భళిరా.. బాహుబలీ

కొన్నింటికి కొలమానాలు వుండవు

లెక్కలు, కూడికలు తీసివేతలు వుండవు

ఎత్తు-లోతు వగైరా తెలియదు.

శిఖరం ఎక్కడో మబ్బులకు ఆవల వుంటుంది.  Readmore!

ఎత్తి చూసి అబ్బురపడడం మినహా, అంచనాలు సరిపోవు.

ఇలాంటి వర్ణనలు ఏ ఇండియన్‌ సినిమాకైనా ఏనాడైనా వినిపించాయా? భారతీయ సినిమా గొప్పదనం ఇప్పుడు కొత్తగా చెప్పనక్కరలేదు. మంచి చెడ్డలు రెండూ వున్నాయి. నీతివుంది.. బూతూ వుంది. మంచీ వుంది చెడూ వుంది. కమర్షియల్‌ సినిమాకు చిరునామాను షోలే, దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే, గజని ఇలా చాలా సినిమా చెప్పాయి. కానీ ఒక్క సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి థియేటర్‌లో తొలి టైటిల్‌ పడేవరకు ప్రేక్షకులను ఆద్యంతం కుదిపేసి, కదిపేసేది, మీడియా, క్రిటిక్స్‌, ఆడియన్స్‌ అందరూ, ప్రతిఒక్కరు, ప్రతిచోటా, ప్రతిమాటా, ప్రతినోటా ఆ సినిమా గురించే మాట్లాడేంతగా మాయచేసిన సినిమా ఒక్కటంటే ఒక్కటి వచ్చిందా? సినిమా పుట్టిన ఇన్ని పదుల ఏళ్ల తరువాత.. వచ్చింది. ఒకే ఒక్కటి. అది కూడా దేశానికి పునాదిలాంటి దక్షిణాది నుంచి, ఉత్తరాదికి ధ్వజ స్తంభంగా ఎదిగి, విజయపతాకాన్ని ధరించి సగర్వంగా నిలిచింది. 

బాహుబలి..

తెలుగు సినిమా రంగం అందించిన ఇండియన్‌ సినిమా. తెలుగువాడు చేత పట్టిన విజయధ్వజం. తెలుగు ప్రతిభకు ప్రపంచం పట్టిన పట్టం. సాధారణంగా హాలీవుడ్‌ సినిమాల గురించి తెలుసుకునేవారికి గుర్తుంటుంది. మూడువందల కోట్ల ప్రాజెక్టు. మూడేళ్ల సమయం ఇలాంటివి. మనకంతా ముఫైకోట్ల బడ్జెట్‌ (బాహుబలి నాటికి). ఆరునెలల సమయం. విడుదలై బాగుంటే ఓ పదికోట్ల లాభం. ఇంతే. 

అలాంటి టైమ్‌లో వందకోట్లకు పైగా బడ్జెట్‌లో ఓ సినిమా ప్లాన్‌ చేయడం అంటేనే సాహసం. తీరా ప్లాన్‌ చేసిన తరువాత రెండు భాగాలు చేయడం అంటేనే అబ్బురం. ఓ కథను రెండు భాగాలు చేసి తీయచ్చా? ప్రేక్షకులకు సంతృప్తి కలిగించవ చ్చా? పైగా భాగానికి భాగానికి నడుమ ఏళ్లకాలం గ్యాప్‌తో అందిస్తే, ప్రేక్షకులకు ఏమైనా అసలు గుర్తువుంటుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. పుంఖాను పుంఖాలుగా. బాహుబలి సినిమా షూట్‌ ప్రారంభమైన నాటి నుంచీ వినిపిస్తూ, జనాలను ఆలోచింపచేస్తూ వచ్చిన ప్రశ్నలన్నింటికీ ఒక్క పార్ట్‌వన్‌నే సమాధానం చెప్పేసింది. కానీ ఒక్క ప్రశ్నను మాత్రం కొత్తగా జనాల ముందు వుంచింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చం పాడు? అదే ఇప్పుడు పార్ట్‌-2 దిశగా జనాలను మళ్లిస్తోంది.

