ఫోకస్‌ టాలీవుడ్‌పైకి షిఫ్ట్‌ చేసిన తాప్సీ

ఇకపై రెగ్యులర్‌గా తెలుగు సినిమాల్లో నటిస్తుందట తాప్సీ. అనుకోకుండా వచ్చిన గ్యాప్‌ తప్పితే తెలుగు సినిమాలకు తాను కావాలని దూరం కాలేదంటోందండోయ్‌. ఇదంతా తన తాజా చిత్రం 'ఆనందో బ్రహ్మ' ప్రమోషన్‌ కోసమే అనుకుంటే, అది పొరపాటేనట. నిజంగానే, తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు ప్రత్యేకమైన గౌరవ మర్యాదలున్నాయని తాప్సీ చెబుతోంది.

ఏంటో, తాప్సీ ఎప్పుడు టాలీవుడ్‌ని పొగుడుతుందో.. ఎప్పుడు టాలీవుడ్‌పై విమర్శలు చేస్తుందో అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. తెలుగు సినిమాల్లో గ్లామర్‌కి తప్ప నటనకు ఆస్కారం వుండదంటూ ఆ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది తాప్సీ. అంతేనా, దర్శకేంద్రుడిపైనా నోరుపారేసుకుని, వివాదాల్లోకెక్కింది. అదంతా గతం.. ఇప్పుడు తాప్సీ పూర్తిగా మారిపోయిందట.

అన్నట్టు, తాప్సీ నటించిన 'ఆనందో బ్రహ్మ' సాంగ్‌ ప్రోమో విడుదలయ్యింది. ఏ మాటకామాటే చెప్పుకోవాలంటే ఈ సినిమాలో తాప్సీ చాలా చాలా బాగుందండోయ్‌. అందంగా కనిపిస్తూనే, భయపెట్టేస్తుందట. 'బేబీ', 'నామ్‌ షబానా', 'పింక్‌' తదితర సినిమాలతో తాప్సీ రేంజ్‌ బాలీవుడ్‌లో అమాంతం పెరిగిపోయింది. అందుకేనేమో, తెలుగు సినిమా అయినా 'ఆనందో బ్రహ్మ'కి తాప్సీ కారణంగా స్పెషల్‌ క్రేజ్‌ వచ్చేసింది.

ఈ సినిమా రిలీజ్‌ కోసం బాలీవుడ్‌ సినీ జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఇంతకీ, తాప్సీ తెలుగు సినిమాల్లో రెగ్యులర్‌గా నటించడం ఖాయమేనా.? ఏమో, 'ఆనందో బ్రహ్మ' సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.

Show comments