నేను కమెడియన్ కావాలనుకోలేదు

అక్కా...వచ్చేసావా అక్కా..ఇన్నాళ్లూ ఏమైపోయావక్కా...మగజాతి ఆణిముత్యం..అన్న డైలాగులు గుర్తుకు వస్తే, కమెడియన్ సప్తగిరి కచ్చితంగా కళ్ల ముందుకు వస్తాడు.

ఏడేళ్ల పాటు తెరవెనుక డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో కింద నుంచి పైదాకా పనిచేసిన సప్తగిరి, తెరముందు పాపులర్ కావడానికి ఏడు నెలలు పట్టలేదు.

ప్రేమకథాచిత్రమ్ తో ఓవర్ నైట్ పాపులర్ అయిపోయాడు. ఆ సినిమానే కాదు పరుగు, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సినిమాలు సప్తగిరి కమెడియన్ కెరీర్ ను అంత ఎత్తున నిలిపాయి.

అయితే రాజబాబు నుంచి ఆలీ మీదుగా సునీల్ వరకు అందరు కమెడియన్ల మాదిరిగానే సప్తగిరి కూడా హీరో కావాలనుకుంటున్నాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా జనం ముందుకు వస్తున్నాడు. తనలోని సకల టాలెంట్ లను జనాలకు చూపించేందుకు రెడీ అయిపోతున్నాడు. ఈ నేపథ్యంలో సప్తగిరితో ముఖాముఖి. Readmore!

హీరోగా మారుతున్నారు..మిగిలిన కమెడియన్ల బాటలోనే మీరు పయనిస్తున్నట్లేనా?

అసలు నిజం చెబుతున్నా. నేను కమెడియన్ ను కావాలని అస్సలు అనుకోలేదు. ఆ మాటకు వస్తే అసలు నటుడ్ని కావాలనే అనుకోలేదు. ఏడేళ్లు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసింది నటుడిని కావడానికి కాదు. కానీ నా డిక్షన్, బాడీ లాంగ్వేజ్ చూసి కమెడియన్ గా బావుంటానన్నారు. చేసేసారు. 

మరి హీరో ఎందుకు అవుతున్నారు..డైరక్షన్ చేయవచ్చుగా?

కమెడియన్ గా మారిన తరువాత చకచకా, ఆలోచించే టైమ్ లేకుండానే సినిమాలు చేసుకుంటూ పోయాను. ఒక దశలో పరమరొటీన్ గా సాగిపోతోంది జీవితం అనిపించింది. కాస్త ఛేంజ్ కావాలనిపించింది. 

కానీ హాయిగా సాగిపోతున్న కమెడియన్ కెరీర్ ను పణంగా పెట్టడమే కదా హీరోగా మారడం అంటే. ఆలీ దగ్గర నుంచి సునీల్ వరకు అందరికీ అనుభవమైంది కదా?

నేను వాళ్ల గురించి మాట్లాడను. దేనికైనా మనకు ఎలా రాసిపెట్టి వుంటే అలా జరుగుతుందని నమ్ముతాను. కానీ నాలో వున్న వేరియేషన్స్ అన్నీ తెరపై చూపించాలనుకున్నాను. అలాంటి టైమ్ లో ఈ కథ దొరికింది.

డైరక్షన్ డిపార్ట్ మెంట్ అనుభవం ఇక్కడేమయినా చూపించారా?

చూపించా. తమిళ వెర్షన్ ను తెలుగుకు ఎలా పనికి వస్తుందో, మార్పులు చేర్పులు నేనే చేసాను. అందుకే టైటిల్ కార్డ్స్ లో అడిషనల్ స్క్రీన్ ప్లే అని నా పేరే వేసుకున్నాను.

కమెడియన్ ను అభిమానించేవారు వాళ్ల కామెడీ చూసేందుకే వస్తారు. కానీ మీరేమో డ్యాన్స్ లు, ఫైట్లు చూపిస్తారు. 

హీరో అంటే డ్యాన్స్ లు, ఫైట్లు చేయాలి కాబట్టి, నేను ఈ సినిమాలో చేయలేదు. నేను కమెడియన్ అన్నది పక్కన పెట్టి చూడండి..నా డ్యాన్స్ లు, ఫైట్లు, అప్ టు ది మార్క్ వున్నాయో లేదో మీకే తెలుస్తుంది.

పాటలు విదేశంలో షూట్ చేసినట్లున్నారు..అవసరమా?

నేనయితే ఊటీలోనో, బెంగుళూరులోనో తీద్దాం అన్నాను. కానీ మా ప్రొడ్యూసర్ మాత్రం ఫారిన్ లో తీద్దాం అన్నారు. అందుకే తీసాం.

ఈ సినిమాలో సెంటిమెంట్ బాగా పండిందని మీరు ఫదే పదే చెబుతున్నారు

అవును..ఓ మధ్యతరగతి తండ్రి-కొడుకుల మధ్య నెలకొనే అనుబంధం చాలా బాగా పండింది.

పౌరాణిక పాత్రల్లో కనిపించినట్లున్నారు..అన్నీచేయగలనని ఒకేసారి చెప్పేయాలనుకున్నారా?

నిజంగా కాదు. సినిమాలో సీన్ అలాంటిది. నటుడిగా తనేంటో తండ్రి ముందు ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు కొడుకు. ఆ సందర్భంలో వస్తుంది ఆ సీన్. సింగిల్ టేక్ లో ఓకె అయింది. డబ్బింగ్ కూడా సింగిల్ టేక్ లో చెప్పాను.

ఇకపై సప్తగిరిని కమెడియన్ గా చూసే అవకాశాలు అలాగే వుంటాయా?

తప్పకుండా. మాంచి ప్రాజెక్టులు నాలుగింటికి సైన్ చేసాను. కామెడీ క్యారెక్టర్లు మామూలే. మంచి సబ్జెక్ట్ వస్తే హీరోగా చేయడం మామూలే. 

రైటర్లు డైరక్టర్లయిపోతున్నట్లు కమెడియన్లు హీరోలయిపోతే, కమెడియన్ల కొరత ఎవరు తీరుస్తారు?

ఇక్కడ ఎవరో ఒకరు వస్తూనే వుంటారు. కొరత అనేది వుండదు. నా ముందూ వున్నారు..వెనుక వుంటారు.

కమెడియన్లు హీరోలు అనగానే స్ఫూఫ్ లు కుమ్మేస్తారు..ఈ సినిమాలో కూడా?

రెండుగంటల రెండు నిమషాల సినిమా. ఒక్క స్పూఫ్ వుంటే మీరు నన్ను నిలదీసి అడగండి. సమాధానం చెబుతా. నా రిక్వెస్ట్ ఒక్కటే, కమెడియన్ సప్తగిరిని కాస్సేపు మరిచిపోయి, ఈ సినిమా చూడండి..నేను ఎలా చేసానో చెప్పండి..బాగోలేకపోయినా చెప్పండి..దేనికైనా తీసుకోవడానికి నేను రెడీ

ఓకె బెస్టాఫ్ లక్

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి

Show comments