'జామాత' తప్పు చేశానంటున్నాడు.!

జామాత దశమగ్రహః 

- ఇది స్వర్గీయ నందమూరి తారకరామారావు నోట ఎంతో ఆవేదనతో బయటకొచ్చింది. తనను చంద్రబాబు ఎంత దారుణంగా వెన్నుపోటు పొడిచిందీ చెప్పుకుని కంటతడిపెట్టారు స్వర్గీయ ఎన్టీఆర్‌. 'అధికార మార్పిడి..' అని చంద్రబాబు 'అద్భుతమైన' పేరు పెట్టినా, 'వెన్నుపోటు'గా తెలుగు రాజకీయాల్లో ఎప్పటికీ ఆనాటి ఘటన అలా నిలిచిపోతుందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. 

అయితే, 'జామాత' ఒక్కరు మాత్రమే కాదు.. ఇంకొకరున్నారు.. ఆయనే స్వర్గీయ ఎన్టీఆర్‌ మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. 'వెన్నుపోటు' కార్యక్రమానికి అటు నారా, దగ్గుబాటి సంయుక్తంగా శ్రీకారం చుట్టారన్నది జగమెరిగిన సత్యం. అయితే, ఆ వెన్నుపోటు పొడిచినందుకుగాను, చంద్రబాబుకి ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధినేత పదవి దక్కితే.. పాపం దగ్గుబాటికి ఆనాటి 'వెన్నుపోటు' పాపమొక్కటే మిగిలింది. 

వీలుచిక్కినప్పుడల్లా చంద్రబాబు మీద విరుచుకుపడే దగ్గుబాటి తాజాగా మీడియా ముందుకొచ్చారు. సారీ సారీ.. మీడియానే ఆయన ముందుకెళ్ళింది. ఆనాటి వెన్నుపోటు వ్యవహారం గురించి చెబుతూ, 'తప్పు చేశాను.. అదలా జరిగిపోయిందంతే.. అది నా దురదృష్టం..' అంటూ వాపోయారు దగ్గుబాటి. తన గురించి కొట్టుకోవాల్సిన రీతిలో డబ్బా కొట్టారనుకోండి.. అది వేరే విషయం. ఇంతా చేసి, 'ఇప్పుడు నేనేమీ మీడియా దగ్గరకు రాలేదు.. మీడియానే నా దగ్గరకు వచ్చింది..' అంటూ 'కవర్‌' చేసుకునేందుకు పడరాని పాట్లూ పడ్డారు. 

ఒక్కటి మాత్రం నిజం. తప్పు చేశానని ఆనాటి తప్పుని ఒప్పుకున్నాసరే, స్వర్గీయ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన 'జామాత'ల్లో ఒకరిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అదే సమయంలో అటు, పిల్లనిచ్చిన మామనీ, ఇటు తోడల్లుడినీ వెన్నుపోటు పొడిచిన కారణంగా 'వెన్నుపోటు'కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటే నారా చంద్రబాబునాయుడే అందరికీ గుర్తుకొస్తారెప్పటికైనా.

Show comments