లెజెండ్స్: వాళ్ళిద్దరికీ నో రీప్లేస్‌మెంట్‌

తమిళనాడు రాజకీయాలు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరగనున్నాయి.? అధికార అన్నాడీఎంకే భవితవ్యం ఏమవుతుంది.? ప్రతిపక్షం డీఎంకే పరిస్థితి ఏంటి.? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఇవే ప్రశ్నల చుట్టూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూయడంతో, ఆమె వారసుడిగా ప్రస్తుతానికి పన్నీర్‌సెల్వం అటు పార్టీ బాధ్యతల్ని, ఇటు ప్రభుత్వ బాధ్యతల్నీ భుజానికెత్తుకున్నారు. ఈయన, జయలలితకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడే కాదు, భక్తుడు కూడా. నిన్న రాత్రే పన్నీర్‌ సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు. 

ఇక, డీఎంకే అధినేత కరుణానిధి ఇంకా రాజకీయాల్లోనే వున్నా, వృద్ధాప్యం నేపథ్యంలో పార్టీ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించలేని పరిస్థితి. పుత్రరత్నాల చేతుల్లో పార్టీని పెట్టక తప్పని పరిస్థితి. పెట్టినా, ఆ పార్టీని కరుణానిధిలా వాళ్ళెవరూ నడపలేరన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం కరుణానిధి కూడా అనారోగ్యంతో బాధపడ్తున్నారు. 

ఇటు కరుణానిధి, అటు జయలలిత.. ఇద్దరూ పోటాపోటీగా రాజకీయ వ్యూహాలు రచించేవారు. ఒకరు అధికారంలో వుంటే, ఇంకొకరిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలుండేవి. ఈ మధ్యకాలంలో అలాంటివేమీ లేవనుకోండి.. అది వేరే విషయం. 'మీరు ఓడిపోయినా, మిమ్మల్ని జైలుకు పంపించనులెండి..' అంటూ జయలలిత గత ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. 

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో 'రాజకీయ శూన్యత' స్పష్టంగా కన్పిస్తోంది. రెండు బలమైన రాజకీయ పార్టీలకు ఇప్పుడు నాయకత్వ లోపం స్పష్టంగా కన్పిస్తోంది. డీఎంకేని ఎవరు నడిపిస్తారు.? అన్నాడీఎంకేకి నిఖార్సయిన సారధి దొరుకుతాడా.? అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది. జయలలిత మనసులో పార్టీ బాధ్యతల్ని, సినీ నటుడు అజిత్‌కి అప్పగించాలని వుండేదట. అదెంత నిజం.. అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఒకవేళ అదే నిజమైతే, అజిత్‌ అతి త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావొచ్చు. 

మరోపక్క, డీఎండీకే పార్టీ పెట్టి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో సక్సెస్‌ అవలేకపోయిన తమిళ హీరో విజయ్‌కాంత్‌కి ఇప్పుడు భలే ఛాన్స్‌ వచ్చిందనే వాదన విన్పిస్తోందిగానీ, రాజకీయంగా ఇప్పుడాయన పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఖుష్బూ, శరత్‌కుమార్‌.. ఇలా పలువురు సినీ ప్రముఖులు తమిళ రాజకీయాల్లో హల్‌చల్‌ చేస్తున్నారు. ఒకప్పుడు ఖుష్బూ డీఎంకేలో కీలక నేతగా వుండేవారు. ఆమెను కరుణానిధి చాలా ప్రత్యేకంగా చూసేవారు. కానీ, ఆమె కాంగ్రెస్‌ నుంచి తిరిగి డీఎంకేలోకి వెళ్ళే అవకాశమే లేదు. 

ఇప్పటికిప్పుడు తమిళ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించకపోవచ్చుగానీ, భవిష్యత్తులో మాత్రం రాజకీయ శూన్యత కాస్తా, రాజకీయ సంక్షోభానికి తెరలేపే అవకాశముంది. కొత్త నాయకులు పుట్టుకొచ్చినా జయలలితకుగానీ, కరుణానిధికిగానీ తమిళనాడు రాజకీయాల్లో రీప్లేస్‌మెంట్‌ లేదన్నది నిర్వివాదాంశం.

Show comments