జగన్‌ ఛాంబర్‌లోకి నీళ్ళు: ఏది నిజం.?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని తాత్కాలిక పరిపాలనా ప్రాంగణంలోగల అసెంబ్లీ భవనంలోని వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లో 'వర్షం కురిసిన' ఘటన పెద్ద రాజకీయ దుమారానికి కారణమయ్యింది. భారీ వర్షానికి నీరు, వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌ సీలింగ్‌ నుంచి కారడం అందర్నీ విస్మయానికి గురిచేసిన విషయం విదితమే. ఇందులో 'కుట్ర కోణం' కనిపించింది అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కి. ఇంకేముంది.? సీఐడీ విచారణకు ఆదేశించారు. 

సీఐడీ విచారణకన్నా ముందే, భవనంపైనున్న ఓ ప్లాస్టిక్‌ పైప్‌ని కోసివేయడంతో నీరు, వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లోకి జారుకుందనే విషయాన్ని స్పీకర్‌ కోడెల నిర్ధారించేశారు. అయితే, ఆ పైప్‌ని ఎవరు కోశారు.? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే అసెంబ్లీ భవనంలో, పైప్‌లైన్‌ని ఎవరో కోసేయడమంటే అదేమీ చిన్న విషయం కాదు. 

మరోపక్క, పైప్‌ని కోసిన నిందితులెవరో ప్రాథమికంగా సీఐడీ నిర్ధారించిందని టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు విన్పిస్తున్నాయి. టీడీపీ నేతలు, 'వైఎస్సార్సీపీ కుట్ర'గా ఇప్పటికే ఈ వ్యవహారంపై దాదాపు ఓ క్లారిటీ ఇచ్చేసిన విషయం విదితమే. కానీ, మరో వాదన ప్రకారం ఆ పైప్‌ కోసివేతకీ, జగన్‌ ఛాంబర్‌లోకి నీళ్ళు రావడానికీ సంబంధం లేదని తెలుస్తోంది. నీళ్ళు లీకేజ్‌ అయిన వెంటనే, మరమ్మత్తులు చేపట్టడంతో, సీఐడీ విచారణ వల్ల ఉపయోగమేంటన్న వాదనలు తెరపైకొస్తున్నాయి. 

మొత్తమ్మీద, ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా కన్పించడంలేదు. తమ వైఫల్యాల్ని, 'కుట్ర కోణం' వైపు మళ్ళించి, ఆరోపణలనుంచి తప్పించుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ పన్నుతున్న వ్యూహాలు సుస్పష్టమిక్కడ. అదే సమయంలో, ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పడేయాలన్న వ్యూహం తప్ప, వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసిన, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లో ఈ తరహా 'డొల్లతనం' తమ ప్రభుత్వానికే మాయని మచ్చ అన్న విషయాన్ని అధికారపక్షం గుర్తించలేకపోతుండడం శోచనీయం.

Show comments