పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఆ సినిమా టైటిల్ ఖరారయ్యింది. ఫస్ట్ లుక్ కూడా బయటకొచ్చింది. సినిమా టైటిల్ 'పైసా వసూల్'. పూరి జగన్నాథ్ ట్రేడ్ మార్క్ టైటిల్ ఇది. ఆయన ట్రేడ్ మార్క్‌కి తగ్గట్టుగానే పక్కా మాస్ సినిమాలా 'పైసా వసూల్' వుండబోతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
ఇక, సినిమాలో బాలయ్య లుక్ విషయానికొస్తే, ఫస్ట్ లుక్‌ని బట్టి చూస్తే బాలకృష్ణ బాగా స్లిమ్ అయినట్లే తెలుస్తోంది. గడ్డం విషయంలో చిన్నపాటి ఛేంజ్ చేశారు. లుక్ పరంగా తీసుకున్న అదనపు కేర్ ఇది కూడా అనుకోవాలేమో.! రెగ్యులర్‌గా బాలకృష్ణ సినిమాల్లో వుండే మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో వుండనున్నాయి.
సినిమా ప్రారంభోత్సవంలోనే, సినిమా ఎలా వుండబోతోందన్న విషయమై దర్శకుడు పూరి జగన్నాథ్ దాదాపు ఓ క్లారిటీ ఇచ్చేశాడు. 'బాలయ్యబాబు ఎలా తెరపై కన్పించాలని కోరుకుంటున్నారో.. అలా చూపించబోతున్నా.. మీరు కోరుకుంటున్నవన్నీ సినిమాలో వుంటాయి.. అభిమానులకు ప్రామిస్ చేస్తున్నా..' అని చెప్పాడు పూరి జగన్నాథ్, సినిమా ప్రారంభోత్సవ సమయంలో. పోర్చుగల్‌లో ప్రస్తుతం లాంగ్ షెడ్యూల్ జరుపుకుంటోంది 'పైసా వసూల్' సినిమా.
'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా తర్వాత కంప్లీట్ మేకోవర్ కోసం పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌ని బాలయ్య కోరుకోవడం, దానికి తగ్గట్టే పూరి జగన్నాథ్ 'పైసా వసూల్' తెరకెక్కిస్తున్నాడనుకోవాలి. శ్రియ, ముస్కాన్ ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు.