బాబు అసమర్ధుడా?... మంత్రులు పనికిరానోళ్లా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సమర్ధుడైన సీఎం అంటూ కితాబిచ్చేవారు చాలామంది ఉన్నారు. ఆయన సమర్థుడు కాబట్టే రాష్ట్ర విభజన తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్‌కు జనం ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారని, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎంతో అనుభవజ్ఞుడైన ఆయనైతేనే కొలిక్కి తీసుకురాగలడని చెబుతుంటారు. ఇందులో వాస్తవముంది. బాబు కూడా తాను అత్యంత సమర్ధుడినని ప్రచారం చేసుకుంటుంటారు. వ్యక్తిగతంగా ఆయన సమర్ధుడైవుండొచ్చు. కాని మంత్రుల మాటేమిటి? ప్రభుత్వమంటే ఆయనొక్కడే కాదు కదా. ఆయన సమర్ధుడై మంత్రులు పనికిమాలినవాళ్లయితే ప్రయోజనమేమిటి? 

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈవిధంగానే ఉందని మీడియా నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు అభిప్రాయం కూడా ఇదే. పలు సందర్భాల్లో ఆయన మంత్రులకు క్లాసులు తీసుకున్నట్లు, హెచ్చరికలు చేసినట్లు, వార్నింగులు ఇచ్చినట్లు టీడీపీ అనుకూల మీడియాలోనూ కథనాలొచ్చాయి. తాజాగా ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం మంత్రులు చంద్రబాబు ఆదేశాలను పట్టించుకోవడంలేదు. నిర్వహిస్తున్న శాఖల్లో సమర్థత చూపించడంలేదు. వారి జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత కోసం పనిచేయడంలేదు. పైగా గ్రూపు రాజకీయాలతో ఘర్షణ పడుతున్నారు. ఒకే జిల్లాకు చెందిన మంత్రులకు ఒకరంటే ఒకరికి పడటంలేదు. 

మంత్రులు తమ శాఖలకు సంబంధించి నెలవారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని బాబు ఆదేశించారు. కాని ఎవ్వరూ ఆ పని చేయడంలేదట...! మంత్రులు రాష్ట్రం మొత్తాన్ని పట్టించుకోవాలి. కాని చాలామంది నియోజకవర్గాలనే చూసుకుంటున్నారు. జిల్లాల్లో పర్యటించడంలేదు. ఉంటే విజయవాడలో ఉంటున్నారు లేదా తమ నియోజకవర్గాల్లో ఉంటున్నారు.  చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రులు సరిగా పనిచేయడంలేదని వార్తలొస్తున్నాయి. ఈ విషయం ముఖ్యమంత్రే చెబుతుంటే అవాస్తవం ఎలా అవుతుంది? తాను సమర్థుడినని, నిప్పులాంటివాడినని, అద్భుతాలు చేస్తానని ప్రచారం చేసుకుంటే ప్రయోజనమేముంది? ఆయన ఆదేశాలను మంత్రులు పట్టించుకోకపోతే. 

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఆయన్ని సమర్ధుడనవచ్చా? మంత్రుల్లో అసమర్ధులే కాదు అవినీతిపరులున్నారని, రకరకాల దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారని పార్టీ సమావేశాల్లో చెప్పారు. మరి ఇంత పనికిమాలినవారిని ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడంలేదు. మంత్రుల పనితీరుపై (తనతో సహా) సర్వే నిర్వహించడం, ర్యాంకులు ఇవ్వడం బాబుకు అలవాటు. ఆ ర్యాంకులను మీడియాకూ లీక్‌ చేస్తుంటారు. తక్కువ ర్యాంకులు వచ్చినవారిని, సమర్థంగా పనిచేయనివారిని తీసేసిన దాఖలా ఒక్కటీ లేదు. ఎందుకు అంత ధైర్యం చేయడంలేదు? తీసేస్తే రాజకీయంగా నష్టం కలుగుతుందనే భయం ఉండొచ్చు. 

Readmore!

ఏపీలో కుల, గ్రూపు రాజకీయాలు ఎక్కువ. కొత్తవాళ్లకు  అంటే మొదటిసారి మంత్రులైనవారికి పనిచేయడం తెలియడంలేదు. పాతోళ్లు పనిచేయకుండా తప్పించుకుంటున్నారు.  పరిపాలనలో సగం కాలం పూర్తయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ మాట చెప్పారు.  మంత్రులు పనిచేయడంలేదంటూ బాబు కొంతకాలం క్రితం  తీవ్రస్థాయిలో క్లాసు తీసుకున్నారు. కొందరు అవినీతికి పాల్పడుతున్నారని కూడా పేర్లు చెప్పారు. తప్పులు దిద్దుకోకపోతే తానే రంగంలోకి దిగి వేటు వేస్తానని హెచ్చరించారు. ఇదే సమయంలో తాను బాగా పనిచేస్తున్నానని చెప్పుకున్నారు. తాను నిత్య విద్యార్థినని, ప్రతిదీ తెలుసుకోవాలని తాపత్రయపడతానని, మంత్రుల్లో అది లోపించిందని అన్నారు. 

ప్రజలు తప్పు చేస్తే ప్రభువుకే (రాజుకు) శిక్ష పడాలన్నారు వెనకటి పెద్దలు.  మంత్రులు సరిగా పనిచేయడంలేదంటే అందుకు ముందు శిక్ష పడాల్సింది బాబుకే. పనిచేయనివారిని తీసేసి పనిచేసేవారిని పెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది. మంత్రులు పనిచేయడంలేదని, తానొక్కడినే ఇరవైనాలుగు గంటలూ కష్టపడుతున్నానని అనుకూల మీడియాలో ప్రచారం చేసుకొని సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. కాని పనిచేయని మంత్రులను మార్చరు. ఇది తనకే అమానమని ఆయన గ్రహించడంలేదు. 'ప్రభుత్వానికి మంచి పేరొస్తున్నా మంత్రులకు రావడంలేదు' అంటున్నారు. ప్రభుత్వం వేరు మంత్రులు వేరా? ఇదేం లాజిక్‌? నిజానికి ఎవరి పని వారిని చేయనిస్తే బాగానే పనిచేస్తారేమో...! 

కాని చంద్రబాబు అన్ని పనులు తానే మీదేసుకొని చేస్తుంటారు. 'తానొకడైనా తలకొక రూపై'...అన్నట్లుగా అన్ని చోట్లా తానే కనబడాలని, అన్ని పనులూ తానే చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇలాంటప్పుడు మంత్రులకు చేయడానికి పనెక్కడ ఉంటుంది? ఈ కోణంలో కూడా చంద్రబాబు ఆలోచిస్తే బాగుంటుంది. 

Show comments