ఒట్టు.. విదేశాల్లోని నల్లధనం తెచ్చేస్తాం.!

'విదేశాల్లోని నల్లధనం తీసుకొచ్చేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వుంది.. ఆ సొమ్ముని భారతదేశానికి తీసుకొచ్చి చూపిస్తాం..' 

- కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తాజా ప్రకటన సారాంశమిదే. 

'విదేశాల్లో నల్లధనం ఎంతుందో తెలియదు.. అలాగే భారతదేశంలో నల్లధనం, ఫేక్‌ కరెన్సీ వివరాలు మా దగ్గర లేవు..' 

- పార్లమెంటులో కేంద్రం, ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానమిది. 

కేంద్రం పార్లమెంటు ద్వారా ఇచ్చిన సమాధానం చూస్తే, కనిపించని శతృవుతో అర్థం పర్థం లేని యుద్ధం చేస్తున్నట్లే అన్పించకమానదు. విదేశాల్లో లక్షల కోట్ల నల్లధనం ముగ్గుతోందనీ, భారతదేశంలోనూ లక్షల కోట్ల నల్లధనం మగ్గిపోతోందనీ ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు బీజేపీ నేతలు ఊకదంపుడు ప్రసంగాలతో ఊదరగొట్టేస్తున్నారు. కానీ, దానికి సంబంధించిన అధికారిక లెక్కలు వెల్లడించేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేయడంలేదు. 

ఏం జరుగుతోంది దేశంలో.! చట్ట సభల్లో సమాధానం చెప్పలేని ప్రభుత్వానికి, నల్లధనం పేరుతో 125 కోట్లమంది భారతీయుల్ని నడి రోడ్డు మీదకు లాగేసి ఏం సాధించదలచుకుంటున్నట్లు.? ఇదిప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న ప్రశ్న. బీజేపీ నేత, తన కుమార్తె పెళ్ళి కోసం 500 కోట్లు ఖర్చు చేస్తారు.. ఇంకో బీజేపీ నేత, కొత్త 2 వేల రూపాయల నోట్ల కట్ట తీసుకుని హల్‌చల్‌ చేస్తాడు.. మరో బీజేపీ నేత, నోట్ల రద్దు నిర్ణయం బీజేపీలో కొందరు నేతలకు ముందే తెలుసని ప్రకటిస్తాడు.. ప్రధాని నరేంద్రమోడీ మాత్రం, దేశ ప్రజలు 50 రోజులపాటు ఇబ్బందులు పడక తప్పదని చెబుతుంటారు. 

నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశంలో పరిస్థితులు దుర్భరంగా మారిపోయాయి. చిత్తుకాగితాల తరహాలో, నోట్ల ముద్రణ అత్యంత దారుణంగా వుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 8 నెలల కసరత్తు.. అంటారు, అక్కడేమో కొత్త నోట్ల ప్రింటింగ్‌కి అవసరాలకు తగ్గట్టుగా జరగని పరిస్థితి. నల్లధనం, విదేశాల్లో లక్షల కోట్లు మగ్గుతున్నప్పుడు, ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అక్కడి నుంచి తీసుకురాకుండా, దేశ ప్రజల్ని.. అందునా సామాన్యుడ్ని ఇబ్బంది పెడ్తుండడమేంటట.? పైగా, బీజేపీ నేతలకు లేని పాట్లు, సామాన్యులకే ఎందుకట.! 

'చేతనైతే మా మీద ఐటీ దాడులు చేయండి..' అంటూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సవాల్‌ విసురుతున్నా, మడికట్టుక్కూర్చున్న నరేంద్రమోడీ, విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకొస్తారని వెంకయ్యనాయుడు చెబుతోంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

Show comments