మోడీ మెడకి చుట్టుకోనున్న 'రుణమాఫీ'

రైతు రుణాల మాఫీ అంశం ప్రధాని నరేంద్రమోడీ మెడకి గట్టిగానే చుట్టుకోనుంది. ఉత్తరప్రదేశ్‌లో రుణ మాఫీ భారాన్ని కేంద్రం భరిస్తుందంటూ కేంద్ర మంత్రి రాధా మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలిప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ అంశంపై మొట్టమొదట స్పందించింది తెలంగాణ ప్రభుత్వమే. 'మేం ఎన్నోసార్లు రుణమాఫీ విషయంలో కేంద్రాన్ని కలిశాం.. కేంద్రం మాకు నీతులు చెప్పి పంపింది.. ఉత్తరప్రదేశ్‌లో మాత్రం రుణమాఫీకి కేంద్రం సహకరిస్తామంటోంది.. ఇదెక్కడి న్యాయం.?' అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. 

మరోపక్క, జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌లో మోడీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులకు రుణ మాఫీ చేయాల్సి వుందనీ, ఈ విషయంలో కేంద్రమే రాష్ట్రాలకు అండగా నిలవాలని డిమాండ్‌ చేశారాయన. దేశంలో అన్ని రాష్ట్రాలూ కేంద్ర ప్రభుత్వానికి సమానంగా వుండాలనీ, ఒక రాష్ట్రాన్ని ఒకలా, ఇంకో రాష్ట్రాన్ని ఇంకోలా చూడటం తగదనీ, మరీ ముఖ్యంగా ఉత్తరాది - దక్షిణాది అనే భావన వచ్చేలా వ్యవహరించకూడదని ఉచిత సలహా ఇచ్చారు పవన్‌కళ్యాణ్‌. 

మొత్తమ్మీద, ఇప్పుడీ రుణమాఫీ అంశం కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ మెడకి గట్టిగా చుట్టుకోవడం దాదాపు ఖాయమే. రుణమాఫీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. వందల కోట్లు, వేల కోట్లు సరిపోవు.. దేవవ్యాప్తంగా రైతు రుణాల్ని మాఫీ చేయాలంటే లక్షల కోట్లు కావాలేమో. సున్నితమైన ఇలాంటి అంశాల విషయంలో కేంద్రమంత్రి రాధామోహన్‌సింగ్‌ చాలా తేలిగ్గా చేసిన ప్రకటనతో మేడీ సర్కార్‌లో ప్రకంపనలు షురూ అయ్యాయన్నది నిర్వివాదాంశం. 

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న బీజేపీ, ఇప్పుడక్కడ రుణమాఫీ చేసి.. దానికి కేంద్రం నుంచి నిధుల్ని రాబడితే, ఇతర రాష్ట్రాలు ఊరుకుంటాయా.? ఛాన్సే లేదు. పైగా, గతంలో స్వయంగా నరేంద్రమోడీ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కీ, అటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకీ గతంలో రుణమాఫీపై క్లాసులు తీసుకున్నారాయె.! అందుకే, మోడీ ఇప్పుడు భలేగా ఇరుక్కుపోయారు. మరి, ఈ రుణమాఫీ గండం నుంచి మోడీ ఎలా గట్టెక్కుతారో వేచి చూడాల్సిందే.

Show comments