ఎమ్బీయస్‌: వరసలెందుకు?

మీరు గమనించే వుంటారు - చంద్రబాబు యీసారి పాలనలోకి వచ్చాక, తనను తాను 'చంద్రన్న'గా మార్కెట్‌ చేసుకుంటున్నారు. గతంలో యిలాటి వరుసలు పెట్టుకోలేదు. అప్పట్లో ఆయన రాష్ట్రాన్ని ఒక కార్పోరేట్‌గా, తనను తాను దానికి సిఇఓగా పొజిషన్‌ చేసుకునేవారు. అది యువతరానికి బాగా నచ్చింది. వాళ్లల్లో నూటికి 90 మందికి వ్యవసాయం చేయడం, చేయించడం బోరు. అందుకే ఆయన 'వ్యవసాయంతో బతుకు తెల్లారదు, కంప్యూటర్లదే భవిష్యత్తు. అందరూ వైట్‌కాలర్‌ జాబ్స్‌కు మళ్లండి' అని పిలుపివ్వగానే యీయన మామూలు తరహా రాజకీయనాయకుడు కాదు, రేపటి చూపున్న ముందుతరం నాయకుడు అని ఆరాధన పెంచుకున్నారు. ఈయన విధానాలను వరల్డ్‌ బ్యాంకు మెచ్చుకుంది, ఐఎంఎఫ్‌ శభాషంది అంటే పొంగిపోయారు. అయితే జనాభాలో వారి శాతం తక్కువ కావడం వలన, రాష్ట్ర ఓటర్లలో అత్యధికులు గ్రామీణులు, వ్యవసాయంపై ఆధారపడినవారు కావడం చేత వారికి ఆయన విధానాలు నచ్చక బాబు ఓడిపోవలసి వచ్చింది. 1994 వరకు ఎన్నికలు ఎన్టీయార్‌ గెలిపించి పెట్టినవే. 1999లో ఒక్కసారే బాబు టిడిపి నాయకుడిగా ఎన్నికలు ఎదుర్కున్నారు. అప్పుడూ సొంతబలం చాలక బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. విడిగా పోటీ చేసి 2004లో, పొత్తులు పెట్టుకుని 2009లో ఓడిపోయారు. ఉమ్మడి రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్న కల తీరకుండానే రాష్ట్రం విడిపోయింది. టిడిపికి బలం వున్న ఆంధ్రప్రాంతం ప్రధానంగా వ్యవసాయాధారితం. ఓ మోస్తరు నగరాలు (ఆట్టే మాట్లాడితే పెద్ద సైజు పట్టణాలు) తప్ప తక్కినవన్నీ పట్టణాలూ, పల్లెలే. హైదరాబాదు తెలంగాణాలో వుండిపోయింది. ఆంధ్రలో ఐటీ వేళ్లూనుకోలేదు. కార్పోరేట్లు కదలి రాలేదు. పెద్ద పరిశ్రమలు వుంటేనే, వాటిలో ఉద్యోగులు, వారి కుటుంబాలు బహుళసంఖ్యలో వుంటేనే ఆ సంస్కృతి, ఆ పరిభాష చెల్లుబాటవుతాయి. పరిశ్రమలు పెద్దగా లేని వూళ్లల్లో ప్రొప్రయిటర్లు, పార్ట్‌నర్లు అంటే తెలుస్తుంది కానీ సిఇఓ, సిఎఫ్‌ఓ వంటి పదాలు ప్రాచుర్యంలో వుండవు. ఆ పేర్లు వింటే ఎవరూ పులకించరు.

