అయినా 'బాబు'కి నాయకులు కావలె.!

హైద్రాబాద్‌ని నేనే నిర్మించా.. సాఫ్ట్‌వేర్‌ రంగానికి నేనే ఆధ్యుడ్ని.. అని చెప్పుకునే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారికి 'నాయకులు' కావలెను. అదేంటీ, తెలుగుదేశం పార్టీకి కుప్పలు తెప్పలుగా నాయకులున్నారు కదా.. మళ్ళీ, కొత్తగా ఈ నాయకులు కావలెను.. అంటూ చంద్రబాబు 'ఉద్యోగ ప్రకటన' జారీ చేయడమేంటి.? అనుకుంటున్నారా.! 

'నా సమస్య ఏంటంటే.. పార్టీకి నాయకులు కావాలి..' అంటూ చంద్రబాబు తానెదుర్కొంటోన్న అతి తీవ్రమైన సమస్య గురించి, కార్యకర్తల వద్ద మొరపెట్టుకున్నారు. అదీ కర్నూలు జిల్లా నంద్యాలలో. మొన్నీమధ్యనే శిల్పామోహన్‌రెడ్డి, పార్టీకి గుడ్‌ బై చెప్పాక మొత్తం జిల్లాలో టీడీపీ అడ్రస్‌ గల్లంతయ్యిందనే భావనకు చంద్రబాబు వచ్చేసినట్టున్నారు. అవును, చంద్రబాబు ఆందోళనలో అంత అర్థమూ కన్పిస్తుంది తరచి చూస్తే. 

కేఈ కృష్ణమూర్తి సహా చాలామంది నేతలు కర్నూలులో తెలుగుదేశం పార్టీకి వున్నారు. శిల్పామోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఇంకా టీడీపీలోనే వున్నారు. బేసిక్‌గా చంద్రబాబు సమస్య ఏంటంటే, ఎవర్నీ ఆయన నమ్మరు. టీడీపీకి గండి పడిందనే విషయం చంద్రబాబు గుర్తించారనే అనుకోవాలిప్పుడు. అందుకే, పార్టీలో ఇంకెవరూ వుండరేమో.. అందుకే కొత్త నాయకులు కావాలని అనే సంకేతాల్ని ఆయన పంపించేశారు. 

చంద్రబాబు తీరు చూస్తోంటే, నేతలు పార్టీ విడిచి ఒకవేళ వెళ్ళకపోయినా.. ఆయనే తన చర్యల ద్వారా నేతల్ని బయటకు పంపించేసేలా వున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలో వుంది.. ఆ లెక్కన వచ్చే ఎన్నికల దాకా టీడీపీకి ఎలాంటి సమస్యా లేదు. కానీ, చంద్రబాబు అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన తీరే అంత. తాను అభద్రతాభావానికి గురవడమే కాకుండా, పార్టీ శ్రేణుల్ని ఆ మేనియాలోకి నెట్టేస్తారు. 

వైఎస్సార్సీపీ నుంచి 20 మందికి పైగా ఎమ్మెల్యేల్ని కొనుక్కున్నా చంద్రబాబు, నాయకుల కొరతని ఎదుర్కొంటున్నారంటే ఏమనుకోవాలి.? నాయకులు కొనుక్కుంటే దొరకరు.. తయారుచేసుకుంటే నాయకులు తయారవుతారు. చంద్రబాబుకి ఈ వాస్తవం ఎలా తెలుస్తుంది.?

Show comments