చాలా మంది వెయిటింగ్ ఇక్కడ..అదే తెలంగాణలో పదవుల పంపిణీ కోసం..ఏదో ఒక ఎన్నికలు అడ్డం వస్తూనే వున్నాయి..అన్నీ అయ్యాయి..అడ్డు లేకుండా ఏలుతూ, ఆనందంగా వున్నారు కేసిఆర్..ఇకనైనా పదవుల పంపిణీ మొదలుపెడతారు అని చొటా మోటా నాయకులు అంతా ఆశగా వున్నారు. ఇలాంటి టైమ్ లో తెలంగాణ జేఎసి నాయకుడు కోదండరామ్ మాటల తూటాలు పేల్చారు..ఇట్నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు గులాబీదళంలో గుబులు మొదలయింది. ఎన్నోఏళ్లుగా పార్టీలో ఉంటూ ఉద్యమంలో పాల్గొని తీరా ఫలితం అనుభవించే సమయంలో పదవులు వడ్డిస్తున్న వేళ, విస్తరి లాగేసినట్లు అయింది.
ఇన్నాళ్లు ఏ పదవులు లేకుండా సొంత ఖర్చు పెట్టుకునే టీఆర్ఎస్ లో ఉంటూ పోరుచేశారు. పోరు ఫలితమిచ్చాక కూడా ఎలాంటి లాభం లేకుండా ఉండాలన్నదే వారి ఆవేదన. ఇప్పుడు టీఆర్ఎస్ నేతల్లో ఇదే పెద్ద కలవరం సృష్టిస్తోంది. కారణం ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. నామినేటెడ్ పోస్టులు కూడా దక్కలేదు. పోని ఇప్పటి వరకు ఇచ్చిన పదవుల్లోనైనా పాత వారికి సముచిత స్థానం లభించిందా అంటే అదీ లేదు.
కొత్తగా ఇతర పార్టీల్లోంచి వచ్చిన వారందరికి పదవులు వరిస్తున్నాయే తప్ప పాత వారికి రావడం లేదు. పైగా కొత్తగా వస్తున్న వారితో పాత వారిలో పదవులున్న వారివి కూడా ఊడిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. తుమ్మల, డి.శ్రీనివాస్, తలసాని ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యమంలో అడుగుకూడా కదపని వారికి అప్పనంగా పదవులు దక్కాయి. కాని పైగా మంచి స్థానం, గుర్తింపు లభిస్తోంది.
కనీసం నామినేటెడ్ పదవులైనా వరిస్తాయని ఆశిస్తే వాటిని కూడా కొత్తగా వచ్చే వారికోసం రిజర్వ్ చేసినందునే భర్తీ చేయడం లేదనే వార్తలు వినిపిస్తుండడంతో పాత వారిలో ఆవేదన తప్పడ లేదు.
ఇద ఈ సమయంలో కాంగ్రెస్ లో హేమాహేమీలైన నేతలు టీఆర్ఎస్ లో చేరుతారంటూ గత కొన్ని రోజులుగా హల్ చల్ కొనసాగుతోంది. పైగా వీరంతా మంత్రిపదవులు, తత్సమాన పదవులు ఆశించి అవి ఇస్తామంటేనే వస్తామని చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో ప్రధానంగా కాంగ్రెస్ ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరు కచ్చితంగా మంత్రి పదవులు కావాలని పట్టుపడుతున్నట్లు సమాచారం.
వీరు కాక మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ లు కూడా టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్లు వార్తలు వెలుబడ్డాయి. వీరు కూడా కాంగ్రెస్ లో ప్రముఖ నేతలే. పైగా వివేక్ అయితే ఏకంగా దళితుని కోటాలో సిఎం పదవినే ఆశించిన నాయకుడు. కాబట్టి వీరికి కూడా కచ్చితంగా మంచి స్థానం కల్పించాలి. అంటే రాష్ట్రస్థాయిలో కీలకమైన నామినేటెడ్ పోస్టులు కట్టబెడతారేమోనన్న భయం టీఆర్ఎస్ నేతల్లో నెలకొంది. అంటే కొత్తగా పదవులు వస్తాయన్న ఆశపోతోంది, పదవుల్లో ఉన్నవారికి ఎక్కడ అవి పోతాయో అన్న భయమూ పట్టుకుంది. మొత్తం మీద కేసీఆర్ ఆకర్ష్ విపక్షాల్లోనే కాదు స్వపక్షంలోనూ అలజడి సృష్టిస్తోంది.