పవన్‌కళ్యాణ్‌ 'వాడకం' ఎలా వుంటుందో.!

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుంటానని గతంలో ప్రకటించిన సంగతి తెల్సిందే. తెలంగాణలో అయితే ఈ పోస్ట్‌కి అధికారికంగా హీరోయిన్‌ సమంతని అధికారికంగా ఎంపిక చేశారనుకోండి.. అది వేరే విషయం. ఇక్కడ మేటర్‌, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినది. జనసేన అధినేత హోదాలో, పవన్‌కళ్యాణ్‌ 'చేనేత సమస్యలపై' పోరాడతానంటూ గతంలో ప్రకటించారు. 

ఈ నెల 20వ తేదీన గుంటూరు జిల్లాలో 'చేనేత గర్జన' జరగబోతోంది. ముందుగా దీన్ని, పద్మశాలీ గర్జనగా ప్లాన్‌ చేశారు. పవన్‌కళ్యాణ్‌ ఎంట్రీతో సీన్‌ మారింది. మరోపక్క పేరూ మార్చారు.. ముందు అనుకున్నట్టు కుల గర్జనలా కాకుండా, చేనేత సమస్యలపై గళం విప్పే వేదికగా తీర్చిదిద్దుతున్నారు. అదే సమయంలో జనసేన స్పాన్సర్డ్ సభగా కూడా ఈ సభపై కామెంట్స్ పడుతున్నాయి. ఇంకేముంది, ఈ వేదికపై పవన్‌ హంగామా, వేదిక దిగువన పవన్‌కళ్యాణ్‌ అభిమానుల హంగామా ఓ రేంజ్‌లో కన్పించనుండడం సహజమే. దాదాపు లక్ష మంది దాకా ఈ బహిరంగ సభకు వచ్చే అవకాశాలున్నాయన్నది తాజా ఖబర్‌. అంతకన్నా ఎక్కువమందే వస్తారనే ప్రచారమూ జరుగుతోంది. 

ఇటీవల అమెరికాలో పర్యటించిన పవన్‌కళ్యాణ్‌, ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై తనదైన అభిప్రాయాల్ని కుండబద్దలు గొట్టేశారు. ప్రెస్‌ మీట్లలో మాట్లాడేటప్పుడు ఒకలా, బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ఇంకోలా ఆయన తీరు కన్పిస్తుంటుంది. బహిరంగ సభల్లో జనసేనాధిపతి హంగామా 'వీరావేశం'తో వుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! 

అయితే, జనసేన వేదికలకీ, ఈ తరహా వేదికలకీ తేడా వుంటుంది కాబట్టి, ఈ వేదిక నుంచి పవన్‌ ఎలా ప్రసంగిస్తారు, అటు చేనేత రంగానికీ, ఇటు పార్టీ శ్రేణులకీ ఎలాంటి మెసేజ్ ఇస్తారు.? అన్నది సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. ఒక్కటి మాత్రం నిజం, రాజకీయ నాయకుడిగా పవన్‌కళ్యాణ్‌ 'చేనేత గర్జన'ని వాడుకోవడం తప్పనిసరి. అసలిలాంటి వేదికల్ని సరిగ్గా వాడుకోకపోతేనే తప్పు. కానీ, పవన్ వాడతాడా.? వాడితే, ఆ వాడకం ఎలా వుంటుంది.? వేచి చూడాల్సిందే.! Readmore!

Show comments