్తున్నాయి. చిన్నమ్మను వ్యతిరేకిస్తున్న జనం దికరన్‌ను ఎలా ఆదరిస్తారు?

కాని జయపై అభిమానంతో దినకరన్‌కు ఓట్లు వేస్తారని శశికళకు విశ్వాసం ఉన్నట్లుంది. శశికళ కారణంగానే 'అమ్మ' చనిపోయిందని, ఆమెకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా తొక్కిపెట్టింది చిన్నమ్మేనని జనం అభిప్రాయం. అమ్మ ఉన్నంత కాలం తాము ప్రభుత్వం ద్వారా అనేక ప్రయోజనాలు పొందామని, కాని ఆమె ఆస్పత్రిలో చేరినప్పటినుంచి తమను ఎవ్వరూ పట్టించుకోలేదని, ఆమె మరణించాక పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మంచినీళ్లు కూడా రోజూ రావడంలేదంటున్నారు.  ఓ పక్క తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న చిన్నమ్మ కొంతకాలం కిందట అన్నాడీఎంకే పార్లమెంటరీ బోర్డు ఛైర్‌పర్సన్‌ అయింది. బోర్డు ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకుంది. జయలలిత బతికున్నంతవరకు ఈ పదవిలో కొనసాగారు. ఆమె చేస్తున్న మూడు పోరాటాల్లో ఓటమి ఎదురైతే ఈ పదవి కూడా ఉండదు. గెలిస్తే మాత్రం పట్టపగ్గాలుండవు. మన్నార్‌గుడి మాఫియా తమిళనాడును ఏలుకుంటుంది.

Show comments