అందుకనే ఆంధ్రలో మాత్రమే తనకు ఛాన్సుందని గ్రహించగానే బాబు రైతుబాంధవుడిగా చూపించుకోసాగారు. సిఇఓ వంటి పదాల జోలికి పోకుండా యిరిగేషన్‌ గురించి, ప్రాజెక్టుల గురించి మాట్లాడసాగారు. పరిశ్రమలను తెస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను, విదేశీ సాయంతో రాజధాని కడతాను - వంటి వాగ్దానాలు గుప్పిస్తూనే అవన్నీ యిప్పట్లో కానరానంత దూరంలో వున్నాయి కాబట్టి యీ లోపున కుటుంబపరమైన ఆత్మీయత పెంచుకోవాల్సిన అవసరం వుందని అనుకున్నారు. అందుకే సంక్షేమ పథకాలను విపరీతంగా పెంచేశారు. చేప యిచ్చే బదులు, చేపలు పట్టే విద్య నేర్పుతానన్నది యిదివరకటి బాబు. చేప యిచ్చినా వండుకోలేవు, వండి యింటికి పంపుతానంటున్నది యిప్పటి బాబు. ఎందుకలా? అని అడిగితే నువ్వూ నేను చుట్టాలం కాబట్టి అనడానికి ఓ చుట్టరికం కలుపుకోవాలి. అందుకే యీ చంద్రన్న ఉద్భవించాడు. 

బాంధవ్యం లేకపోయినా వయసులో పెద్దవారిని 'అన్నా' అనే పిలుపు రాయలసీమ, తెలంగాణలలో సాధారణం. కోస్తాలో తక్కువే. ఎన్టీయార్‌ టిడిపి పెట్టినపుడు యీ 'అన్న' బిరుదును సొంతం చేసుకున్నారు. ఇందిరా గాంధీకి ప్రధాన ఓటుబ్యాంకు మహిళలే. భర్త ఏ పార్టీకి ఓటేసినా, వాళ్లు ఇందిరకే ఓటేసేవారు. దానికి గండి కొట్టకపోతే రాష్ట్రంలో కాంగ్రెసును ఓడించలేమని లెక్క వేసుకున్న ఎన్టీయార్‌ వారిని ఆకర్షించడం ఎలా అని ఆలోచించారు. తమిళనాడులో ఎమ్జీయార్‌కు కూడా ప్రధానమైన ఓటుబ్యాంకు మహిళలే. అయితే అక్కడ వాళ్లు ఎమ్జీయార్‌ను అన్నగా భావించలేదు. అన్నా అని పిలవలేదు. తెరపై ఎమ్జీయార్‌ క్రూరపాత్రలు వేయలేదు, సిగరెట్టు, మద్యం ఏదీ సేవించలేదు. అతని పాత్రలన్నీ స్త్రీలను గౌరవించేవి, రక్షించేవి. అయితే అతనిది రొమాంటిక్‌ యిమేజే. ఇద్దరేసి హీరోయిన్లు వుండేవారు. వీళ్లు కాక తక్కినవాళ్లు కూడా అతన్ని చూసి మోహపడినట్లు, డ్రీమ్‌ సాంగ్‌లో అతనితో విహరించినట్లు చూపించి, వాళ్లు తమ ప్రేమ వెల్లడించగానే ఎమ్జీయార్‌ 'నిన్ను చెల్లిగా భావించాను' అని అన్నట్లు చిత్రీకరించేవారు. ఎమ్జీయార్‌ అంటే తమిళ మహిళలు బాగా మోజు పడినట్లు, అతని వాల్‌పోస్టర్లతో తయారుచేసిన పక్కను అద్దెకు తీసుకునేవారనీ మీడియాలో వార్తలు వచ్చేవి. అందువలన ఎమ్జీయార్‌ తనను తాను అన్నగా ప్రొజెక్టు చేసుకోలేదు. ఆ అన్నా బిరుదు అణ్ణాదురైకు వెళ్లిపోయింది. కరుణానిధికున్న బిరుదు కలైంజర్‌ (కళాభిజ్ఞుడు). ఎమ్జీయార్‌ను సామాన్య జనం 'వాదియార్‌' (గురువు) అనేవారు. ఎందుకంటే తన సినిమాలలో, పాటలలో నీతులు చెప్తూండేవాడు. 

