కట్టప్ప క్షమాపణ చెప్పాడప్పా.!

నిన్న సత్యరాజ్‌ తరఫున రాజమౌళి క్షమాపణలు.. నేడు స్వయంగా సత్యరాజ్‌ క్షమాపణలు.. ఇక్కడితో కర్నాటకలో 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమా వివాదానికి శుభం కార్డు పడాల్సిందే. ఎప్పుడో తొమ్మిదేళ్ళ క్రితం సినీ నటుడు సత్యరాజ్‌, కావేరీ జలాల వివాదంపై కామెంట్‌ చేశాడట, ఆ కామెంట్లను కర్నాటకలో ఇప్పుడు కొందరు సీరియస్‌గా తీసుకున్నారట. 'నవ్విపోదురుగాక మనకేటి..' అన్నట్టుంది పరిస్థితి. ఇలాంటి విషయాల్లో వాస్తవాలు అనవసరం.. వివాదాలే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తుంటారు కొందరు. 

ఎలాగైతేనేం, 'బాహుబలి' టీమ్‌ వివాదానికి ముగింపు పలికేందుకు ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేస్తోంది. ఇప్పటికే రాజమౌళి రెండుసార్లు ఈ వివాదంపై స్పందించాడు. నిన్న అయితే సత్యరాజ్‌ తరఫున క్షమాపణలు చెప్పేశాడు. లేటెస్ట్‌గా ఈ రోజు 'కట్టప్ప' సత్యరాజ్‌ కూడా కన్నడిగులకు క్షమాపణ చెప్పాడు. 'కర్నాటక ప్రజలపై నాకెప్పుడూ చిన్న చూపు లేదు.. నా వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి వుంటే నన్ను క్షమించండి.. నేను నటుడ్ని, నాకు అందరూ కావాలి..' అంటూ కట్టప్ప కన్నడిగుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. 

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం నేపథ్యంలో, ఇరు రాష్ట్రాల్లోని కొన్ని సంఘాలు, ఆ వివాదంలోకి సినీ, రాజకీయ ప్రముఖుల్ని లాగడం, ఈ క్రమంలో కొందరు అత్యుత్సాహంతో తమ ప్రాంతానికి ప్రతినిథ్యం వహిస్తున్నట్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెల్సిన విషయాలే. అలా ఎప్పుడో తొమ్మిదేళ్ళ క్రితం చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు 'కట్టప్ప'గా సత్యరాజ్‌ వివరణ ఇచ్చుకుని, క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

Readmore!
Show comments