అంకురార్పణ

మగధీరతో రాజుల కథతో ఒకటి, యమదొంగతో యమలోకపు కథతో మరొకటి రెండు సోషియో ఫాంటసీలు చేసిన తరువాత, నేరుగా ఓ జానపద చిత్రం చేస్తే ఎలా వుంటుందీ అన్న ఆలోచన వచ్చింది దర్శకుడు రాజమౌళి. ముఖ్యంగా యమదొంగలో యమలోకం కోసం వాడుకున్న విఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ చూసిన తరువాత ఈ ఆలోచన ఆయనలో బలపడింది. అలా చిన్న ఆవగింజగా ప్రారంభమైన ఆలోచన అంతై.. అంతంతై, వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయింది. 

రాజమౌళి సకుటుంబ సపరివారం అంతా ఒక్కో ఇటుక అందించడంతో ఓ పెద్ద కథాసౌథమే తయారైపోయింది. అప్పు డు కూడా రెండుభాగాల ఆలోచనలేదు. ఓ70కోట్లలో సినిమా తీయాలన్న లెక్కలు తప్ప. తీరా తీయడం ప్రారంభించాక లోతు కనిపిస్తోంది. అయితే లోతు చూసి భయపడలేదు. దాని వైశాల్యం చూసి పొంగిపోయారు. దాంతో కథ రెండుభాగాలైంది. రెండేళ్లు అనుకున్నది అయిదేళ్లయింది. 

ఒక నటుడు, ఓ దర్శకుడు అయిదేళ్లపాటు ఒకే సినిమాపై అలా వుండిపోవడం. మరో సినిమా ఆలోచన అన్నది చేయక పోవడం అన్నది ప్రపంచ సినిమా చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు. ఇదే ఆఖరు కూడా కావచ్చేమో? బాహుబలి నిర్మాణం ఎలాసాగింది.. ఎలాకష్టపడ్డారు అనే దానికన్నా, కల లాంటి ఈ బృహత్‌ ప్రయత్నాన్ని ఎలా సుసాధ్యం చేసుకున్నారు అన్నది గొప్ప విషయం. ఎందుకంటే కళ్ల ముందు స్క్రిప్ట్‌ వుంది. కళ్ల వెనుక ఆలోచనల్లో విజన్‌ వుంది. కానీ ఆ విజన్‌, ఈ స్క్రిప్ట్‌ కలిసి, కళ్ల ముందు సాక్షాత్కరించడం అంటే మాటలు కాదు. 

ఆలోచనల నుంచి ఆవిష్కరణ

తన ఆలోచనల్లో వున్నదానిని కళాకారులకు వివరించి, గీతల్లోకి అనే స్టోరీ బోర్డులోకి మార్చడంలోనే దర్శకుడు రాజమౌళి పెద్ద పని ఫినిష్‌ చేసారు. అక్కడి నుంచి ఆ గీతలకు ప్రాణం పోసి, ఆకారం తయారుచేసి, స్క్రీన్‌ మీదకు తేవడం అన్నది విఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్‌ నిపుణుల శక్తి సామర్థ్యాలకు అద్థంపట్టింది. నిజానికి బాహుబలి తొలిభాగంలో ఇంతకుమించి మరేంలేదు. అందుకే చాలా మంది విమర్శకులు పెదవి విరిచారు. ముఖ్యంగా రాజమౌళి అంటే ఉవ్వెత్తున తెరపై పరుచుకునే భావోద్వేగాలు అస్సలు కనిపించకపోయే సరికి వారికి నీరసం వచ్చింది. ఏ సినిమా తీసుకోండి.. ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ ఇలా ఏదైనా ఎక్కడో అక్కడ గుండెలుపట్టేసే ఎమోషన్లు కనిపిస్తాయి. మరి బాహుబలి వన్‌లో.

