సోమిరెడ్డిది మ‌రీ విడ్డూరం

గ‌త మూడు ద‌ఫాలుగా నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. మొన్న‌నే రాజ‌మార్గంలో మంత్రి అయ్యాడు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి. మ‌రి మంత్రి అంటే ప్ర‌భుత్వాన్ని వెన‌కేసుకు రావాలి. విమ‌ర్శించే వారిని ఉతికి ఆరేయాలి. మ‌రి ఆ విమ‌ర్శ‌లు చేసేది సొంత పార్టీ మ‌నిషి అయితే.. అయినా త‌గ్గేది లేద‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు మ‌న మంత్రివ‌ర్యులు. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ తోనే క‌డ‌ప‌లో ఢీ అంటే ఢీ అంటూ గ‌ట్టి పిడుగే అనిపించుకుంటున్న టీడీపీ ఎమ్మెల్సీ స‌తీష్‌రెడ్డి మీద‌ మంత్రిగారు తిడ్ల‌దండ‌కం ఎత్తుకుని స‌భికుల‌ను కంగు తినిపించాడు. ఇంత‌కీ విష‌య‌మేంటంటే క‌డ‌ప జిల్లా ఇంచార్జి మంత్రిగా సోమిరెడ్డి ఎన్నికైన సంద‌ర్భంగా అక్క‌డ‌ ఒక పార్టీ స‌మావేశం పెట్టుకున్నారు తెలుగుదేశం నేత‌లు.

ఎలాగూ మ‌న పార్టీ స‌మావేశ‌మే క‌దా ఇక్క‌డ కాక‌పోతే మ‌న క‌ష్టాలు ఎక్క‌డ చెప్పుకుంటామ‌నుకున్నాడో ఏమో పాపం స‌తీష్‌రెడ్డి మంత్రి ముందు కొన్ని విమ‌ర్శ‌ల‌లాంటి విన్న‌పాలు చేశాడు. దీంతో అంద‌రి ముందు ఇలా అడుగుతావా? ఏదైనా ఉంటే లోప‌ల మాట్లాడుకోవాలి గానీ అంటూ స‌తీష్‌రెడ్డిపై మంత్రిగారు చిర్రుబుర్రులాడాడు. అసలు స‌తీష్‌రెడ్డి ఏమ‌డిగార‌ని మంత్రి అంత చిందులు తొక్కాడు.. వృద్ధుల‌కు పెన్ష‌న్‌, రైతుల‌కు స‌బ్సిడీ.. ప్ర‌భుత్వ ఉద్యోగులు 60 ఏళ్ల‌కు రిటైర‌వ‌గానే పింఛ‌ను ఇస్తారు.. మ‌రి రైతుల‌కు 65 ఏళ్లు నిండితే గానీ పింఛ‌ను ఇవ్వారా? అని అడిగాడు.. నిజ‌మే క‌దా ఉద్యోగులు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారంటే ముస‌లి వ‌య‌సు వ‌చ్చించ‌ద‌నే క‌దా.. మ‌రి ఉద్యోగుల వృద్ధాప్యాన్ని 60 రోజ‌లుగా ప‌రిగ‌ణిస్తున్న ప్ర‌భుత్వం మ‌రి రైతుల‌కు 65 ఏళ్లకు గానీ ఎందుకు ఇవ్వ‌రు అని అడిగితే త‌ప్పా.

ఇంకో విష‌యం ఏంటంటే.. రైతుల‌కు అందించాల్సిన పంట స‌బ్సిడీ నేరుగా అందించ‌కుండా బాకీ చెల్లేసుకోవ‌డం ఏంట‌ని.. ఇదీ మంచి ప్ర‌శ్నే. ఎందుకంటే మ‌న ముఖ్య‌మంత్రి గారు బ్యాంకులోని మ‌న బాకీల‌న్నీ తీరుస్తాడులే అనుకుని పాపం మ‌న అమాయ‌క రైతులు కొంద‌రు బ్యాంకు లోన్లు చెల్లించ‌లేదు. దీంతో రైతు అకౌంట్‌లో ఏ చిల్ల గ‌వ్వ ఏ మూల నుంచి జ‌మైనా బాకీ కింద ప‌ట్టేసుకుంటున్నారు బ్యాంకు అధికారులు. పంట సీజ‌న్‌కు ముందు ప్ర‌భుత్వం నుంచే అందే స‌బ్సిడీ కూడా అలాగే ప‌ట్టేసుకోవ‌డంతో పాపం రైతులు లబోదిబోమంటున్నారు.. దానికి రైతుల మంత్రి, అదేనండీ వ్య‌వసాయ మంత్రి స‌మాధానం చెప్పాల్సింది పోయి ఠాట్‌.. ఇలా మాట్లాడ‌తావా.. ప‌ది మందిలో పార్టీ ప‌రువు పోదా.. నిజ‌మైనా అలా మాట్లాడ‌కూడ‌దు అంటూ అంద‌రి ముందే తిట్ల దండ‌కం అందుకున్నార‌ట‌. దీంతో త‌న ప్ర‌సంగాన్ని మ‌ధ్య‌లోనే ఆపేసి వేదిక మీద నుంచి స‌తీష్‌రెడ్డి కింద‌కు దిగిపోయాడు. అలా ఉంది మ‌న మంత్రి గారి తీరు.. మ‌రే ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తే ఊరుకుంటారా.. ఏంటి. అది ప్ర‌తిప‌క్ష‌మైనా.. స్వ‌ప‌క్ష‌మైనా రియాక్ష‌న్ ఒకేలాగా ఉంటుంది. ఆ విష‌యం స‌తీష్‌రెడ్డికి ఇప్పుడైనా అర్థ‌మయి ఉండాలి.

Show comments