ఈ నేపథ్యంలో ఎన్టీయార్‌ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి వాళ్లను ఆడపడుచులని సంబోంధించడం మొదలుపెట్టారు. తను వారికి అన్ననని చెప్పుకోసాగారు. ఈ అన్న పదం ఆనాటి యువతకు కూడా నచ్చింది. నిజానికి అప్పటికి ఆయనకు తాత వయసు. టీన్స్‌లో వున్న కుర్రవాడికి షష్టిపూర్తి చేసుకున్న వ్యక్తి 'అన్న' ఎలా అవుతాడు? పైగా ఎన్టీయార్‌ రాజకీయాల్లో వచ్చాక ప్రచారసభల్లో తిరిగినప్పుడు కాకీ ప్యాంటూ, షర్టూ వేసుకున్నా మిగతా సమయాల్లో పంచె, లాల్చీలతోనే కనబడ్డారు. అయినా అందరూ అన్న, అన్న అన్నారు. దాంతో లక్ష్మీపార్వతి అభిమానులు ఆవిణ్ని వదిన అనేశారు. హరికృష్ణ, బాలకృష్ణలను ఎలా పిలవాలో తెలియక వూరుకున్నారు. కొద్దికాలానికి తండ్రి పేర చీలిక పార్టీ పెట్టిన హరికృష్ణ దాన్ని 'అన్న టిడిపి' అన్నారు. చివరకు తెలుగువాళ్లకు, ఎన్టీయార్‌కు అన్నా-తమ్ముళ్ల బంధం ఖరారై పోయింది. తక్కిన తెలుగువాళ్ల మాట ఎలా వున్నా, టిడిపి కార్యకర్తలందరూ మీడియా పరిభాషలో తమ్ముళ్లయిపోయారు. వారి గురించి నిందాపూర్వకంగా రాసేటప్పుడు పచ్చచొక్కాల వాళ్లని, మెచ్చుకోలుగా రాసేటప్పుడు తమ్ముళ్లని పిలవడం రివాజైంది. తెలుగునాట తక్కిన నాయకులెవరూ వరసలు కలుపుకోలేదు. Readmore!

పొరుగున వున్న జయలలిత చాలాకాలం ఎమ్జీయార్‌ సహచరిగా తనను ప్రొజెక్టు చేసుకుంది. అక్కా, వదినా వంటి పిలుపులు పిలిపించుకోలేదు. వయసు మీరిన తర్వాత అమ్మ అవతారం ఎత్తింది. ఆమె పార్టీ కార్యకర్తలందరూ అమ్మ అంటూ కాళ్ల మీద పడడం ఎలాగూ వుంది. ఇప్పుడు యావత్తు తమిళులకు అమ్మ కాదలిచింది. అమ్మ క్యాంటీన్లు, అమ్మ నీరు, అమ్మ ఫినాయిలు.. ఎటు చూసినా అమ్మే. ఎన్నికల ప్రచారంలో కూడా నేను మీ అమ్మను, మీరు నా బిడ్డలు. బిడ్డకేం కావాలో తల్లికి తెలియదా? మీకు ప్రస్తుతం సారా కావాలి. అందుకే సంపూర్ణ మద్యనిషేధం పెట్టడం లేదు. అంటూ చెప్పుకొచ్చింది. బెంగాల్‌లో మమతా బెనర్జీ అక్క అవతారం ఎత్తింది. అక్కడ అమ్మ అంటే కాళీమా యే గుర్తుకు వస్తుంది జనాలకు. కాళీఘాట్‌లో నివాసముంటూ మళ్లీ ఆవిడతో పోటీ ఎందుకులే అనుకుందేమో అక్కతో సరిపెట్టుకుంది. ఆమె పార్టీ వాళ్లే కాదు, సామాన్యప్రజలు కూడా 'దీదీ'గానే పిలుస్తున్నారు. బెంగాల్‌లో చాలా మంది నాయకులున్నారు. గతంలో కూడా సుభాష్‌బాబు, జ్యోతిబాబు అనే వ్యవహరించేవారు కానీ దాదా అని జనాల చేత పిలిపించుకోలేదు. వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు పేరుకు చివర 'దా' (దాదా'కు సంక్షిప్తరూపం) చేర్చి పిలిచేవారు కానీ, ఫలానావారే దాదా, తక్కినవారు కారు అనే లెవెల్లో ఎవరూ ప్రొజెక్టు కాలేదు. ఈ రోజు మమత దీదీ అనిపించేసుకుంది. ఈ వరసల ప్రభావమో ఏమో కానీ, మమత, జయలలిత గత ఐదేళ్లగా ప్రజాదరణ పొందుతూనే వస్తున్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచారు కూడా. అది చూసి బాబుకి అనిపించి వుంటుంది - తనకీ ఓ చుట్టరికం వుంటే బాగుండునని. గతంలో ఎన్టీయార్‌ వయసు యిప్పుడు బాబుకి వుంది. ఆయన అన్న కాగా లేనిది, యీయన మాత్రం కాలేడా? అందువలన నిజజీవితంలో తాత అయినా 'అన్న'కే బాబు ఫిక్సయ్యారు. దేవీలాల్‌ను హరియాణాలో 'తావూ' (పెదనాన్న) అనేవారు. జయలలిత అమ్మ అనిపించుకుంటోంది కాబట్టి ఆవిడ కంటె రెండేళ్లు మాత్రమే చిన్నయిన బాబు న్యాయప్రకారం మావయ్యో, బాబయ్యో కావాలి. కానీ ఆయన అలా అనుకోలేదు. అన్న దగ్గరే ఆగితేనే యూత్‌ఫుల్‌ అని తోచి వుంటుంది. 