అవేవీ? అందుకే చిన్న నిరాశ

కానీ జనాల ఆలోచన వేరుగా వుంది. రాజమౌళి వెండితెరపై ఓ కొత్తలోకం, కొన్ని శతాబ్దాల కిందటి లోకం ఆవిష్కరించాడట. చూద్దాం పదండి. అది ఒక్కటే ఆలోచన. పదేళ్లుగా సినిమా చూడని వారు, డెభైఏళ్లు దాటినవారు, సినిమా థియేటర్‌ అన్నదాన్నే మరిచిపోయి, ఇంటికే పరిమితం అయిపోయిన వాళ్లు, మూకుమ్మడిగా కదిలారు. కదల్లేని వారిని సైతం యువతరం కదిలించి థియేటర్‌కు పట్టుకుపోయింది. దాంతో తెలుగు సినిమాకు ఇలాంటి కలెక్షన్లు అనేది కలలోమాట అనేంతలా కాసుల వర్షం కురిసింది. 

వెతలు బలి

పదులకోట్లు కాదు.. వందలకోట్లు. బాహుబలి ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపేసింది. దర్శకుడు, నిర్మాత, కథానాయకుడు పేరు మాత్రమే తెచ్చుకున్నారేమో? ఎందుకంటే బాహుబలి పార్ట్‌వన్‌లో నిర్మాతలకు లాభంలేదు సరికదా, కాస్తనష్టమే అంటే ఎవ్వరూ నమ్మరు. కానీ అదివాస్తవం. అయితే బాహబలి పేరు చెప్పి ఎన్నో థియేటర్లు బాగుపడ్టాయి. ఎందరో బయ్యర్లు బాగుపడ్డారు. పీకల్లోతు అప్పుల్లో వున్న బయ్యర్లు కొందరు బాహుబలి పుణ్యమా అని అప్పులన్నీ తీర్చేసుకుని, మళ్లీ కొత్త ఇస్త్రీ చొక్కాల్లా తళతళలాడిపోయారు. 

మార్కెటింగ్‌

చిత్రమేమిటంటే బాహుబలి విడుదల దగ్గరయ్యే వరకు ఆ సినిమాకు ఇవ్వాళ కనిపిస్తున్న మార్కెటింగ్‌ మాత్రంలేదు. వుండి వుంటే నిర్మాతలు పార్ట్‌వన్‌లోనే లాభాలు చేసుకునేవారు. బాహుబలి విడుదలైన తరువాత జాతీయ, అంతర్జాతీయంగా లభించిన స్పందన చూసాక, కొత్త కొత్త వేదికలు కనిపించాయి, మార్కెటింగ్‌ మార్గాలు కనిపించాయి. అప్పుడు వాటిని అందిపుచ్చుకోవడం, వివిధ భాషల్లోకి అనువదించడం వంటివి ప్రారంభించారు. జానపద కథలంటే చెవులు కోసుకునే, కళ్లురిక్కించి చూసే చైనాలాంటి దేశ జనాభాకు కూడా బాహుబలిని పరిచయం చేసారు. ఇదంతా బాహుబలి పార్ట్‌-2కు కలిసి వచ్చింది. ఎంత కలిసి వచ్చిందంటే, కేవలం బాహుబలి బ్రాండింగ్‌ ద్వారా సమకూరిన ఒప్పందాల మొత్తం యాభైకోట్లకు పైగానే.

