చంద్రబాబుని మించిపోయారోచ్‌!

'స్వామిభక్తి' ఈ స్థాయిలో చాటుకోవాలా.? తెలుగుదేశం పార్టీ 'అధికారిక పత్రిక' అనడానికి ఆ రెండు మీడియా సంస్థలూ చాలాకాలంగా పోటీపడ్తున్నాయి. చంద్రబాబుని మెప్పించడంలో భాగంగా 'ఆ రెండు మీడియా సంస్థలు' పడ్తున్న పోటీ చూస్తోంటే, నవ్వురాకుండా వుండదు. నవ్విపోదురుగాక మనకేటి.? అనే స్థాయిలో 'ఆ రెండు మీడియా సంస్థలు' చంద్రబాబు భజనలో మునిగి తేలుతున్నాయి.

'కంప్యూటర్‌ని కనిపెట్టింది నేనే..' అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. చంద్రబాబు హయాంలో తెలుగుగడ్డ మీద ఐటీరంగం వేళ్ళూనుకున్నమాట వాస్తవం. ఈ క్రమంలో ఆయన ఆ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నించినమాట వాస్తవం. ఆ విషయాన్ని జనం చెప్పుకోవాలి. తనకు తానే భజన చేసుకుంటే, చేసిన ఘనకార్యం కూడా అభాసుపాలయిపోతుంది. కానీ, ఎవరూ తనను అభినందించడంలేదు గనుక, తనకు తానే అభినందించేసుకుంటుంటారు చంద్రబాబు.

ఇక, అసలు విషయానికొస్తే, తెలుగు ప్రజలకు రాజకీయం అంటే ఇదీ అని తెలియజేసింది తెలుగుదేశం పార్టీయేనట. చంద్రబాబు భజనలో ముదిరిపోయిన ఓ మీడియా సంస్థ నుంచి వచ్చిన 'పొగడ్త' ఇది. పొగడ్తకైనా ఓ హద్దూ అదుపూ వుండాలి. తెలుగుదేశం పార్టీ పుట్టకముందే ఎందరో మహానుభావులు రాజకీయాల్లో తమ సత్తా చాటారు. జాతీయ పార్టీ కాంగ్రెస్‌కి, తెలుగుదేశం పార్టీ షాక్‌ ఇవ్వడం, రాజకీయాల్లోకి వస్తూనే అధికార పీఠమెక్కడం.. తద్వారా అప్పటి టీడీపీ అధినేత స్వర్గీయ నందమూరి తారకరామారావు చరిత్ర సృష్టించారన్నది నిర్వివాదాంశం. అలాగని, అప్పటిదాకా తెలుగు నేలపై రాజకీయంగా చక్రం తిప్పిన రాజకీయ ప్రముఖుల్ని కించపర్చేలా వ్యవహరించడమేంటట.?

ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌, ఆమరణ నిరాహార దీక్ష చేయాలనుకుని, అందుకోసం సభా ప్రాంగణం వెతుక్కునే పనిలో బిజీగా వుంటే, చంద్రబాబు సర్కార్‌.. ఎక్కడా అవకాశమివ్వలేదాయె. కళాశాల ప్రాంగణాల్లో రాజకీయ కార్యకలాపాలేంటి.? అని ఎన్నో సందర్భాల్లో టీడీపీ, రాజకీయ విమర్శలు చేస్తూవచ్చింది. మరి, ఇప్పుడు చంద్రబాబు సర్కార్‌ చేస్తున్న దేంటి.? విశాఖలో అదీ దెయ్యాల కొంపగా టీడీపీ అభివర్ణించిన ఆంధ్రాయూనివర్సిటీలో 'పసుపు' పండుగ జరుగుతోంది. ఎవ్వరూ నోరు మెదపరేం.!  ఎందుకు నోరు మెదుపుతారు.? తెలుగు నేలకు రాజకీయం పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ కదా.! నవ్విపోదురుగాక.. వాళ్ళకేటి.? వాళ్ళ భజన వాళ్ళదే.

Show comments