అచ్చమైన రియల్ ఎస్టేట్ వ్యవహారం

సదావర్తి భూముల విషయంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వస్తున్న వివరణ భలే చిత్రంగా వుంది. అచ్చమైన రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంభాషణ మాదిరిగా వుంది. రాజకీయ నాయకులు, కాస్త బలం వున్న వాళ్లు చేసే పని ఒకటి వుంది. అదేమిటంటే..ఎక్కడ డిస్ప్యూట్ లాండ్స్ వుంటే వాటిపైకి వాలిపోవడం. ఎకరా కోటి రూపాయిలు వుంటే తమకు పాతికలక్షలకే అప్పగించమని, మిగిలిన వ్యవహారం తాము చూసుకుంటామని. వివాదాలు పరిష్కరించుకునే బలం లేని వారు అయినకాడికి అమ్మేసుకుంటారు.

సదావర్తి భూముల విషయంలో ప్రభుత్వం అంటే దేవాదాయ శాఖ అదే చేసిందట. సదావర్తి భూములు చాలా వరకు అన్యాక్రాంతం అయిపోయాయట. వాటిల్లో పరిశ్రమలు, అపార్ట్ మెంట్లు వచ్చేసాయట. అలాగే తమిళ నాడు ప్రభుత్వం కూడా వాటిని తీసేసుకోవాలని చూస్తోదంట. ఇది చిరకాలంగా జరుగుతున్నా కాంగ్రెస్ కానీ, వైఎస్ కానీ అస్సలు పట్టించుకోలేదట. తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే చేసిన పనేమిటంటే, ఈ భూములపై మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్లు అవీ కాకుండా న్యాయపరమైన చర్యలు తీసుకోవడం. 

అంతవరకు బాగానే వుంది. మరి ఆ విదంగా ముందుకు వెళ్లి, ఆ భూములు సంరక్షించి, ఆపైన వాటిపై మరేవివాదాలు లేకుండా చూసి, విక్రయించడమో, మరోటో చేయవచ్చు కదా..అబ్బే అలా చేయలేదు..ఈ భూముల పరిస్థితి ఇదీ, అక్కడున్నవారిని ఖాళీ చేయించుకుంటారో, చేయించుకోరో, మీ బాధ మీది...అలా ఎవరైనా కొనుక్కుంటామంటే అమ్మడానికి రెడీ అని ప్రకటించేసారు. అంటే ప్రభుత్వ తన భూములను తను పరిరక్షించుకోలేక, ఖాళీ చేయించలేక, కొనుక్కునేవాళ్లే ప్రభుత్వం కన్నా బలవంతులు అని నమ్మి అమ్మేసిందన్నమాట. అప్పటికీ కూడా ప్రభుత్వం చెప్పిన రేటుకు ఎవరు రాకుంటే, సరే అని ఇంకా తగ్గించి, అయిన కాడికి అమ్మేసారట. 

అంటే ఫక్తు రాజకీయ నాయకుల్లా కొనేవాళ్లు వ్యవహరించారు..తమ భూములు వివాదాస్పదమైతే, ఆ చిక్కు ముడి విప్పుకోలేని యజమానుల్లా ప్రభుత్వం వ్యవహరించిందన్నమాట. మొత్తానికి తెలుగుదేశం పార్టీ పాలన మొత్తం అచ్చమైన రియల్ ఎస్టేట్ గైడ్ లైన్స్ మీదే నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

Show comments