కొరటాల ఎందుకలా 'ట్వీట్లే'శాడంటే.!

'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్‌' సినిమాలతో టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకడిగా ఎదిగాడు కొరటాల శివ. రచయితగా కెరీర్‌ స్టార్ట్‌ చేసి, దర్శకుడిగా ఎదిగిన కొరటాల శివ, సమాజం పట్ల ఖచ్చితమైన అవగాహనతో వున్న వ్యక్తి. అందుకే, ఆయన సినిమాల్లో సమాజం పట్ల నిబద్ధత కన్పిస్తుంటుంది. సమాజానికి మంచి మెసేజ్‌ ఇచ్చే క్రమంలో, దానికి 'కమర్షియల్‌' టచ్‌ని ఇచ్చి, అద్భుతమైన సక్సెస్‌లు అందుకున్నాడు కొరటాల శివ. 

ఇక, ఈ మధ్యకాలంలో కొరటాల శివ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యిందెందుకంటే, సోషల్‌ మీడియా వేదికగా ప్రస్తుత రాజకీయాలపై ప్రశ్నించడం కారణంగానే. టాలీవుడ్‌ని కుదిపేసిన, ఆ మాటకొస్తే తెలంగాణలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్‌ టాపిక్‌ అయిన డ్రగ్స్‌ ఉదంతానికి సంబంధించి మొదటగా ఘాటుగా స్పందించాడు కొరటాల. విచారణ జరుగుతున్న తీరుని ప్రశ్నించలేదు, కానీ రాజకీయ అవినీతిని ప్రశ్నించాడు. డ్రగ్స్‌పై 'సిట్‌' వేశారు, రాజకీయ అవినీతిపైనా 'సిట్‌' వేస్తారా? అని ప్రశ్నించి అందర్నీ ఆశ్చర్యపరిచాడాయన. 

కాస్త గ్యాప్‌ తీసుకుని, 'డర్టీ పాలిటిక్స్‌'ని కడిగి పారేసేందుకు ప్రయత్నించాడు ట్విట్టర్‌లో కొరటాల. ఇంకేముంది.? ఇదంతా తన తాజా చిత్రం 'భరత్‌ అను నేను' సినిమా కోసమేనని అంతా అనుకున్నారు. అయితే, ఈ వాదనల్ని కొరటాల కొట్టి పారేశాడు. సినీ దర్శకుడినైనా, తానూ సమాజంలో ఓ వ్యక్తినని చెప్పాడు. సమాజంలో నేనూ భాగస్వామిని కాబట్టి, రాష్ట్రం మారాలి, దేశం మారాలని కోరుకోవడం తప్పు లేదన్న కొరటాల, డ్రగ్స్‌ కేసులో ప్రభుత్వం, అధికారులు ప్రదర్శించిన ఎగ్రెషన్‌ తనకు నచ్చిందనీ, అదే ఎగ్రెషన్‌ రాజకీయ అవినీతిపైనా, విద్యపైనా, వైద్యంపైనా ప్రదర్శించాల్సి వుందని చెప్పాడు. 

ఇప్పుడు మార్పు మొదలైతే, 20 ఏళ్ళకి మార్పు వస్తుందనే టైపు తాను కాదనీ, ఇప్పుడు మొదలెడితే రేపటికే మార్పు కన్పిస్తుందని బలంగా నమ్మేవాడినని కొరటాల శివ క్లారిటీ ఇచ్చేశాడు. నిజమే, కొరటాల శివలా చాలామంది అలాంటి 'ఆశావాదులు' వున్నారు. కానీ, రాజకీయ వ్యవస్థ సామాన్యుడి ఆశలపై నీళ్ళు చల్లేయడం తప్ప, ఆ ఆశల కోసం పనిచేస్తుందా.? ఛాన్సే లేదు.

Show comments