ఒక్క ప్రశ్న

రామాయణం అంతా విన్న తరువాత రాముడికి సీత ఏమవుతుంది అని అడిగిన వారు వెర్రివాడు. సినిమా చివర్న హీరో హీరోయిన్‌ కలుస్తారా? పెళ్లి చేసుకుంటారా? అని మాత్రం ఆలోచించేవాడు తెలుగు ప్రేక్షకుడు. కానీ చిత్రంగా బాహుబలిలో హీరో హీరోయిన్లు కలిసిన వరకే కథ జరిగింది. కానీ జనాలకు అక్కడ అసంతృప్తి కలుగలేదు. వారిని వెంటాడి వేధించింది వేరే ప్రశ్న. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? మహాభారతంలో భీష్ముడి లాంటివాడు కట్టప్ప. పాండవులంటే ఇష్టమే, కానీ కురువంశానికి ఆయన రక్షకుడు. కట్టప్ప భాషలో కట్టు బానిస. మరి అలాంటి భీష్ముడు కూడా పాండవుల కోసం తన ఓటమి ఎలా సాధ్యమో తానే చెప్పేసాడు. పేడి ముఖం చూడనని, పేడిపై ఆయుధం సంధించనని. మరి అలాంటిది కట్టప్ప రివర్స్‌లో చేసాడు. బాహుబలిని చంపేసాడు? ఎందుకు? వై? క్యోం? ఇలా అన్ని రకాల భాషల్లో ఒకటే ఎక్స్‌ ప్రెషన్‌.. ఒకటే ప్రశ్న.. ఒకటే అనుమానం..

పార్ట్‌-2పై ఎన్ని గ్యాసిప్‌లో

పార్ట్‌వన్‌ ఎప్పుడైతే ఊహాతీత విజయం సాధించిందో, పార్ట్‌-2పై అనేక వదంతులు. ఇప్పుడు రాజమౌళి ఆలోచనలు మరింత మారిపోయాయని, బాలీవుడ్‌, కోలీవుడ్‌ నటులు ఇందులో జాయిన్‌ అవుతారని. కథ మొత్తం మార్చేసారని, వన్‌పై తలెత్తిన విమర్శలకు దీటుగా టూలో సమాధానాలు చెబుతారని. కానీ దేనికీ ఆన్సరులేదు, ఖండనాలేదు. జస్ట్‌ ఒకరిద్దరు నార్మల్‌ నటులు మినహా బాహుబలి-2లో చేరిందీ లేదు. 

సకుటుంబ సపరివార చిత్రం

సాధారణంగా ఏ వ్యాపారం, ఏ సంస్థ, ఏ సినిమా అయినా నిర్మాత లేదా పెట్టుబడిదారు లేదా బాస్‌ తాలూకు వాళ్లు ఒకరో ఇద్దరో అక్కడ చేరడం అన్నది కామన్‌. లేదూ ఓ సినిమాను డైరక్టర్‌ తన చేతుల్లోకి తీసుకున్నపుడు, తనకు అనువుగా వున్న అసిస్టెంట్‌లో, లేదా నచ్చిన సాంకేతిక జనాలో అక్కడ చేరడం కామన్‌. కానీ బాహుబలి వైనం అలా కాదు. ఓ తండ్రి, ఓ అన్న, ఓ తమ్ముడు, ఓ వదిన, ఓ భార్య, ఓ కొడుకు, ఇలా.. ఓ..ఓ..ఓలు చాలా అంటే చాలా వు న్నాయి. రాజమౌళి బంధుబలగం అంతా బాహుబలి టీమ్‌ మెంబర్లే. అది కూడా ఏక్టివ్‌ మెంబర్లే. ప్రతి ఒక్కరు 'నేను సైతం' అంటూ కదిలిపోయిన వారే. కష్టపడి పనిచేసిన వారే. సినిమాల చరిత్రలో ఇది కూడా ఓ రికార్డేనేమో?

