బాబుకు వెంకయ్యకు మధ్య ఎడం?

ఇది నమ్మశక్యం కాని విషయం. అలాగే ఊహించగలిగిన విషయం కూడా కాదు. కానీ రాజకీయ వర్గాలు ఈమధ్య కొంచెం అనుమానిస్తున్న విషయం. ఒక స్ట్రాటజిక్ మూవ్ తో ఎపి సిఎమ్ చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కాస్త ఎడం పాటిస్తున్నారన్నది ఇప్పుడు చిన్నగా వినిపిస్తోంది. అమిత్ షా. మోడీ ద్వయం ఆలోచనా విధానానికి అనుగుణంగా వెంకయ్య నాయుడు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? లేక నిజంగానే కావాలని ఎడం పాటిస్తున్నారా?అన్నది ఇదమిద్దంగా తెలియడం లేదు. మొత్తం మీద ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందన్నది మాత్రం రాజకీయ వర్గాల్లో అనుమానాలు ధ్వనిస్తోంది.

ఎప్పుడైతే వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి మోడీని కలిసారో? అప్పటి నుంచి వెంకయ్య రాష్ట్ర రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. కీలకమైన సింగపూర్ సంస్థతో అమరావతి ఒప్పందానికి కూడా వెంకయ్య దూరంగా వున్నారు. బాబు కన్నా, వెంకయ్యతో ఇంకా గట్టి సంబంధాలున్న ఈనాడు పత్రిక ఇప్పుడు జగన్ కు కూడా కాస్త కవరేజ్ ఇస్తోంది. అంతే కాదు భాజపా జనాలు ఇప్పుడు కాస్త ఆచి తూచి మాట్లాడుతున్నారు. 

కేవలం వెంకయ్య-బాబు దోస్తీ కారణంగా ఆంధ్రలో భాజపా ఎదగలేకపోతోందన్న అభిప్రాయం ఎప్పటి నుంచో భాజపా శ్రేణుల్లో అంతర్గతంగా వుంది. వెంకయ్య- బాబు సామాజిక వర్గ జనాలు మినహా మిగిలిన వారు ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో వున్నారు. ఈ విషయమై అవకాశం చిక్కినపుడల్లా, భాజపా అధిష్టానానికి నివేదికలు అందుతున్నట్లు తెలుస్తోంది.

ఒక పక్కన పవన్ కళ్యాణ్ ను మోడీ మీదకు ఎగదోస్తూ, తాను మాత్రం దోస్తీ నటించడం, అదే విధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను పట్టించుకోకుండా, కేంద్రాన్నిమాత్రం టార్గెట్ చేయడం వంటి విషయాలపై సవివర నివేదికలు కేంద్రానికి భాజపా శ్రేణుల నుంచి అందినట్లు తెలుస్తోంది.

ఇదంతా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ తప్ప వేరు కాదని ఆ నివేదికల సారాంశంగా తెలుస్తోంది.భాజపా జత వదిలేసే లోగా దాన్ని వీలయినంత బదనామ్ చేయాలన్న వ్యూహం ఆంధ్రలో అమలు అవుతోందని భాజపా రాష్ట్ర వర్గాలు కేంద్రానికి నివేదిక చేరవేసినట్లు తెలుస్తోంది.

దీంతో కేంద్రం బాబుకు చిన్న ఝలక్ ఇవ్వడానికే జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాబు విషయంలో కేంద్రం ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులు గమనించిన వెంకయ్య నాయుడు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు, చంద్రబాబు 2019 ఎన్నికల కోసం పవన్ తో కలిసి  పన్నుతున్న వ్యూహాలు, లోకేష్ కు పగ్గాలు అప్పగించడం ప్రారంభించిన దగ్గర నుంచీ రాష్ట్రంలో దుందుడుకుగా జరుగుతున్న విషయాలు అన్నీ, వెంకయ్యకు అంత నచ్చడం లేదని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. అందుకే ఆయన వ్యూహాత్మకంగా బాబుతో కాస్త ఎడం పాటిస్తున్నారని వినికిడి. 

అందుకే మళ్లీ కేంధ్రంతో సంబంధాలు మరీ డీలా పడిపోకుండా వుండడం కోసం చాలా కాలంగా పక్కన పెట్టిన పరకాల ప్రభాకర్ ను ముందుకు తెచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన ద్వారా కేంద్రానికి రాయబారాలు పంపే ప్రయత్నాలకు పదునుపెట్టినట్లు తెలుస్తోంది. కానీ అమిత్ షా మాత్రం ఆంధ్ర రాష్ట్ర రాజకీయ వ్యవహారాలు మొత్తం తన కనుసన్నలలోనే వుండేలా ఆదేశాలు ఇచ్చినట్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. అందుకే ఈ విషయంలో భాజపా మంత్రులు, నాయకులు, దేశానికి పాజిటివ్ గా అస్సలు పెదవి విప్పడం లేదని అంటున్నారు.

మొత్తానికి ఏదో జరుగుతోంది బాబుకు భాజపాకు మధ్య? ఈ విషయంలో మరింత క్లారిటీ రావడానికి కాస్త సమయం పట్టేలా వుంది.

Show comments