వైసీపీ ప్లీనరీపై చంద్రబాబు డేగకన్ను!

ఎన్నికలు ఇంకా రెండు సంవత్సరాల దూరంలో ఉన్నప్పటికీ... చంద్రబాబు కుటిల రాజకీయాల తీరు మాత్రం అప్పుడే శృతి మించుతోంది. వైఎస్సార్ సీపీ అంటేనే పలు సందర్భాల్లో జడుసుకుంటున్న చంద్రబాబునాయుడు.. ఆ పార్టీని కట్టడి చేయడం మీద మరింతగా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ప్లీనరీ నిర్వహించడానికి సిద్ధమవుతున్న తరుణంలో... చంద్రబాబునాయుడు దాన్ని సహించలేకపోతున్నారని అర్థమవుతోంది.

రాజధాని ప్రాంతంగా చెలామణీలో ఉన్న గుంటూరులోనే వైసీపీ నిర్వహిస్తున్న ప్లీనరీ ఏర్పాట్లను చంద్రబాబు సహించలేకపోతున్నారని భోగట్టా. ఈ ప్లీనరీని ఘనంగా నిర్వహించడానికి ఆర్థిక వనరులుగా ఉపయోగపడుతున్న నాయకులు, కార్పొరేట్ వ్యాపారులు ఎవరో, తెరవెనుక నుండి ఈ ప్లీనరీ ఏర్పాట్లకు అండదండలు అందిస్తున్న వారెవ్వరో ఆరా తీయాల్సిందిగా చంద్రబాబు వేగులను పురమాయించినట్లుగా తెలుస్తోంది.

తద్వారా.. జగన్, వైఎస్సార్ సీపీలకు అనుకూలంగా ఆర్థిక వనరులు సమకూరుస్తూ అండగా నిలిచే వారిమీద కొరడా ఝుళిపించి, ప్రత్యర్థుల ఆర్థిక బలానికి గండికొట్టాలనే వ్యూహంతో చంద్రబాబు సర్కారు తెగబడుతున్నట్లుగా కనిపిస్తోంది. కుదిరితే ప్రలోభాలతో లొంగదీసుకోవడం, కుదరకపోతే బెదిరించడం అనేది ఈ ప్రభుత్వానికి తొలినుంచి అలవాటుగానే కనిపిస్తోంది.

తాజా పరిణామాల్లో కూడా.. సదావర్తి భూములను కారుచౌకగా కాజేసిన ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎండగడుతూ.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో నెగ్గిన తీరు చూసి తెదేపా ఎంతగా ఉడికిపోయిందో అందరూ చూసినదే. అదనంగా అయిదు కోట్లు ఎవరైనా కట్టి భూములు తీసుకుంటే ఐటీ దాడులు చేయిస్తాం అని... కట్టకపోతే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోటి రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుందని.. మంత్రి లోకేష్ అనడాన్ని గమనిస్తే వారి తీరు అర్థమవుతుంది.

అంటే.. తమ దోపిడీని అడ్డుకునేలా కోర్టు తీర్పు ప్రకారం ఆ భూములు పొందితే.. కక్ష కడతాం అని చెబుతున్నట్లే ఉంది. అదే తరహాలో.. వైసీపీ ప్లీనరీకి ఆర్థిక మూలాలుగా నిలిచే వారి మీద కూడా చంద్రబాబు కోటరీ డేగకన్ను సారించినట్లుగా రాజకీయవర్గాల్లో గుప్పు మంటోంది. ప్లీనరీకి ఖర్చులు పెడుతున్న వారెవరు? దీని సక్సెస్ కు మూలస్తంభాలుగా నిలుస్తున్న వారెవ్వరు అంటూ ఆరాలు తీస్తున్నట్లు సమాచారం.

నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల నుంచి స్వల్పమొత్తంలో వాటాలుగా విరాళాలు సేకరించి ఆ మొత్తంతో ప్లీనరీ నిర్వహణకు ఏర్పాట్లు చేపడుతున్నది. అయితే... పెద్దమొత్తాల్లో అండగా నిలుస్తున్న వారి మీద కన్నెర్ర చేయడానికి చంద్రబాబు సర్కారు పడుతున్న తాపత్రయం గమనిస్తే చవకబారుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Show comments