అంకెలకు అందనంత

తొలిభాగంలో కొనుక్కున్నవాళ్ల బాగుపడ్డారు. మలి భాగంలో ముందుగానే నిర్మాతలు భయంకరంగా డబ్బు చేసుకున్నారు. అధికారిక లెక్కలు అయితే ఎవరూ చెప్పరు, తెలియవు కానీ, అయిదు వందల కోట్లకు పైగానే మార్కెట్‌ అయింది ఈ భాగం. తొలిభాగానికి, మలి భాగంలో కొంత భాగానికి కలిపి 120కోట్ల వరకు ఖర్చ యిందని అంచనా. మరి మలిభాగానికి ఎంతయి వుంటుంది? మరో అంతకావచ్చు. లేదా మరికాస్త ఎక్కువ కావచ్చు. అంటే ఈసారి లాభాలు పెట్టిన దానికి మూడింతలు అనుకోవాలి. మొత్తం ప్రాజెక్టులో నిర్మాతలు, దర్శకుడు, ప్రెజెంటర్‌ అందరూ కనీసం తలో వందకోట్లు లాభం కళ్ల చూసి వుంటారని టాలీవుడ్‌ జనాల అంచనా. నిజం ఏమిటన్నది మాత్రం కట్టప్ప బాహుబలి చంపిన రహస్యం లాంటిదే.

అంచనాలు అందుకుంటుందా?

ఇప్పుడు బాహుబలి-2 విజయం గురించి ఎవరికీ ఏ అనుమానాలు లేవు. చూస్తారా ? చూడరా ? అన్నదానిపై ఏ మల్లగుల్లాలు లేవు. కానీ ఒకటే చిన్న అనుమానం. తొలిభాగం వసూళ్లు చేసిన మొత్తాలకు మలిభాగం విక్రయించారు. అంటే తొలిభాగం వసూళ్లను మించిన వసూళ్లు రావాలి. అప్పుడే కొన్నవాళ్లు గట్టెక్కేది. కానీ ఇక్కడ ఇంకో మతలబు వుంది. కొన్నవాళ్లంతా ఇప్పటికే గట్టెక్కేసే ప్రయత్నాలు షురూ అయిపోయాయి. చిన్న చిన్న ఏరియాల వారీగా, థియేటర్ల వారీగా, ఊళ్ల వారీగా లోకల్‌ అమ్మకాలు షురూ అయిపోయాయి. కొన్నిచోట్ల అప్పుడే బయ్యర్లు లాభాలు చేసేసుకున్నారు. కానీ ఇలా చిన్న చిన్నగా కొన్న చిన్న బయ్యర్లు లాభాలు కళ్ల చూడాలి. 

అయితే ప్రభుత్వం చూసీ చూడనట్లు ఊరుకోవడం, యూనిఫారమ్‌ రేట్లకు కొన్నిచోట్ల అనుమతి ఇవ్వడం, రెండు వందల నుంచి నాలుగు వందలకు వరకు టికెట్‌ రేట్లు వుంటాయన్న ఊహాగానాలు కలిసి ఆ భయాన్ని కూడా దూరంచేస్తున్నాయి. అదేజరిగితే, కలెక్షన్ల విషయంలో బాహుబలి తన రికార్డులను తనే తిరగరాస్తుంది.

అప్పుడు ఎవరైనా అనక తప్పదు..

భళిరా.. బాహుబలీ అని.

 

బాహుబలి-2 అమ్మకాలు

ఇండస్ట్రీలో వినవస్తున్న వార్తల ప్రకారం బాహుబలి 2 ఆంధ్ర, నైజాం అమ్మకాలు ఈ విధంగా వున్నాయి.

ఉత్తరాంధ్ర    13కోట్లు

ఈస్ట్‌    11కోట్లు

వెస్ట్‌    9,5కోట్లు

కృష్ణ    9కోట్లు

గుంటూరు    12కోట్లు

నెల్లూరు    5.5కోట్లు

సీడెడ్‌    25కోట్లు

నైజాం    45(అడ్వాన్స్‌)

మొత్తం ఏపీ, తెలంగాణ  -130కోట్లు

-ఆర్వీ

Show comments