అయితే అన్న బిరుదు అల్‌రెడీ బుక్‌డ్‌. అందుకని తన పేరు కలిపి 'చంద్రన్న'ను తయారు చేశారు. సంక్రాంతి కానుకలను చంద్రన్న సంక్రాంతి కానుకలుగా మార్కెట్‌ చేశారు. ఇప్పుడు ఎటు చూసినా చంద్రన్నే - చంద్రన్న బీమా పథకం, చంద్రన్న విద్యాదీపం, చంద్రన్న రైతు క్షేత్రం పథకం, చంద్రన్న సంచార చికిత్స, చంద్రన్న బాట, చంద్రన్న చేయూత, చంద్రన్న పశుసేవా కేంద్రం...యిలా. గతంలో జయలలిత అమ్మ క్యాంటీన్లను చూసి బాబు అన్న క్యాంటీన్లు పెడతానన్నారు. ఏడాదిన్నరైనా యింకా పెట్టలేదు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూశాక యిప్పుడు పెడతామంటున్నారు. పెెట్టినా వాటిని చంద్రన్న క్యాంటీన్లగానే పెడతారేమో, చూడాలి. సకూరా కంపెనీ తన పేరును 'కోనీకా'గా మార్చుకున్నపుడు ఒక యాడ్‌ తయారు చేశారు. ఒకడు కొండల్లోకి వెళ్లి సకూరా అని అరిస్తే ప్రతిధ్వనిగా 'కోనీకా' అని వినబడుతుంది. అలా యికపై 'అన్న' అని టిడిపి సర్కిల్స్‌లో వినబడితే బదులుగా 'చంద్రన్న' అనే సవరణ వినబడుతుంది. ఇప్పటికే గూగుల్‌ సెర్చ్‌లోకి వెళ్లి ఎన్టీయార్‌ అని కొడితే జూనియర్‌ ఫోటోలే ముందు వస్తాయి. అసలు ఎన్టీయార్‌ ఫోటోలు ఎప్పుడో తర్వాత వస్తాయి. అలాగే కొద్దికాలంలో అన్న అని కొడితే ఆటోకరక్షన్‌ అయిపోయి చంద్రన్న అని కూడా రావచ్చు. 

కాపులకు వరాలిస్తున్నామంటూ ఎనౌన్సు చేసిన పథకాలన్నిటికీ చంద్రన్న పేరు తగిలించేశారు. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. ఇచ్చేది ప్రభుత్వపు డబ్బు. పెట్టే పేరులో సింపుల్‌గా అన్న, అక్క, అమ్మ వుంటే - ఎవరైనా కావచ్చని బుకాయించవచ్చు. ఎందుకంటే అక్క అంటే మమత అని, అమ్మ అంటే జయలలిత అని ప్రస్తుతం అనుకుంటున్నాం. ఇదివరలో అమ్మ అంటే ఇందిరా గాంధీ గుర్తుకు వచ్చేది. అందువలన అలాటి పేర్లు జనరిక్‌ అనవచ్చు. కానీ ఎప్పుడైతే అన్నకు ముందు 'చంద్ర' అని పేరు పెట్టారో  అది ఫలానా వ్యక్తి పెట్టారని తెలిసిపోతుంది. పథకాలకు నాయకుల పేర్లు పెట్టడం ఎప్పణ్నుంచో వుంది. గాంధీ ఉపాధి పథకం, నెహ్రూ యువక్‌ కేంద్ర, ఇందిరమ్మ యిళ్లు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం యిలా జాతీయ నాయకుల పేర్లే కాదు, ముఖ్యమంత్రి పేరు కలిసి వచ్చేట్లు 'ఉద్యోగకిరణాలు' పథకం కూడా పెట్టారు. అందువలన చంద్రబాబు పేరు ఏదైనా పథకానికి పెట్టినా ఆక్షేపణ ఏమీ వుండడానికి వీల్లేదు. కానీ కాపు కులస్తుల భవనానికి కాపేతర వ్యక్తి పేరేమిటి అని కనుబొమలు పైకి లేచాయి. హరిజన్‌ భవన్‌కి ఆంబేడ్కర్‌ పేరో, జగ్జీవన్‌ రామ్‌ పేరో పెడతారు. బిసిల కుద్దేశించిన పథకానికి జ్యోతి పూలే పేరు పెడుతూంటారు. కాపులలో ప్రముఖులెవరూ లేనట్లు కాపుల సంక్షేమానికి ఉద్దేశించిన విదేశీ విద్యా దీవెన, పదోన్నతి, స్వయం ఉపాధి పథకాలకు కూడా కాపేతరుడైన చంద్రబాబు పేరు పెట్టడమేమిటని కాపు నాయకుల బాధ. బాబు తన పేరులోని ముందుభాగం చంద్రను వదిలేసి చివర్లోని 'నాయుడు' పేర 'నాయుడన్న పదోన్నతి..' అని పెట్టి వుంటే దొరికేవారు కారు. కానీ యిప్పుడాయన చంద్రన్న బ్రాండ్‌ యిమేజి బిల్డింగులో వున్నారు. అందుకని ఆ టెక్నిక్‌ వుపయోగించలేదు. దాంతో ముద్రగడ 'మా 'జాతి' వారి యింటిపేరు కూడా చంద్రన్నగా మార్చుకోమంటారేమో' అంటూ ఓవరాక్షన్‌ చేశారు. కొద్దికాలంలోనే ఆయన కా భ్రమలు తొలగిపోతాయి. ఎందుకంటే ఆంధ్ర ప్రభుత్వం దాదాపు అన్ని కులాల వారికి కార్పోరేషన్లు, భవనాలు వాగ్దానాలు చేసింది. ప్రభుత్వధనంతో కట్టిన ఏ కులస్తుల భవనానికైనా ఎలాటి పక్షపాతం చూపకుండా కామన్‌గా చంద్రన్న పేరు పెట్టాలని చూస్తారు. ప్రతిఘటన ఏ మేరకు వుందో చూసుకుని, కొన్ని సందర్భాల్లో మార్పులు చేయవచ్చు కానీ చంద్రన్న పేరుతో చాలా చాలా పథకాలు, భవనాలు వెలవడం ఖాయం. 

2019 నాటికి ఈ అన్నగారి హోదా ఉపకరిస్తుందని బాబు ఐడియా కావచ్చు. ఆయన వరకు బాగానే వుంది కాని, బాలకృష్ణకు యిబ్బందులు వస్తాయి. ఓటర్లతో బంధుత్వాలు కలుపుకోవాలంటే 'నేను.. మీ బాలయ్యబావను' అని చెప్పుకుంటే అదోలా వుంటుంది, ముఖ్యంగా మహిళల వద్ద! ఇక లోకేశ్‌ 'మీ అన్నగారబ్బాయిని' అని చెప్పుకోవాలి. 'అలాటి యిబ్బందేమీ వుండదు, ఎన్టీయార్‌ అన్న కాగా లేనిది, వాళ్ల అల్లుడు కూడా అన్నే అయ్యాడుగా' అని వాదించవచ్చు. నిజమే కానీ 20 ఏళ్ల గ్యాప్‌ తర్వాత బాబు అన్న అవతారం ఎత్తారు. బాలకృష్ణ, బాబు ఒకేసారి ప్రచారంలో దిగుతూ బాలన్న, చంద్రన్న అనిపించుకుంటారా!? ఏమో!

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016)

mbsprasad@gmail.com

Show comments